Best Diploma Courses After 10th: Have you written Polyset Exam? These are the best diploma courses currently in demand
Best Diploma Courses After 10th: మీరూ పాలీసెట్ పరీక్ష రాశారా? ప్రస్తుతం డిమాండ్ ఉన్న బెస్ట్ డిప్లొమా కోర్సులు ఇవే.
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్ధులు ఎంచుకునే కెరీర్ ఆప్షన్లలో పాలిటెక్నిక్ ఒకటి. పాలీసెట్ రాసి అందులో ర్యాంకు ఆధారంగా నచ్చిన కోర్సులో సీట్లు పొందొచ్చు. అయితే మారుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా పాలి టెక్నిక్‌లో ఏ కోర్సు తీసుకోవాలి? అనే దానిపై విద్యార్ధుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ వివరాలు మీ కోసం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమండ్ ఉంది. ఈ కోర్సులు చదవాలనుకునే వారు పాలిటెక్నిక్‌లో ఆయా బ్రాంచుల్లో డిప్లొమా కోర్సులో చేరచ్చు. ఇప్పుడీ కోర్సులు కూడా పాలిటెక్నిక్‌లో చేర్చారు. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఈ కోర్సులు పూర్తైన తర్వాత వెంటనే ఉద్యోగాలూ పొందవచ్చు. లేదంటే స్వయం ఉపాధి ఎంచుకోవచ్చు లేదా ఉన్నత విద్య అభ్యసించేందుకు బాటలు వేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతకు అనుకూలమైన అటువంటి కొన్ని డిప్లొమా కోర్సుల ఇవే..
త్వరగా ఉద్యోగం పొందాలంటే డిప్లొమా బెస్ట్ మార్గం:
టెక్నాలజీపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలో స్థిరపడాలనుకునే వారు డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పట్టున్నవారు వీటిల్లో బాగా రాణించగలరు. కొన్ని బ్రాంచీల్లో కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం కూడా పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా కోర్సుల్లో చేరడానికి పాలిటెక్నిక్ పాలీసెట్ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇందులో మంచి ర్యాంకు సాధించిన వారికి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.
డిప్లొమా కోర్సుల వివరాలు:
సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎంబడెడ్ సిస్టమ్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ.. వంటి తదితర బ్రాంచ్‌లలో ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్ కోర్సుల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
డిప్లొమా కోర్సులు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు. రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులకు డిప్లొమాతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జేఈ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తుంది. లెవెల్-6 పే స్కూల్ కింద రూ.35,400 నుంచి సుమారు రూ.55,000 వరకు ప్రతి నెలా జీతం పొందవచ్చు.
ఇంకా ఏయే విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చంటే..
రాష్ట్ర స్థాయిలో విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో డిప్లొమాతో ఉద్యోగాలు పొందవచ్చు. అలు ప్రైవేటు రంగంలో కూడా డిప్లొమా కోర్సులతో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్లు, ఇంజినీరింగ్ సంస్థల్లో కూడా ఎన్నో ఉద్యోగావాకాశాలు యువతకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక కోర్సు పూర్తైన తర్వాత కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలు ప్రాంగణ నియామకాలూ జరుగుతాయి. క్యాంపస్ ప్లేస్‌మెట్స్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. రైల్వేలో లోకో పైలట్ పోస్టులకు కూడా సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా చేసిన వారు అర్హులు.
సాధారణంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్‌లకు ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ విభాగం వాళ్లకు విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో జాబ్స్ ఉంటాయి. సివిల్ డిప్లొమా చేసిన వారికి నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో కొలువు దక్కించుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు.. కోస్టుగార్డులో యాంత్రిక్ పోస్టులకు డిప్లొమానే అర్హత.
పాలి టెక్నిక్ డిప్లొమా తర్వాత ఉన్నత విద్య చదవాలంటే..
డిప్లొమా తర్వాత ఉన్నత విద్య చదవాలనుకునే వారు ఈసెట్ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ర్యాంకు తెచ్చుకున్న వారు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు పొందవచ్చు. అలాగే వీరు ఎంసెట్, ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ కూడా రాయవచ్చు. బీటెక్‌తో సమానమైన.. అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఏఎంఐఈ) కోర్సు కూడా చదవచ్చు. అనంతరం నేరుగా ఎంటెక్‌లో ప్రవేశాలు పొందవచ్చు. కొన్ని డిప్లొమాలు చేసిన వారికి నేరుగా బీఎస్సీ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు పొందడానికి అనుమతి ఉంటుంది. అలాగే పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్ కోర్సులు కూడా ఉన్నాయి.
కొన్నేళ్లుగా.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్, వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, 3డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీ మీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ.. మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నాయి. పాలీసెట్ ద్వారా వీటిల్లోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ, బీటెక్‌లోనూ చదువుకోవచ్చు.
COMMENTS