Akshaya Tritiya 2024: On the day of Akshaya Tritiya, arches of mango and Ashoka leaves are thrown at the door.. Do you know the reason?
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కడతారు.. రీజన్ ఏమిటో తెలుసా?
హిందూమతంలో వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున సంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీ దేవికి ఇంట్లో స్వాగతం చెప్పడానికి.. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, అశోక ఆకులను తోరణాలుగా కడతారు. ఇంటి ప్రధాన ద్వారంపై విల్లు కట్టడం లక్ష్మీ దేవి స్వాగతానికి చిహ్నం. ఇలాంటి ఇంట్లో ఉన్నవారిపై లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుందని.. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్వాసం.
అక్షయ తృతీయ రోజున కొన్ని సాధారణ పనులు చేస్తే సంపదల దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు జీవితంలో ఆర్థికంగా లాభపడతారని విశ్వాసం. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ తిథిని జరుపుకోనున్నారు. ఈ రోజు ఉదయం 5:35 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పూజకు అనుకూలమైన సమయం.
లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ.. శుభం కలగాలని అక్షయ తృతీయ రోజున మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో చేసిన తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలుగుతుందని.. ఇంటిలో సానుకూల శక్తి ఉంటుందని విశ్వాసం. అంతేకాదు డబ్బు ఇబ్బందులు తీరతాయని ఆర్ధికంగా లాభాలను పొందుతారు. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్మకం.
మామిడి ఆకుల తోరణం:
హిందూ మతంలో మామిడి తోరణాలు విశిష్ట స్తానం ఉంది. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు ఇలా సంతోషకరమైన సందర్భంలోనైనా మామిడి ఆకులను తోరణాలుగా కట్టి.. ఇంటి ద్వారాలను అలంకరిస్తారు. కొంతమంది మామిడి ఆకుల మధ్య అందం కోసం బంతి పువ్వులను కూడా చేర్చి మాలగా అల్లుతారు. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు కలశాన్ని కూడా మామిడి ఆకులతో ఏర్పాటు చేస్తారు.
అశోక ఆకుల తోరణం:
అశోక ఆకులను కూడా హిందువులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ఆకులతో చేసిన తోరణాలను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీస్తారు. అశోక ఆకులతో పాటు బంతి పువ్వులను జత చేసి తోరణం గా అల్లితే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ దండను తలుపులకు ఇరువైపులా వేలాడదీసినా అందంగా కనిపించడంతో పాటు.. దీని నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
జీవితంలో ఆర్ధిక పురోగతిని పొందడానికి అక్షయ తృతీయ రోజున బంగారు ఆభరణాలు లేదా నాణెం కొనుగోలు చేసి ఉత్తరం వైపు ఉంచవచ్చు. మర్నాడు దానిని తీసుకుని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధినేత కుబేరుడు.. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి జీవితంలో పురోభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. అంతే కాకుండా జీవితంలోని అడ్డంకుల నుంచి ఉపశమనం పొంది ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
COMMENTS