Entrance Exams: Don't worry if you don't qualify JEE.. Admissions in top colleges with these entrance tests!
Entrance Exams: జేఈఈ క్వాలిఫై అవ్వకపోయినా డోంట్ వర్రీ.. ఈ ఎంట్రన్స్ టెస్టులతో టాప్ కాలేజీల్లో అడ్మిషన్స్!
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్). టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అయిన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఇది గేట్‌వే. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష చాలా కఠినమైనది. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే క్వాలిఫై అవుతుంటారు. అయితే ఈ ఎగ్జామ్‌లో సరైన స్కోర్ చేయని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు టాప్ కాలేజీల్లో అడ్మిషన్స్ కల్పిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
* BITSAT:
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)- పిలానీ ఏటా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (BITSAT)ను నిర్వహిస్తుంది. జేఈఈ తరువాత అత్యంత ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో ఇది ఒకటి. కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ విభాగాల్లో బీటెక్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తుంది. బిట్‌షాట్ సెషన్-1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 19న ప్రారంభమై, 24వ తేదీ ముగుస్తుంది. బిట్స్‌లో ఇంజనీరింగ్ చదవాలంటే యాన్యువల్ ఫీజు రూ.2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలు ఉండవచ్చు.
* SRMJEEE:
SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏటా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. SRM జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (SRMJEEE) పేరుతో నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తుంది. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండవచ్చు.
* VITEEE:
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT).. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (VITEEE)ను నిర్వహిస్తుంది. ఈ టెస్ట్ ద్వారా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నవంబర్ నుంచి మార్చి మధ్యలో నిర్వహిస్తారు. ఈ ఏడాది VITEEE ఎంట్రెన్స్ టెస్ట్ ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరుగుతోంది.
* MHT CET:
మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (MHT CET) అనేది మహారాష్ట్రలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంట్రెన్స్ టెస్ట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జనవరి నుంచి మార్చి మధ్య జరుగుతుంది. బీటెక్ కోర్సుల ఫీజు రూ.1.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉండవచ్చు.
* KIITEE:
కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్(KIITEE)ను నిర్వహిస్తుంది. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి బీటెక్ ప్రోగ్రామ్‌ల్లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు. కోర్సుల ఫీజు రూ.1.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. KIIT ప్రవేశ పరీక్ష దరఖాస్తు విండో సాధారణంగా డిసెంబర్, మార్చి మధ్య ప్రారంభమవుతుంది.
COMMENTS