UPSC: In front of the target..Poverty is small..Beedi worker's child who showed potential in civils results..!
UPSC: లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..!
UPSC Civils 27th Ranker Sai Kiran: కరీంనగర్ జిల్లాకు చెందిన బీడీ కార్మికురాలి కుమారుడు సివిల్స్ లో 27వ ర్యాంకు సంపాదించాడు. పేదరికాన్ని జయించి విజేతగా నిలిచాడు. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కాంతారావు, లక్ష్మీలది పేదకుటుంబం. వీరికి సాయికిరణ్, స్రవంతి ఇద్దరు సంతానం. కాంతారావు 2016లో మరణించాడు. అప్పటి నుంచి లక్ష్మీ బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చదివించింది. అమ్మ కష్టాన్ని చూసి చలించిన సాయికిరణ్, స్రవంతి కష్టపడి చదివారు. మొదట స్రవంతి ఏఈగా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం బోయినపల్లిలో విధులు నిర్వహిస్తోంది. అక్క స్పూర్తితో తమ్ముడు సాయికిరణ్ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. కష్టపడి చదివాడు. తాజాగా ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించాడు.
సాయికిరణ్ ఐదోతగరతి వరకు వెలిచాలలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఇంటర్ వరకు కరీంనగర్‌లో (Karimnagar) పూర్తి చేశాడు. 2012లో 9.8 జీపీఏతో పదో తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించాడు. అనంతరం వరంగల్ నిట్‌లో బీటెక్ ఈసీఈ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని క్వాల్కమ్ సంస్థలో సీనియర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగంలో చేరాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వారాంతపు సెలవుల్లో ఇంటి వద్ద చదువుకొని యూపీఎస్సీకి (UPSC) ప్రిపేర్ అయ్యాడు. మొదటిసారి 2021లో సివిల్స్ పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. రెండో ప్రయత్నంలో 27వ ర్యాంకు సాధించారు.
అమ్మ తన కష్టాన్ని తమకు చెప్పేది కాదని..పేదరికం ప్రతిసారి వెక్కిరించినప్పటికీ తాను నిర్ణయించుకున్న లక్ష్యం ముందు అది చిన్నదిగా కనిపించిందన్నాడు సాయికిరణ్ (Sai Kiran). అందుకే పట్టుదలతో చదివి తానేంటనేది లోకానికి చూపించాలనుకున్నానని..లక్ష్యం కన్నా.. ఐఏఎస్ కావాలనే సంకల్పాన్ని తనలో అణువణువునా నింపుకొని లక్ష్యాన్ని పెట్టుకుని సాధించినట్లు చెప్పాడు. తనకు వచ్చిన ర్యాంకు ప్రకారం ఐఏఎస్ వస్తుందని సాయి కిరణ్ అన్నారు. ఇలా తన తల్లి కష్టాన్ని చూసి కసితో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన సాయి కిరణ్ మరెందరికో ఆదర్శంగా నిలిచాడు.
COMMENTS