Lifestyle: Why does nail biting occur? How to avoid
Lifestyle: అసలు గోళ్లు కొరికే అలవాటు ఎందుకు వస్తుంది? ఎలా మానుకోవాలి..
మనలో చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లలకే కాకుండా కొందరు పెద్దలు కూడా గోళ్లు కొరుకుతుంటారు. గోళ్లు కొరకడం మంచి అలవాటు కాదని తెలిసినా ఈ అలవాటును అస్సలు మానుకోలేకపోతుంటారు. ఆటోమెటిక్‌గా వాటంతటవే గోళ్లు నోట్లోకి వెళ్లిపోతుంటాయి. అయితే ఇంతకీ అసలు ఈ అలవాటు ఎలా వస్తుంది.? దీనిని మానుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా గోళ్లు కొరికే అలవాటు చిన్ననాటి నుంచే వస్తుంది. దీంతో ఇది క్రమేణా పెద్దయ్యాక కూడా ఒక అలవాటుగా మారిపోతుంది. చాలా మంది అసలు గోళ్లు కొరుతున్నామని తెలియకుండానే ఆ పనిచేస్తుంది. ఈ అలవాటును వైద్య పరిభాషలో ఒనికోఫాగియా అని పిలుస్తారు. అయితే గోళ్లు ఎందుకు కొరుతారనే దానికి ఎలాంటి నిర్ధిష్ట కారణం లేకపోయిన్పటికీ.. కొందరు మాత్రం టెన్షన్, ఆతృతతో గోళ్లు కొరుకుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యవల్ల వారికి తక్షణ ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఇదొక అలవాటుగా మారుతుందని అంటున్నారు. గోళ్లను కొరకడం వల్ల భయం, ఆతృత, పిడ్రెషన్ డిజార్డర్ వంటివి తగ్గిన భావన కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అయితే వినడానికి గోళ్లు కొరకడం చిన్న సమస్యలాగే అనిపించినా ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గోళ్లలో ఉండే మురికి నోట్లోకి వెళ్లి కడుపులో ఇన్ఫెక్షన్లను అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా నిత్యం గోళ్లను కొరకడం వల్ల వేళ్ల చివర ఉండే చర్మం దెబ్బతింటుంది. వేళ్లు అందవిహీనంగా మారుతాయి. గోళ్లను కొరకడం వాటిని మింగడం వంటివి చేయడం వల్ల పేగు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు.
అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మొదటిది మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడమే. గోళ్లను అందంగా తీర్చిదిద్దుకుంటే వాటిని కొరకాలనే భావన కలగదు. నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల కూడా గోళ్లు కొరికే ఆలోచన తగ్గిపోతుంది. దీనికి కారణం నెయిల్ పాలిష్ చేదుగా ఉండడమే. ఒక ఒత్తిడికి గురైన సమయంలో సొంపు వేసుకోవడం లేదా చూయింగమ్ తినడం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
COMMENTS