Elections: When elections come, they are a rush.. Do you know where party flags and scarves are made?
Elections: ఎన్నికలు వస్తే వాటిదే హడావిడి.. పార్టీల జెండాలు, కండువాలు ఎక్కడ తయారవుతాయో తెలుసా..?
రాజకీయ పార్టీ అనగానే గుర్తుకు వచ్చేదీ జెండా, కండువాలు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రచారంతో హోరెతిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి ప్రతి రాజకీయ పార్టీకి బ్యానర్లు, జెండాలు, కండువాలు, తోరణాలు అవసరం. అవి లేకుంటే.. ఆ సభలు, సమావేశాలు, సమ్మేళనాలకు పొలిటికల్ కలర్ ఎట్రాక్షన్ ఉండదు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఉపయోగించే కీలకమైన జెండాలు, బ్యానర్లు, కండువాల తయారీతో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ఎన్నికలు రాజకీయ నేతల గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. కొందరికి మాత్రం పండగే. ముఖ్యంగా ప్రచార సామాగ్రి తయారు చేసే వ్యాపారాలకు భారీగా గిరాకీ ఉంటుంది. ఫ్లెక్సీలు, జెండాలు, పోస్టర్లు, కరపత్రాలు తయారు చేసే కంప్యూటర్ గ్రాఫిక్స్, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎన్నికలు ముగిసే వరకూ చేతినిండా పని ఉంటుంది. పార్టీల నాయకులు ముందస్తుగా పెద్ద మొత్తంలో ప్రచార సామాగ్రిని అందుబాటులో ఉంచుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఉపయోగించే పార్టీల జెండాలు,తోరణాలు, బ్యానర్ల తయారీకి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కేంద్రంగా మారింది.
చౌటుప్పల్ మండల కేంద్రంలోని మారుతీ కోటెక్స్ కంపనీ ఆయా పార్టీల నుండి లభించే ఆర్డర్స్ ఆధారంగా సామగ్రి తయారు చేస్తోంది. కంపెనీలో రాత్రింబవళ్లు పనిచేసి ప్రతిరోజు లక్ష మీటర్ల జెండాలు, బ్యానర్లు, కండువాలను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ తయారవుతున్న జెండాలు, బ్యానర్లు, కండువాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల జెండాలు, బ్యానర్ల తయారీలో కార్మికులు బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సిద్ధం సభలకు సంబంధించిన జెండాలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.
రంగులు, డిజైన్లను బట్టి ధరలు..
జెండాల తయారీకి కేంద్రంగా ఉన్న చౌటుప్పల్ లో జెండాలు, బ్యానర్లు, కండువాలకు కచ్చితంగా ధర అంటూ ఏమీ లేదు. జెండాలోని గుర్తులు, అందులోని రంగులు, డిజైన్ల ఆధారంగా ధరను నిర్ణయిస్తున్నారు. జెండా మొత్తం ఒకే రంగులో ఉంటే ఏడు రూపాయలు, రెండు రంగులు ఉంటే రూ.7.50, ఆపై ఉంటే రూ.8కి మీటర్ చొప్పున ధర పలుకుతోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, ఎంఐఎం పార్టీలతో తయారవుతున్నాయి. వీటితోపాటు దేవాలయాలకు సంబంధించి శ్రీరాముడి చేతిలో బాణం, హనుమాన్ జెండాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ కంపెనీకి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
ఇప్పటి వరకు 50లక్షల మీటర్ల సామాగ్రి ఉత్పత్తి..
దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అవసరమైన సామాగ్రిని ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 లక్షల మీటర్లు, తెలుగుదేశం పార్టీకి ఆరు లక్షల మీటర్లు, కాంగ్రెస్ పార్టీకి నాలుగు లక్షల మీటర్లను సరఫరా చేశారు. బీజేపీకి నాలుగు లక్షల మీటర్లు, డీఎంకేకు మూడు లక్షల మీటర్లు, అన్నా డీఎంకేకు మూడు లక్షల మీటర్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెండు లక్షల మీటర్లు, జనసేన పార్టీకి లక్ష మీటర్ల సామాగ్రిని సరఫరా చేసామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలతో పాటు వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు వినియోగించే (శ్రీరాముడి, హనుమాన్ గుర్తులు ) జెండాలు, బ్యానర్లను ఐదు లక్షల సామాగ్రిని కూడా ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. రాజకీయ పార్టీలకు అవసరమైన ఎన్నికల సామాగ్రిని ఈ కంపెనీ సరఫరా చేస్తుండడంతో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కూడా లభిస్తోంది.
COMMENTS