PM Surya Ghar Subsidy: Center Scheme.. How to Apply for Free Current
PM Surya Ghar Subsidy: కేంద్రం స్కీమ్.. ఫ్రీ కరెంట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.. అకౌంట్లోకి ఇలా రూ. 78 వేలు!
PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా.. రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్- పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ వస్తుంది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలి. సబ్సిడీ నగదును ఎలా పొందాలి. తెలుసుకుందాం.
Solar Rooftop Scheme: దాదాపు కోటి ఇళ్లకు ఫ్రీ కరెంట్ అందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్కీమ్.. పీఎం సూర్య్‌ఘర్- ముఫ్త్ బిజ్లీ యోజన. దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది. సబ్సిడీ కూడా వస్తుంది. ఇలా సౌర విద్యుత్ వాడితే 300 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ పడదు. ఈ పథకం 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీంకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపి రూ. 75,021 కోట్లు కేటాయించింది. ఇక ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి. రాయితీ ఎంత వస్తుంది.. ఎలా వస్తుంది చూద్దాం.
కేంద్రం- ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని పలు భాగాలుగా విభజించింది. 1 కిలోవాట్ సామర్థ్యానికి రూ. 30 వేలు సబ్సిడీ అందుతుంది. రెండు కిలోవాట్ల వ్యవస్థ కోసం రూ. 60 వేలు సబ్సిడీ వస్తుంది. ఇక 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా రూ. 78 వేలు రాయితీ అందుకోవచ్చు. దీని కోసం రూ. 1.45 లక్షలు ఖర్చవుతుందని అంచనా. దీంట్లో దాదాపు సగం రాయితీ వస్తుంది.
రాయితీ కాకుండా మిగతా నగదును.. ఎలాంటి పూచీకత్తు అవసరమే లేని రుణంగా బ్యాంక్ ఇస్తుంది. రెపో రేటుకు 0.50 శాతం అదనంగా వసూలు చేయనుండగా.. ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉంది. అంటే చాలా తక్కువ వడ్డీనే అని అర్థం చేసుకోవచ్చు.
>> ఈ స్కీంలో భాగంగా ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మొదటి 300 యూనిట్లు లబ్ధిదారు ఉచితంగా వాడుకోవచ్చు. మిగతా 600 యూనిట్లను నెట్ మీటరింగ్‌తో అమ్ముకోవచ్చు. నెలకు దాదాపు దీని ద్వారా రూ. 1265 ఆదాయం వస్తుంది. రూ. 610 ని బ్యాంక్ రుణవాయిదా కింద జమ చేసుకుంటుంది. దీని కింద ఏడేళ్లలో ఆ రుణం కూడా తీరిపోనుంది.
>> నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1-2 కిలోవాట్ల రూఫ్ టాప్ వ్యవస్థ సరిపోతుంది.
>> 150-300 యూనిట్లు వాడే వారికి 2-3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి.
ఎలా అప్లై చేసుకోవాలి.. సబ్సిడీ ఎలా వస్తుంది?
ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే.. తొలుత https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో అప్లై దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. దీని కోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
రెండో స్టెప్‌లో కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అక్కడే రూఫ్‌టాప్ సోలార్ పథకం కోసం అప్లై చేసుకోవాలి.
అప్లై చేశాక.. డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాక.. మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాలేషన్ అయ్యాక.. ప్లాంట్ వివరాల్ని పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేయాలి.
నెట్ మీటర్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. డిస్కమ్ అధికారులు తనిఖీలు చేసి.. తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
ఈ రిపోర్ట్ పొందాక.. మీ బ్యాంక్ డీటెయిల్స్ సహా క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్లో సబ్మిట్ చేస్తే.. 30 రోజుల్లోగా సబ్సిడీ మీ అకౌంట్‌లో జమవుతుంది.
COMMENTS