Mysore Paints: Huge demand for ink drop..
Mysore Paints: సిరా చుక్కకు భారీ డిమాండ్.. లోక్‌సభ ఎన్నికలకు రూ.55 కోట్ల ఆర్డర్.. ఇది వేసిన వెంటనే ఎందుకు పోదు!
భారతదేశం రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL), చెరగని సిరా తయారీ సంస్థ, డిమాండ్‌ను తీర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. నివేదికల ప్రకారం.. కంపెనీ 26.55 లక్షల సిరా బాటిళ్ల కోసం ఎన్నికల సంఘం నుండి అతిపెద్ద ఆర్డర్‌ను అందుకుంది. దీని విలువ రూ.55 కోట్లు. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ప్రకారం, ఆర్డర్ అందుకున్న తర్వాత కనీసం 70 శాతం ఉత్పత్తి పూర్తయింది. మిగిలిన సీసాలు మార్చి 15 నాటికి సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపింది. 10 mg ఇంక్ ఉండే ప్రతి సీసా దాదాపు 700 మంది ఓటర్లకు వేయవచ్చు. నకిలీ ఓట్లను నియంత్రిచేందుకు ఈ ఎంతగానో ఉపయోగపడనుంది.
2024 సార్వత్రిక ఎన్నికల కోసం మేము అందుకున్న ఆర్డర్ ఇప్పటివరకు మా అతిపెద్దది. మేము ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ అండ్ కాశ్మీర్‌కు చాలా సిరా బాటిళ్లను పంపిణీ చేశాము. ఇప్పుడు మా దృష్టి కేరళ , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సిరా ఉత్పత్తి చేయడంపై ఉందని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ K మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు.
దేశీయ డిమాండ్‌తో పాటు, కంపెనీ ఎగుమతి ఆర్డర్‌లను కూడా నెరవేరుస్తోందన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ ఓటింగ్ ప్రక్రియల కోసం ఈ కంపెనీ సీరాపై ఆధారపడుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతుండటంతో, ఈ కీలకమైన ఉత్పత్తికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో, మేము కంబోడియా, ఫిజి దీవులు, సియెర్రా లియోన్, గినియా-బిస్సావు వంటి దేశాల నుండి చిన్న ఎగుమతి ఆర్డర్‌లను పూర్తి చేశామని, ఇప్పుడు మంగోలియా, ఫిజి దీవులు, మలేషియా, కంబోడియా నుండి ఆర్డర్‌లను తీసుకునేందుకు ప్రాసెస్ చేస్తున్నామమని మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు.
చెరగని ఇంక్ ఫార్ములేషన్‌లో కీలకమైన సిల్వర్ నైట్రేట్ ధర హెచ్చుతగ్గుల కారణంగా, ప్రతి సీసా ధర మునుపటి ఎన్నికలలో రూ.160 నుండి రూ. 174 కి సవరించినట్లు తెలిపారు. కంపెనీ సాంప్రదాయ గ్లాస్ వైల్స్‌కు ప్రత్యామ్నాయంగా మార్కర్ పెన్నులను అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా అన్వేషిస్తోంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఉత్పత్తి అని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం చారిత్రాత్మక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎంపీవీఎల్ చెరగని సిరా స్థిరమైన సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సిరా వేసిన వెంటనే ఎందుకు చెరిగిపోదు..
ఎన్నికల ఓటింగ్ సమయంలో వేసే ఈ సిరా చుక్క కనీసం 72 గంటల వరకు చెరిగిపోకుండా ఉంటుందట. వేలిపై నీటి తాకిడి వల్ల ఇది మరింతగా నలుపుగా మారి ఎక్కువ సమయం ఉంటుంది. ఇక దీని తయారీలో సిల్వర్ నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. అందుకే ఇది చెరిగిపోకుండా ఉంటుంది. దీని వల్ల నకిలీ ఓట్లు వేసేందుకు ఆస్కారం ఉండదు.
COMMENTS