Indiramma house scheme.. 5 lakh plus another lakh for all of them..!
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. వాళ్లందరికీ 5 లక్షలతో పాటు మరో లక్ష అదనం..!
తెలంగాణలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం కింద.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయటంతో పాటు ప్రతి లబ్దిదారునికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు. అయితే.. లబ్దిదారుల్లో దళితులు, గిరిజనులు ఉన్నట్టయితే.. వారికి మరో లక్ష అదనంగా చెల్లిస్తూ.. మొత్తంగా 6 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ స్కీంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేయబోయే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్దిదారులకు.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. ఇక స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షల రూపాయాలు కూడా ఇవ్వనుంది. అయితే.. దీంతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల్లో గిరిజనులు, దళితులు ఉంటే.. వాళ్లకు రూ.5 లక్షలతో పాటు మరో లక్ష అదనంగా ఇవ్వనున్నట్టు.. భద్రాచలంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా.. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కాగా.. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేదలంతా ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకం లబ్దిదారుల్లో దళితులు, గిరిజనులు ఉంటే.. వాళ్లకు అదనంగా మరో లక్ష రూపాయలు కలిపి.. మొత్తం 6 లక్షలు అందిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
మరోవైపు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క వివరించారు.
అయితే.. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రేషన్ కార్డే ప్రామాణికమని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలమైనా ఉండాలి లేదా ప్రభుత్వం నుంచి స్థలం పొంది ఉండాలి. ఇక.. గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారు కూడా అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నవాళ్లు కూడా లబ్ది పొందొచ్చు. ఇక ఒంటరి, వితంతు మహిళలూ కూడా లబ్ధిదారులేనని ప్రభుత్వం చెప్తోంది.
ఈ ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేయనున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. వంటగది, బాత్రూం ప్రత్యేకంగా నిర్మించటంతో పాటు.. RCC రూఫ్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటుంది. బేస్‌మెంట్ స్థాయిలో ఒక లక్ష మంజూరు చేయనున్నారు. పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో ఇంకో లక్ష.. ఆ తరవాత 2 లక్షలు మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్షతో మొత్తం 5 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే.. దళితులు, గిరిజనలకు మరో లక్ష అదనంగా చెల్లించటంతో.. మొత్తం 6 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
COMMENTS