Huge reduction in the price of cooking gas.. Modi announced for women
Gas Price Today: కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు.. మహిళల కోసం ప్రకటించిన మోదీ.
International Womens Day: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వంటగ్యాస్ ధరల్ని రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం రోజు కేబినెట్ సమావేశంలో ఇప్పటికే కేంద్రం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కేంద్రం శుభవార్త చెప్పింది.
PM Modi Slashes Gas Prices: సామాన్యులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ సిలిండర్ ధరల్ని మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ ధరల్ని రూ. 100 తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా పోస్ట్ చేశారు మోదీ. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఈ నిర్ణయం ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మా నారీ శక్తికి ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. గతేడాది రాఖీ సందర్భంగా కూడా ఆగస్ట్ 29న మహిళలకు గిఫ్ట్‌గా గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ. 200 చొప్పున మోదీ ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 955 గా ఉండగా.. కేంద్రం తాజా నిర్ణయంతో అది రూ. 855కి చేరనుంది. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903 గా ఉండగా.. ఇప్పుడు రూ. 803 కు తగ్గనుంది. ఇక్కడ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఇక్కడ రూ. 1795 వద్ద ఉంది. హైదరాబాద్‌లో రూ. 2027 వద్ద ఉంది. ఈ రేట్లు కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ ధరల్ని పెంచుతున్నప్పటికీ.. ఇంట్లో వాడే వంటగ్యాస్ ధరల్ని మాత్రం స్థిరంగా ఉంచుతూ వచ్చింది. ఇప్పుడు తగ్గించింది.
మహిళా సాధికారత కోసమే..
వంటగ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడంతో.. తాము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం సహా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు ప్రధాని. ఇది మహిళలకు సాధికారత కల్పించడం సహా వారికి సులభతర జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా ఉందని చెప్పారు.
గురువారం రోజు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న రాయితీని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఉజ్వల పథకం కింద ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ. 300 సబ్సిడీ అందిస్తోంది. అంటే వారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు రూ. 655 కే లభించగా.. ఇప్పుడు రూ. 100 తగ్గగా రూ. 555కే అందనుంది.
2016లో కేంద్రం ఉజ్వల పథకం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల వారికి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి కోసం ఈ పథకం తీసుకొచ్చింది. దీని కింద గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగానే అందిస్తారు. మార్కెట్ ధరకే తొలుత గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాలి. తర్వాత అకౌంట్లో సబ్సిడీ పడుతుంది.
COMMENTS