Virji Vora: Richest person in history than Ambani.. who gave loan to British people..
Virji Vora: చరిత్రలో అంబానీని మించిన ధనవంతుడు.. బ్రిటీషోళ్లకే అప్పు ఇచ్చిన ఘనుడు.. ఎవరంటే..
Virji Vora: వ్యాపారం అంత ఈజీ కాదు. వ్యాపారం చేసి అందరూ అంబానీలంత గొప్పోళ్ళు అయిపోలేరు. అంబానీ అంటే గుర్తొచ్చింది.. ఇప్పుడంటే మనకి తెలిసి అంబానీ..అదానీ.. టాటా ఇలా ప్రపంచస్థాయి ధనవంతులైన వ్యాపారవేత్తలు కొందరు ఉన్నారు. కానీ, మన దేశంలో నాలుగు శతాబ్దాల కిందట కూడా ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు ఉన్నారని తెలిస్తే అవాక్కవుతారు కదూ. భారతదేశం గురించి చెప్పమని ఎవరినైనా అడిగితే.. సంస్కృతీ.. సంప్రదాయం.. ఇలా ఓ లిస్ట్ చెబుతారు. కానీ, దానిలో వ్యాపారం గురించి ఎవరు చెప్పరు. కానీ, మన సంస్కృతి ఎంత గొప్పదో.. ప్రపంచస్థాయిలో మన వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు శతాబ్దాల క్రితమే కుబేరులుగా వెలిగిన వ్యాపార హీరోలు ఉన్నారు. వారి గురించి పెద్దగా ఎక్కడా చర్చలో లేదు. మనం అసలు తెలుసుకోలేము. కానీ, ఇలాంటివి చెప్పడానికే కదా మేమున్నాం.. ఇప్పటి మన అంబానీ.. ఆదానీలను తలదన్నే వ్యాపారవేత్త ఒకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం బ్రిటిషర్లు వచ్చాకే.. భారతదేశం విదేశీ వ్యాపారవేత్తలతో సంబంధాలు కలిగివుందని అనుకుంటాం. కానీ, అంతకు చాలా ముందు నుంచే మన దేశం ఇతర దేశాల వ్యాపారవేత్తలతో సంబంధాలను కలిగి ఉంది. చరిత్రలో మన దేశం ప్రపంచ వ్యాపారానికి ప్రముఖ కేంద్రంగా ఉంది. భారతీయ వ్యాపారవేత్తలు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో వాణిజ్యంలో నిమగ్నమై ఉన్నారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడ్డారు. భారతదేశం ఎందరో అత్యుత్తమ వ్యాపారవేత్తలను ప్రపంచానికి అందించింది. సుగంధ ద్రవ్యాలు.. పత్తి వంటి వివిధ వస్తువులను ప్రపంచ మార్కెట్‌కు మన దేశమే పరిచయం చేసిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి మన దేశ వ్యాపార సామ్రాజ్యంలో విశేషమైన వ్యక్తి విర్జీ వోరా, ఇతను బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ద్వారా అత్యంత ధనిక వ్యాపారవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు.
విర్జీ వోరా (Virji Vora)మొఘల్ కాలంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఈయన 1617 – 1670 మధ్యకాలంలో ఈస్టిండియా కంపెనీకి ముఖ్యమైన ఫైనాన్షియర్‌గా ఉన్నాడు. అతను ఒక సమయంలో కంపెనీకి భారీ మొత్తంలో రూ. 2,00,000 అప్పుగా ఇచ్చాడని చెబుతారు. అంటే.. బ్రిటిష్ కంపెనీకి అప్పు ఇచ్చేస్థాయిలో అప్పట్లో భారత వ్యాపారవేత్తలు ఉన్నారంటే ఆశ్చర్యమే కదూ. 1590లో జన్మించిన విర్జీ వోరా సుమారు రూ. 8 మిలియన్ల అంటే అప్పట్లో 80 లక్షల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ఉన్నారు. అతని కాలంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా వోరా(Virji Vora) నిలిచారు. ఈయన సంపాదనను ఇప్పటి లెక్కలలో చెక్ చేస్తే (ద్రవ్యోల్బణం వంటి లెక్కలు అన్నీ వేసిన తరువాత) ఆయన నికర విలువ ఇప్పుడు మన దేశంలోని అత్యంత సంపన్నమైన వారిగా చెప్పుకునే ముఖేష్ అంబానీ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మొఘలుల కాలంలోనే మన దేశంలో అంబానీ అంత గొప్ప వ్యాపారవేత్త ఉన్నారన్నమాట.
విర్జీవోరా ఏ వ్యాపారం చేశేవారంటే..
విర్జీ వోరా (Virji Vora)మిరియాలు, బంగారం, ఏలకులతో సహా చాలా రకాల ప్రోడక్ట్స్ హోల్ సేల్ బిజినెస్ చేశేవారని చారిత్రిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈయన 1629 – 1668 మధ్య బ్రిటిష్ వారితో లాభదాయకమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈయన అప్పట్లో ఏదైనా ప్రోడక్ట్ కి సంబంధించి మొత్తం కొని స్టాక్ చేసుకునేవాడు. తరువాత దానిని విపరీతమైన లాభాలకు ఆమ్మేవాడని చెబుతారు. అంటే, డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతాన్ని అప్పట్లోనే అయన పాటించడాని అర్ధం చేసుకోవచ్చు. లెండర్ గా.. అంటే అప్పులు ఇచ్చేవాడిగా.. ఆయనకు అద్భుతమైన పేరు ఉంది. బ్రిటిషర్లు కూడా ఆయన(Virji Vora) వద్ద అప్పులు చేశేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని జయించాలనే తన ప్రచారంలో ఆర్థిక సహాయం కోసం విర్జీ వోరాను సంప్రదించినట్లు కూడా కొన్ని చారిత్రక కథనాలు సూచిస్తున్నాయి.
విర్జీ వోరా (Virji Vora)వ్యాపారం భారతదేశంలో మాత్రమే కాకుండా పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియాలోని ప్రధాన ఓడరేవు నగరాలకు కూడా విస్తరించింది. ఆగ్రా, బుర్హాన్‌పూర్, డెక్కన్‌లోని గోల్కొండ, గోవా, కాలికట్, బీహార్, అహ్మదాబాద్, వడోదర, బరూచ్‌లతో సహా ఆ కాలంలోని వివిధ క్లిష్టమైన వ్యాపార కేంద్రాలలో అతనికి ఏజెంట్లు ఉండేవారు.
అదండీ విషయం.. మనదేశం సంస్కృతికంగానే కాదు వ్యాపార వాణిజ్యాల్లోనూ శతాబ్దాల క్రితం నుంచే తనదైన ముద్రవేసింది అనడానికి విర్జీవోరా(Virji Vora) లాంటి వ్యాపారవేత్తలే ఒక ఉదాహరణ. చరిత్ర ఇలాంటి వారిని ఎందర్నో చూసింది. ఇప్పుడు మనం అంబానీ గురించి చెప్పుకున్నట్టు అప్పుడు ఈ వోరా గురించి ప్రజలు చెప్పుకునే ఉంటారు. మరి అంతటి వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు ఏమైంది అనేది చరిత్రగా మిగిలిపోయింది.
COMMENTS