Nominee | Are you taking the nominee issue lightly?
Nominee | నామినీ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా.. ఈ సమస్యలు తప్పవు !
కేతన్ ఓ ప్రైవేట్ ఉన్నతోద్యోగి. హైదరాబాద్‌లోని బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వయస్సు 45 సంవత్సరాలు. మొదట్నుంచీ అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి హార్ట్ అటాక్‌తో మరణించాడు.
కేతన్ ఓ ప్రైవేట్ ఉన్నతోద్యోగి. హైదరాబాద్‌లోని బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వయస్సు 45 సంవత్సరాలు. మొదట్నుంచీ అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి హార్ట్ అటాక్‌తో మరణించాడు. తన పేరు మీద ఎల్‌ఐసీలో రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ, రూ.30 లక్షల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు రూ.70 లక్షల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు ఉన్నట్టు తేలింది. కేతన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు మైనర్లు. తండ్రి సంపాదనపైనే ఆధారపడినవాళ్లు. అలాగే కేతన్ తల్లిదండ్రులిద్దరూ తనతోనే ఉండేవారు. వీళ్లకు అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. కేతన్ ఎప్పుడూ తన ఆఫీసు పనిపైనే దృష్టిపెట్టేవాడు. అందుకే నామినీ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. కానీ హఠాత్తుగా చనిపోవడంతో వాటాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టే నామినీ అంశాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
అంతా నామినీలకేనా?..
నామినీగా ఎవరి పేరుంటే ప్రయోజనం వాళ్లకే ఉంటుందంటే కూడా సరికాదు. అసలైన హక్కుదారులెవరో గుర్తించి, వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే నామినీ పాత్ర కీలకమవుతుంది. అందుకే కుటుంబ తగాదాలు, డబ్బుల కోసం గొడవలుపడి తిట్టుకోవడం కంటే నామినీల విషయంలో క్లియర్‌కట్‌గా ఒక లెక్కాపత్రాన్ని మనందరమూ తయారు చేసుకోవాలని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. లీగల్‌గా ఆస్తి పత్రాలే రాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఒకవేళ ఏదైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటో కూడా గమనించి మనం ముందు జాగ్రత్తపడాలి. పైన చెప్పిన కేతన్ విషయంలో భార్యాపిల్లలకే మొత్తం డబ్బులిచ్చేస్తే, తల్లిదండ్రుల పరిస్థితేంటి?.. వాళ్ల బాగోగులు చూసే వాళ్లెవరు?.. కాబట్టి పెట్టుబడులు, ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ఆచితూచి వ్యవహరించి, అందరికీ లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటే.. ఎటువంటి ఇబ్బందులూ రావని అంటున్నారు.
కుటుంబ సభ్యులకు చెప్పండి:
బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు, ఇన్సూరెన్స్.. ఇలా ఏది చేసినాసరే కుటుంబ సభ్యులకు వాటి గురించి చెప్పడం ఉత్తమం. వాళ్లకు తెలియకపోతే మీరెన్ని పెట్టుబడులు పెట్టినా వృథానే అని మరువద్దు. మీ తదనంతరం మీవాళ్లు కోర్టులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టవద్దు. సక్సెషన్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. ఇందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమాచారమేదీ లేకపోతే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్‌కో, ఆర్బీఐ ఖాతాల్లోకో వెళ్లిపోయి మీ కష్టం బూడిదపాలవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద రూ.35,012 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయంటే నామినీకున్న ప్రాధాన్యతను మీరే అర్థం చేసుకోవచ్చు. అందుకే నామినీ పేరు తప్పక సూచించండి. ఆ పేరు రాసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీమా సొమ్ముకు భార్య పేరును.. షేర్లు, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, మ్యూచువల్ ఫండ్స్‌కు చదువుకునే పిల్లలను.. మనపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఎఫ్‌డీలు అందేలా చర్యలు తీసుకుంటే ఉత్తమమని చెప్పవచ్చు. మొత్తానికి కుటుంబ పరిస్థితులనుబట్టి మనం బ్రతికున్నప్పుడే ఓ తెలివైన నిర్ణయం మాత్రం తీసుకోవాలి.
COMMENTS