LIC Amritbaal: LIC ``Amritbaal'' for higher education of children.. These are the policy details..!
LIC Amritbaal :పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం ఎల్ఐసీ `అమృత్ బాల్`.. ఇవీ పాలసీ డిటైల్స్..!
LIC Amritbaal : గతంతో పోలిస్తే ఇప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. చిరుద్యోగులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లైనా, ప్రభుత్వోద్యోగులైనా, వ్యాపారులైనా తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. మున్ముందు ఉన్నత విద్యాభ్యాసం కోసం భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయాలని భావించే వారి కోసం ‘అమృత్ బాల్’ అనే పాలసీ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూయల్, సేవింగ్స్ జీవిత బీమా పథకం.
శనివారం నుంచే ప్రారంభమైన ఈ బీమా పాలసీని పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేసే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని తెచ్చింది ఎల్ఐసీ. ఇందులో అతి తక్కువ బీమా చెల్లింపు గడువు ఉంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది. పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం 18 -25 ఏండ్ల వయస్సు మధ్య బీమా పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా ఈ పాలసీ అప్లయ్ చేయొచ్చు. గరిష్టంగా 13 ఏండ్ల వయస్సు గల పిల్లల పేరిట తీసుకోవచ్చు. పాలసీ కనిష్ట మెచ్యూరిటీ 18 ఏండ్లు, గరిష్ట వయస్సు 25 ఏండ్లుగా నిర్ణయించారు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏండ్లు, గరిష్టంగా 25 ఏండ్లు ఉంటుంది.
ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉన్నది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం కనీస పాలసీ టర్మ్ ఐదేండ్లు, గరిష్ట పాలసీ టర్మ్ 25 ఏండ్లు ఉంటుంది. కనీస సమ్ హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితుల్లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాలను పరిగణనలోకి తీసుకుని, వారి ప్రీమియం చెల్లింపు ఆధారంగా పాలసీ తీసుకొచ్చు. బీమా పాలసీపై ప్రతి రూ.1000 లకు ప్రతిఏటా రూ.80 చొప్పున పాలసీ ఉన్నంత కాలం కలుస్తుంది. పాలసీ చెల్లింపు సమయంలో పాలసీదారుడికి ఏమైనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్లు అందిస్తారు.
ఈ పాలసీలో పలు రకాల రైడర్లు కూడా ఉన్నాయి. ప్రీమియం బెనిఫిట్ రైడర్ ప్రకారం.. పాలసీదారుడికి ఏదైనా జరిగితే మిగతా బీమా గడువు వరకూ ఎల్ఐసీనే ప్రీమియం చెల్లిస్తుంది. ఎనిమిదేండ్ల లోపు పిల్లలపై తీసుకున్న పాలసీ.. ఎనిమిదేండ్లు వచ్చిన తర్వాత/ పాలసీ తీసుకున్న రెండేండ్ల తర్వాత అమల్లోకి వస్తుంది. ఎనిమిదేండ్లు దాటిన పిల్లల పేరిట తీసుకుంటే వెంటనే పాలసీ రిస్క్ అమలవుతుంది.
ఈ పాలసీ కింద రుణం కూడా తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ -1లో ఏడు రెట్లు, ఆప్షన్-2లో పది రెట్ల రిటర్న్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్-3లో 1.25 రెట్లు, ఆప్షన్-4 ప్రకారం 10 రెట్లు బెనిఫిట్ ఉంటుంది. ఐదేండ్ల ప్రీమియం ఆప్షన్-1 కింద రూ.99,625, ఆప్షన్ 2 కింద రూ.1,00,100, ఆరేండ్ల ప్రీమియం ఆప్షన్ -1 కింద రూ.84,275, ఆప్షన్ -2లో రూ.84,625, ఏడేండ్ల ప్రీమియం టర్మ్ ఆప్షన్ -1 కింద రూ.73,625, ఆప్షన్ -2లో రూ.73,900 పే చేయాలి. ఇక సింగిల్ ప్రీమియం పాలసీలో ఆప్షన్-3 కింద రూ.3,89,225, ఆప్షన్ -4 కింద రూ.4,12,600 చెల్లించాల్సి ఉంటుంది.
COMMENTS