Hello chai..! This is the new idea of Khammam youth.
హలో చాయ్..! అంటూ ఖమ్మం యువకుడి సరికొత్త ఆలోచన.. స్వయం కృషితో ఇలా..
ఖరీదైన కార్లలో వెళ్లి కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం చేస్తున్న కొందరు యువకులకు సంబంధించిన వార్తలు గతంలో మనం చూశాం..అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ యువకుడు వినూత్న వ్యాపారం ప్రారంభించాడు. ఉన్నత చదువులు చదివిన అతడు.. ఉద్యోగం రాలేదని నిరాశపడలేదు.. సొంత తెలివి తేటలతో సొంతంగా ఎవరూ ఊహించని వ్యాపారం మొదలు పెట్టాడు. చిన్న చితక ఉద్యోగం చేస్తూ.. చాలి చాలని జీతంతో కష్టపడే బదులు.. ఇలా వ్యాపారం చేస్తూ.. తనకు తానే ఓనర్ జీవించటం ఎంతో గొప్పగా ఉందని చెబుతున్నాడు..ఇంతకు అతడు మొదలు పెట్టిన వ్యాపారం ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పూర్తి వివరాల్లోకి వెళితే…
ఖమ్మం యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఉన్నత చదువులు చదువుకున్నాడు.. చదువు తగ్గ ఉద్యోగం వస్తుందని ఆశపడి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు..అనుకున్న ఉద్యోగం రాలేదు.. చివరకు విసిగి పోయిన అతడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ కు చెందిన సందీప్ అనే యువకుడు ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. సందీప్ తన సొంత ఆలోచనతో ఒక పాత ట్రాలీ ఆటో ను కొనుగోలు చేశాడు. దానిని ఒక మొబైల్ టీ స్టాల్ గా మార్చాడు.
పాత ట్రాలీ ఆటోను ఒక టీ కప్పు ఆకారంలో మొబైల్ టీ స్టాల్ తయారు చేయించాడు.. ఖమ్మం జిల్లా వైరాలో ఇది తయారైంది. సందీప్ టీ స్టాల్‌కు హెలో చాయ్ అని పేరు పెట్టాడు. ఖమ్మం నగరంలోని ప్రధాన సెంటర్లలో ఈ మొబైల్ టీ స్టాల్‌ని నడుపుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఈ మొబైల్ టీ స్టాల్ తయారు చేయడానికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్పాడు. తనకు ఉద్యోగం రాలేదని ఎవరినీ నిందించడం లేదని అన్నాడు. ఎవరిమీద ఆధార పడకుండా సొంత ఆలోచనతో ఈ మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. తమలాంటి యువతను ప్రోత్సహించాలని సందీప్ కోరుతున్నాడు.
COMMENTS