Disinvestment: Privatization of giant bank SBI.. Nirmala Sitharaman's announcement!
Disinvestment: దిగ్గజ బ్యాంక్ SBI ప్రైవేటీకరణ.. నిర్మలా సీతారామన్ ప్రకటన!
Disinvestment: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2వ తేదీన కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రభుత్వ బ్లూ చిప్ కంపెనీలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)ల్లో ఈక్విటీ వాటా విక్రయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు పెద్ద సంస్థలతో పాటు మరిన్ని పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్నారు. కీలక వ్యూహాత్మక పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో 50 శాతం కన్నా తక్కువగా మైనారిటీ వాటా కలిగి ఉండాలన్న ఆలోచనకు ప్రభుత్వం వ్యతిరేకం కాదంటూ నెట్‌వర్క్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆర్థిక మంత్రి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్‌జీసీ ప్రభుత్వ కంపెనీల్లో తమ వాటాను 49 శాతం అంత కంటే తక్కువగా ఉంచేందుకు ఇష్టపడతారా అని నెట్‌వర్క్18 ఎడిటర్ ప్రశ్నించగా తప్పకుండా అని సమాధానమిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 'మీరు గతంలోని డేటాను పరిశీలిస్తే పెట్టుబడుల ఉపసంహరణలను చూసుకునే విభాగం DIPAM క్రమంగా చాలా ప్రభుత్వ వాటా షేర్లను మార్కెట్లలోకి విడుదల చేసింది. తద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు వస్తాయి. వారు ఆ షేర్లను కొనుగోలు చేయవచ్చు.' అని సమాధానమిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వం మెజారిటీ వాటా కలిగి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం వాటా 57.49 శాతంగా ఉండగా.. ఓఎన్‌జీసీలో ప్రభుత్వం వాటా 58.89 శాతంగా ఉంది.
గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో తమ వాటాను తగ్గించుకుంది. అయితే, ఇటీవలి కాలంలో ఒక్క ఎయిరిండియాలో మాత్రమే కంట్రోలింగ్ చేసే స్థాయిలో వాటాను విక్రయించింది. ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రభుత్వ రంగ కంపెనీల విలువను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటొందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రభుత్వం రంగ లిస్టెడ్ కంపెనీలు, వాటి వాల్యుయేషన్ పరిశీలిస్తే వాటిలో తీసుకొచ్చిన మార్పు కనిపిస్తుందని గుర్తు చేశారు. షేర్ల ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. డివిడెండ్లు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక చిన్న విషయమని పేర్కొన్నారు. వాటికి విలువను తీసుకువచ్చేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
COMMENTS