Budget 2024: This is a scheme to make poor women millionaires.. Seethamma's key announcement in the budget..
Budget 2024: పేద మహిళలను లక్షాధికారులను చేసే స్కీమ్ ఇది.. బడ్జెట్లో సీతమ్మ కీలక ప్రకటన..
పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అనేక పథకాలను వీరి సంక్షేమం కోసం అమలు చేస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని తీసుకొచ్చింది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలను లక్షాధికారులను చేసేలా లఖ్ పతి దీదీ అనే పథకాన్ని ప్రకటించారు. దీని సాయంతో ఒక మహిళ ఏడాదిలో కనీసం రూ. లక్ష సంపాదించే విధంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఇది స్వయం సహాయక గ్రూపులో ఉండే సభ్యులకు వర్తిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెరుగైన లక్ష్యం దిశగా..
మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అవి మహిళల సాధికారత స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. వాటి విజయాన్ని మరింత పేంచేందుకు వీలుగా మహిళలను లక్షాధికారులను చేసే విధంగా మెరుగైన లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వాస్తవానికి ఈ లఖ్ పతి దీదీ పథకం గతేడాదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆయన పథకం గురించి వివరించారు. దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 20 మిలియన్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు దీనిని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీని పరిధి కేవలం రూ. 2కోట్ల వరకూ మాత్రమే ఉండేది. ఇప్పుడు దీనిని రూ. 3కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్‌ఈడీ బల్బుల తయారీ, డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.
మహిళలకు మరిన్ని వరాలు..
నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ఇతర బడ్జెట్ ప్రకటనలలో మహిళలకు అగ్ర తాంబూలం ఇచ్చారు. అందులో ప్రధానమైనది హెల్త్ కేర్ పాలసీ. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది.
COMMENTS