National Voters’ Day
National Voters’ Day: నేడు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్, ఇతర విశేషాలు..
National Voters’ Day: అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters’ Day) ప్రారంభించింది. ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం (India). ఇలాంటి దేశంలో పట్టణాల్లో నివసించే కొందరు ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రావట్లేదు. ఓటు హక్కును పొందేందుకు యువత ఆసక్తి చూపట్లేదు. కొందరు ఓటు వేయడం నామోషీగా భావిస్తుంటారు. ఇలాంటి అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters’ Day) ప్రారంభించింది. ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. మన దేశంలో ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. 2011 నుంచి ఈ జాతీయ దినోత్సవాన్ని భారతీయులు జరుపుకుంటున్నారు.
* ఎలా ఆవిర్భవించింది?
జాతీయ ఓటర్ల దినోత్సవం అనే భావన 2011లో తెరపైకి వచ్చింది. ఎక్కువ మంది యువతను ఎలక్షన్ పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆవిర్భవించింది. యువతలో ఓటరు నమోదు తగ్గుదలకు ప్రతిస్పందనగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది.
అప్పటినుంచి భారత ఎన్నికల సంఘం (ECI) జనవరి 1న 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్లందరినీ గుర్తించి, వారిని ఎన్రోల్ చేస్తూ వస్తోంది. వారికి ఏటా జనవరి 25న ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (EPIC) అందజేస్తుంది. జనవరి 25న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే 1950, జనవరి 25వ తేదీనే ఎన్నికల సంఘం ఏర్పాటయింది.
* నేషనల్ ఓటర్స్ డే 2024 థీమ్:
Nothing Like Voting, I Vote For sure
* నేషనల్ ఓటర్స్ డే ప్రాముఖ్యత:
ఓటుకి ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల ఓట్లు మాత్రమే స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఎవరు అధికారాన్ని చేపట్టాలో నిర్ణయిస్తాయి. తద్వారా దేశం విధానాలు, దిశను నిర్దేశిస్తాయి. కాబట్టి ఓటింగ్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కాలానుగుణంగా జనాభా అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నందున, దేశ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ మరింత ఇంపార్టెంట్‌గా మారింది. అందుకే యువ తరం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ఎంకరేజ్ చేయాలి. అందుకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం ఎంతో ముఖ్యం.
* స్వేచ్చ, స్వాతంత్ర్య భావనకు ఓటింగ్ ముఖ్యం:
జాతీయ ఓటరు దినోత్సవం అనేది ఓటు ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి, ఎన్నికలలో ఎక్కువ మంది వ్యక్తులను, ముఖ్యంగా కొత్తగా అర్హులైన ఓటర్లను పాల్గొనేలా ప్రోత్సహించడానికి జరుపుకునే రోజు. తమ నాయకులను ఎన్నుకోవడానికి, తమ దేశం ఎలా నడుస్తుందో చెప్పడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గం. ఇది ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్చ, స్వాతంత్ర్య భావనను సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవాలు 2011 నుంచి నిర్వహించడం ద్వారా తప్పకుండా ఓటు వేయాలని భావనను ప్రజలలో కలిగించడం చాలా వరకు సాధ్యమైంది.
COMMENTS