Scholarships: These are the government scholarships and fellowships available to poor students.
Scholarships: పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు ఇవే..
బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక చాలామంది విద్యార్థులకు ఉంటుంది. అయితే పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది ఉన్నత విద్య లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక సాధికారత, సంక్షేమ మంత్రిత్వ శాఖ వీటిని అర్హులకు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్, వీటికి సంబంధించిన అర్హతలు తెలుసుకోండి.
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్:
అమెరికా, బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే SC, ST విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ప్రారంభించారు. దీని కింద ఎంపికైన వారిలో.. అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు 15,400 పౌండ్లు, బ్రిటన్‌లో చదువుతున్న వారికి 9,900 పౌండ్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. 2022-23 సంవత్సరంలో 125 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందించారు.
రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్:
ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ స్కాలర్లకు ఈ ఫెలోషిప్ అందుబాటులో ఉంటుంది. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కింద సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో ఎంఫిల్/పీహెచ్‌డీ చేస్తున్న వారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ. 31,000; మిగిలిన 3 సంవత్సరాలు నెలకు రూ. 35,000 ఫెలోషిప్ లభిస్తుంది.
సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్:
ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే మెరిట్ ఎస్సీ విద్యార్థులకు ఈ స్కీమ్ కింద స్టైఫండ్ అందిస్తారు. ప్రైవేట్ రంగంలో చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.
నేషనల్ ఫెలోషిప్ ఫర్ SC, ST, OBC:
ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్న రిసెర్చ్ స్కాలర్స్‌కు ఈ ఫెలోషిప్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ప్రకారం JRFలకు నెలకు రూ. 37,000; SRF నెలకు రూ. 42,000 స్టైఫండ్ ఐదేళ్లపాటు అందుతుంది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ SC స్టూడెంట్స్:
ఈ స్కాలర్‌షిప్ నాలుగు విభాగాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. గ్రూప్ 1లో మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్ మొదలైన వాటిలో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు ఉంటారు. మేనేజ్‌మెంట్, మెడిసిన్, CA/ICWA/CS/ICFA లేదా MPhil, PhD మరియు పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో PG డిప్లొమాలో ప్రవేశం పొందిన విద్యార్థులు సైతం ఉంటారు. వీరికి 10 నెలల పాటు, నెలకు రూ.1200 చొప్పున స్టైఫండ్ వస్తుంది. హాస్టలర్లకు రూ.550, దృష్టిలోపం ఉన్నవారికి రూ.240 చొప్పున అలవెన్స్ కూడా లభిస్తుంది.
గ్రూప్ 2లో ఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ రంగాలలో డిగ్రీ లేదా డిప్లొమా చేస్తున్న విద్యార్థులు ఉంటారు. వీరికి 10 నెలల పాటు నెలకు రూ.820 స్టైఫండ్ లభిస్తుంది. హాస్టళ్లలో ఉండే వారికి రూ.530, దృష్టి లోపం ఉన్నవారికి రూ.240 చొప్పున అలవెన్సులు ఇస్తారు. గ్రూప్-1, 2లో కవర్ కాని గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే వారికి గ్రూప్ 3 కింద స్టైఫండ్ ఇస్తారు. హాస్టలర్లకు నెలకు రూ. 570 స్కాలర్‌షిప్, రూ. 300 అలవెన్సులు, దృష్టి లోపం ఉన్నవారికి రూ. 200 అలవెన్సులు ఇస్తారు. గ్రూప్ 4లో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వారికి నెలకు రూ. 380 స్కాలర్‌షిప్, రూ. 230 హాస్టల్ అలవెన్స్, దృష్టి లోపం ఉన్నవారికి రీడర్ అలవెన్స్ రూ.160 అందిస్తారు.
COMMENTS