Fact Check: Are old 100 rupee notes getting cancelled?
Fact Check: పాత 100 రుపాయల నోట్లు రద్దవుతున్నాయా..?
100 Rupees Note: పాత 100 రుపాయల నోట్లు రద్దవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..? RBI మాటేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులోకి రావడంతో నిత్యం బోలెడన్ని సమాచారాలు వైరల్ అవుతున్నాయి. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ఓ యూజర్ పాత వంద రూపాయల నోటు రద్దవుతుందంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు వెంటనే ఈ నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవాలని, దీనికి మార్చి 31, 2024 చివరి తేదీగా RBI నిర్ణయించిందని పేర్కొన్నాడు. ఇంకేముంది ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. జనాల్లో పాత 100 రూపాయల నోట్లపై డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇంతలో మరో యూజర్ పోస్ట్ పెడుతూ.. ఓ దుకాణదారుడు పాత 100 రూపాయల నోటు తీసుకోలేదని, దీనికి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ RBIని ట్యాగ్ చేశాడు.
మరి నిజంగానే పాత 100 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారా? మార్కెట్ లో ఈ నోటు చలామణి నిలిపివేయబోతున్నారా..? అనేది ఇప్పుడు చూద్దాం. అసలు పాత 100 రూపాయల నోట్లకు సంబంధించి RBI ఎలాంటి ప్రకటన చేయలేదు. వీటిని రద్దు చేయబోతున్నారు అనేది నిజం కాదు. ఈ విషయాన్ని RBIకి చెందిన ఓ ప్రతినిధి స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో నడుస్తున్న పుకార్లకు చెక్ పడింది.
గతంలో భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను రద్దు చేసిన వెంటనే కొత్తగా రూ.500 నోటుతో పాటు రూ.2,000 నోట్లను ప్రింట్ చేసింది ఆర్‌బీఐ. అప్పుడే కొత్త 100 రూపాయల నోటు కూడా ప్రింట్ చేసింది.
COMMENTS