Credit Card: Don't leave the credit card if you don't need it, there are easy ways to cancel it.
Credit Card: క్రెడిట్ కార్డ్ అవసరం లేదనుకుంటే అలాగే వదిలేయొద్దు, సులభంగా క్యాన్సిల్ చేసే పద్దతులున్నాయ్
Credit Card Cancel: భారతదేశంలో మొత్తం 31 బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
వీటిలో మొదటి ఆరు సంస్థలదే ఆధిపత్యం. వీటి మార్కెట్ వాటాను 81% కాగా, మిగిలిన 25 సంస్థల మార్కెట్ వాటా 19%. HDFC బ్యాంక్‌ది లీడర్ పొజిషన్.
ఒక లెక్క ప్రకారం, మన దేశ ప్రజల జేబుల్లో దాదాపు 80 మిలియన్ల (8 కోట్లు) క్రెడిట్ కార్డ్‌లు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మించిన కార్డులు ఉన్నాయి. మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు హై శాలరీడ్ పీపుల్ దగ్గర కనిపిస్తుంటాయి.
అన్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఏం కొనాలన్నీ పర్స్‌లోంచి కార్డ్ తీస్తున్నారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ఏటికేడు క్రెడిట్ కార్డ్‌ల జారీని పెంచుతూ పోతున్నాయి. రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో ప్రాసెసింగ్ ఫీ వంటి కొత్త ఫీచర్లను క్రెడిట్ కార్డ్‌లకు జోడిస్తూ జనానికి గాలం వేస్తున్నాయి. ఈ ఆఫర్లకు ఆకర్షితులవుతున్న జనం కొత్త కార్డులను ఎగబడి తీసుకుంటున్నారు. అప్పటికే ఉన్న కార్డులను గాలికి వదిలేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ రద్దు ఇలా..
మీకు అవసరం లేని, వద్దనుకున్న క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోకుండా అలాగే వదిలి పెట్టడం మీ క్రెడిట్ హిస్టరీకి, ఆర్థిక భవిష్యత్తుకు రిస్క్. అలాంటి కార్డులను తక్షణం క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఏదైనా క్రెడిట్ కార్డ్‌ను మీరు రద్దు చేయాలనుకుంటే, సులభమైన ప్రక్రియలు ఉన్నాయి.
అవసరం లేదు అనుకున్న క్రెడిట్ కార్డును రద్దు చేయడానికి.. సంబంధింత బ్యాంక్, బ్యాంకింగేతర సంస్థ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కస్టమర్లకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లు లేదా కస్టమర్ కేర్ నంబర్లను జారీ చేశాయి. మీరు ఈ నంబర్లకు కాల్ చేసి, కార్డ్ రద్దు చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు. మీరు చేయాల్సింది ఇంతే. రిక్వెస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది.
క్రెడిట్ కార్డ్ రద్దు చేయడానికి రాతపూర్వక దరఖాస్తు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీ SBI క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేయాలని అనుకుంటే, ఆ బ్యాంక్ శాఖకు వెళ్లి సంబంధిత ఫారం సమర్పించవచ్చు. దీని తర్వాత మీ క్రెడిట్ కార్డును బ్యాంక్ క్లోజ్ చేస్తుంది.
బ్రాంచ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మీ క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడానికి బ్యాంక్‌కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు. బ్యాంక్ తన కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ-మెయిల్ IDని జారీ చేస్తుంది. ఆ ఐడీకి ఈ-మెయిల్ చేయడం ద్వారా కార్డు రద్దు కోసం అభ్యర్థించవచ్చు.
ఇంతకంటే సులభమైన మార్గం కూడా ఉంది. క్రెడిట్ కార్డ్‌ను ఆన్‌లైన్ ద్వారా రద్దు చేయడానికి కూడా బ్యాంక్ అనుమతి ఇస్తుంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ రిక్వెస్ట్ పంపవచ్చు. ఆ తర్వాత బ్యాంకు తదుపరి చర్యలు తీసుకుంటుంది.
క్రెడిట్ కార్డ్ రద్దు చేయాలని అనుకుంటే, ముందుగా బకాయి మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. కార్డ్‌లో ఒక్క పైసా బకాయి ఉన్నా మీ క్రెడిట్ కార్డు రద్దు కాదు.
COMMENTS