Budget 2024: Central is preparing for new budget.. Do you know these 5 things..?
Budget 2024: కొత్త బడ్జెట్‌కు సిద్ధమవుతున్న కేంద్రం.. ఈ 5 విషయాలు మీకు తెలుసా..?
భారతదేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబోయే మధ్యంతర బడ్జెట్‌ను 2024 ఫిబ్రవరి 1న సమర్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇది మోదీ ప్రభుత్వం రెండో టర్మ్ చివరి బడ్జెట్ కానుంది. ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్ అవుతుంది. ఈ సందర్భంగా భారతదేశ బడ్జెట్ చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చే బడ్జెట్‌లు తీసుకొచ్చిన ఆర్థిక మంత్రుల గురించి తెలుసుకుందాం.
బడ్జెట్ సమర్పణ చారిత్రక మూలాలు
భారతదేశంలో బడ్జెట్‌లను సమర్పించే సంప్రదాయం 1860లో ఈస్టిండియా కంపెనీ పాలనలో జేమ్స్ విల్సన్ బడ్జెట్‌తో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతరం, మొదటి బడ్జెట్‌ను 1947లో ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి సమర్పించారు. అప్పటి నుంచి దేశంలో 75 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటితో పాటు 14 మధ్యంతర బడ్జెట్లు, నాలుగు స్పెషల్ బడ్జెట్లు ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి 1న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. సమయ పరిమితులు, రెండు పేజీలు మిగిలి ఉన్నందున, ఆమె తన ప్రసంగాన్ని తగ్గించాల్సి వచ్చింది. హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ 1977లో భారతదేశంలో అతి తక్కువగా కేవలం 800 పదాల బడ్జెట్ ప్రసంగం చేశారు.
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పనిచేసిన అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, పదాల పరంగా మొత్తం 18,650 పదాలతో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2018లో 18,604 పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన అరుణ్ జైట్లీ, జాబితాలో మన్మోహన్ తర్వాత ఉన్నారు. ఆ సెషన్‌లో జైట్లీ తన విస్తృతమైన ప్రసంగాన్ని పూర్తి చేయడానికి గంటా 49 నిమిషాల సమయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి బడ్జెట్ సమర్పణలు
భారతదేశంలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం ఆర్థిక మంత్రి బాధ్యత. అయితే ప్రధానమంత్రి ఈ పాత్రను స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బడ్జెట్‌ను సమర్పించడం అనేది ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యమైన రాజకీయ లేదా ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న సమయాల్లో జరిగింది. 1958లో ప్రధానిగా మొదట జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. హరిదాస్ ముంధ్రా వివాదంలో చిక్కుకున్న కారణంగా అప్పటి ఆర్థిక మంత్రి TT కృష్ణమాచారి రాజీనామా చేయడంతో నెహ్రూ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించాల్సి వచ్చింది.
1970లో 14 భారతీయ ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణకు నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన సందర్బంలో.. PM ఇందిరా గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. అలానే 1987-88 ఆర్థిక సంవత్సరంలో, వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు PM రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు.
అత్యధిక బడ్జెట్ సమర్పణలతో ఆర్థిక మంత్రులు
మొరార్జీ దేశాయ్ అత్యధిక సంఖ్యలో కేంద్ర బడ్జెట్లను సమర్పించారు. ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్థానాల్లో పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8, యశ్వంత్ సిన్హా 8, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ తీసుకొచ్చారు.
రైల్వే, యూనియన్ బడ్జెట్ల విలీనం
2017లో రైల్వే బడ్జెట్‌ను యూనియన్ బడ్జెట్‌లో విలీనం చేశారు. అంతేకాకుండా ఆ సంవత్సరం నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన మార్పుల ప్రకారం.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పిస్తున్నారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయాలనే సిఫార్సును నీతి ఆయోగ్ శ్వేతపత్రం రూపంలో సమర్పించింది. ఈ సిఫార్సును అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు అందించారు. దీనిపై స్పందించిన ప్రభు రైల్వే, కేంద్ర బడ్జెట్‌లను విలీనం చేయాలని కోరుతూ అప్పటి ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖ రాశారు. బడ్జెట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని పెంచడం, రైల్వేలు, భారత ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా అరుణ్ జైట్లీ ఈ మార్పులు తీసుకొచ్చారు.
COMMENTS