Bank Accounts: Do you have more than 1 bank account? These are the RBI rules!
Bank Accounts: మీకు 1 కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? RBI రూల్స్ ఇవే!
Bank Accounts: ఇండియాలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అలాంటి వారు ఎక్కువ అకౌంట్లు కలిగివుంటే ఏమవుతుంది అనే అంశంపై చాలా సందేహాలు కలిగివుంటారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన నిబంధనలు తెలుసుకుందాం.
ఆధునిక డిజిటల్ లావాదేవీలలో బ్యాంకు ఖాతా ప్రధానమైనది. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు, ఆన్లైన్లో మనీ సేవ్ చేయడానికీ, లావాదేవీలు చేయడానికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అవుతోంది.
ఈ సందర్భంలో, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసే వారు ఏ కంపెనీలో చేరినా.. ఆయా కంపెనీలు టై అప్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి జీతం పొందుతుంటారు. దాంతో వారి పేరు మీద చాలా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి.
ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు? ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండేందుకు నియమాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పోస్ట్‌లో సమాధానం తెలుసుకోండి.
చాలా మందికి 3 నుండి 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. కొంతమందికి ఇంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి పరిమితి లేదు. బ్యాంకు ఖాతాల సంఖ్యపై RBI ఎలాంటి పరిమితినీ విధించలేదు. అందువల్ల, ఎవరైనా ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా తెరవవచ్చు.
మీరు మీ ఖాతాల నుంచి చెల్లుబాటు అయ్యే లావాదేవీలను కొనసాగిస్తే ఎటువంటి హానీ ఉండదు. మీరు మీ బ్యాంక్ ఖాతాను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, బ్యాంక్ మీ ఖాతాను మూసివేయవచ్చు. కాబట్టి, మీరు మీ అన్ని ఖాతాలను ఉపయోగిస్తూ ఉండాలి. బహుళ బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.
శాలరీ అకౌంట్లు కాకుండా ఇతర పొదుపు ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించడాన్ని అన్ని బ్యాంకులు తప్పనిసరి చేశాయి. అంటే మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే, బ్యాంక్ ఆ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని రుసుముగా తీసుకుంటుంది.
డిడక్షన్ చేసిన తర్వాత కూడా మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే, మీ బ్యాంక్ అకౌట్ నెగెటివ్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా బ్యాంక్ ఖాతాను సరిగ్గా నిర్వహించవచ్చు
ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు, మీరు కనీస నిల్వలు, బ్యాంకు నుంచి సందేశ సేవా రుసుములు, డెబిట్ కార్డ్ రుసుము మొదలైన వాటిని ట్రాక్ చేయాల్సి రావచ్చు. కాబట్టి, అవసరమైన ఖాతాలను మాత్రమే ఉంచడం మంచిది. లేదంటే.. మీకు రుసుముల రూపంలో చాలా మనీ కట్ అవుతూ ఉంటుంది.
COMMENTS