Sukanya Samriddhi Yojana: A great scheme for girls Sukanya Samriddhi.. Should you take money first? Rules are these..
Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల కోసం గొప్ప స్కీం సుకన్య సమృద్ధి.. ముందుగా డబ్బులు తీసుకోవాలా?రూల్స్ ఇవే..
SSY Withdrawal: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అందిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల్లో అత్యంత ఆదరణ పొందింది సుకన్య సమృద్ధి యోజన. దీర్ఘకాలంలో ఇందులో లక్షల రూపాయల బెనిఫిట్ పొందొచ్చు. నెలకు ఇంత చొప్పున కట్టుకుంటూ పోతే చాలు. ఈ స్కీంలో చేరాక 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి.. 21 ఏళ్లకు మెచ్యూరిటీ. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బుల్ని ముందే ఉపసంహరించుకోవాల్సి రావొచ్చు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి.
SSY Interest Rate: డబ్బుల్ని పొదుపు చేసుకునేందుకు.. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకునేందుకు.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తీసుకొచ్చింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి సాధనాలు కూడా ఉన్నప్పటికీ ఆడపిల్లల కోసం అద్భుత పథకం.. సుకన్య సమృద్ధి యోజన. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించింది మాత్రమే. దీంట్లో పదేళ్ల లోపు ఆడపిల్ల చేరాల్సి ఉంటుంది. ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల్ని చేర్చొచ్చు. ఏటా కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇలా 15 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరేళ్లకు అంటే 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ తీరుతుంది. అప్పుడే చేతికి వడ్డీతో కలిపి పెద్ద మొత్తంలో చేతికి నగదు వస్తుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ ప్రకారం చూస్తే.. నెలకు రూ. 12,500 చొప్పున కట్టుకుంటూ పోతే.. దీర్ఘకాలంలో మెచ్యూరిటీ కల్లా దాదాపు రూ. 70 లక్షలు వస్తాయి. అయితే మనకు ఏదైనా కారణంతో డబ్బులు తీసుకోవాల్సి వస్తే.. ఇందులో విత్‌డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందా.. ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకోవచ్చో చూద్దాం.
చదువు కోసం..
అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చినా లేదా 10 వ తరగతి విద్యను పూర్తి చేసినా కూడా.. విద్యా ప్రయోజనాల కోసం సదరు బాలికకు నగదు అవసరాల కోసం సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి డబ్బుల్ని ఉపసంహరించుకోవచ్చు. గత సంవత్సరం అకౌంట్‌లో ఉన్న మొత్తంలో నుంచి 50 శాతం మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ తర్వాత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది.
అమ్మాయి వివాహం..
సుకన్య సమృద్ధి అకౌంట్ హోల్డర్ అయిన అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత .. పెళ్లికి సంబంధించి.. పెళ్లికి ఒక నెల ముందు లేదా పెళ్లి జరిగిన 3 నెలల తర్వాత అకౌంట్‌లో ఉన్న పూర్తి మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వడ్డీతో సహా మొత్తం నగదును మీరు పొందే అవకాశం ఉంటుంది.
చనిపోయిన సమయంలో..
సుకన్య సమృద్ధి అకౌంట్ హోల్డర్ దురదృష్టవ శాత్తు చనిపోయిన సమయంలో ఆ ఖాతాకు సంబంధించి హక్కు.. సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన వ్యక్తికి లభిస్తుంది. డెత్ సర్టిఫికెట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించి.. డిపాజిట్ నిల్వ మొత్తం వడ్డీతో సహా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచిన వ్యక్తి అంటే.. ఆ బాలిక పేరెంట్స్ లేదా సంరక్షకులు అయి ఉంటారు.
పౌరసత్వం విషయంలో..
సుకన్య సమృద్ధి ఖాతా ప్రారంభించిన సమయంలో ఆ అమ్మాయికి భారత పౌరసత్వం ఉన్నప్పటికీ.. తర్వాత డిపాజిట్ కాలవ్యవధి సమయంలో భారత పౌరసత్వం ఏ కారణంతోనైనా కోల్పోతే.. అకౌంట్ క్లోజ్ చేయాలి. ఈ వివరాలను సంబంధిత శాఖకు కూడా తెలియజేయాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉదాహరణకు సదరు బాలిక విదేశాల్లో సెటిల్డ్ అయినా.. అక్కడి పౌరసత్వం పొందినా ఇక్కడ అకౌంట్ మూసేయాలన్నమాట.
గార్డియెన్స్ చనిపోతే..
అకౌంట్ తెరిచిన బాలిక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించిన పక్షంలో.. అకౌంట్ హోల్డర్ అయిన అమ్మాయికి ఆర్థిక సమస్యలు.. లేదా ఇతర ఏదైనా సమస్యలు ఎదురైన సమయంలో కూడా అకౌంట్ ఉపసంహరణకు వీలు ఉంటుంది. ఈ సమయాల్లో ఈ ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత మనం మూసివేసేందుకు.. నగదు తీసుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది.
అత్యవసర పరిస్థితులు..
సుకన్య సమృద్ధి ఖాతా ఉన్నటువంటి అమ్మాయికి ప్రాణాంతక వ్యాధి ఇతర వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల వంటి తీవ్రమైన పరిస్థితుల సమయాల్లో వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి.. అకౌంట్లో మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. ఇంకా అప్పుడే సదరు అకౌంట్‌ను కూడా మూసివేయవచ్చు. ఇక్కడ సుకన్య సమృద్ధి అకౌంట్‌పై గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
COMMENTS