New Ration Card, Good News.. Soon New Ration Cards.. After 10 years..
New Ration Card, గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. 10 ఏళ్ల తర్వాత..
పేదలకు రేషన్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు అందాలంటే ఈ పత్రమే చాలా కీలకం. ఆరోగ్య శ్రీ, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లకు రేషన్ కార్డు తప్పనిసరి. అయితే తెలంగాణలో గత పదేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. లక్షలాది మంది వీటి కోసం ఎదురుచూస్తున్నారు. తమ దరఖాస్తులు పరిశీలించాలని రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చూట్టూ తిరగుతున్నారు.
హెదారాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గత నాలుగేళ్లలో ఏకంగా 3 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వీరంతా ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా పెళ్లై కుటుంబం నుంచి వేరుపడిన వారు, పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్పించే విషయాలపైనా ప్రభుత్వ నుంచి స్పష్టత లేదు.
తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. మొత్తం లబ్ధిదారులు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం 20 లక్షల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి రద్దు చేసినట్లు సమాచారం. అయితే లబ్ధిదారుల ఫిర్యాదుతో వీటిలో 2 లక్షల కార్డులను పునరుద్ధరించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని గతంలో సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
అయితే రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం గత నెలలలోనే కేవైసీ ప్రక్రియ చేపట్టింది. నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని తెలుసుకునేందుకు రేషన్ కార్డులో పేర్లున్న కుటుంబసభ్యులంతా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు ఇవ్వాలని తెలిపింది. కొంత మంది మరణించినా కుటుంబసభ్యులు మాత్రం వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించకుండా అలాగే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరికొందరికి నకిలీ రేషన్ కార్డులున్నాయి. దీంతో వీటిని తొలగించేందుకు ప్రభుత్వం కేవైసీ ప్రారంభించింది. రేషన్ కార్డు నంబర్ ను, ఆధార్ సంఖ్యతో అనుసంధానించి అసలైన లబ్దిదారులను గుర్తిస్తోంది. త్వరలోనే రేషన్ కార్డుల లబ్ధిదారులందరి వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
కేవైసీ ప్రక్రియ సెప్టెంబర్ 30 తో ముగుస్తుందని, ఆ తర్వాత దసరా, దీపావళి సమయంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజురు చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ కేవైసీకి ఇంకా చివరి తేదీ అంటూ ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా చాలా రోజుల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీపై మళ్లీ స్ఫష్టత కరువైంది. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులను మంజురు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దసరా ముందు గానీ, తర్వాత గానీ కొత్త రేషన్ కార్డుల విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం. మరి దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
COMMENTS