IT Notice: Doing these transactions? IT notices may come.. watch out!
IT Notice: ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా? ఐటీ నోటీసులు రావొచ్చు.. చూసుకోండి!
IT Notice: ఆదాయపు పన్ను శాఖ లిమిట్ లోపు లావాదేవీలు జరిపితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఆ పరిమితిని మించి ఉన్న అధిక విలువ లావాదేవీలు చేసినట్లయితే వాటిని ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నోటీసులు వస్తాయి. ఒక్కోసారి జైలు శిక్ష వరకు సైతం వెళ్లవచ్చు.
IT Notice: నిర్దిష్ట పరిమితిని మించి ఉన్న అధిక విలువ గల ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు తప్పనిసరిగా వాటి గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక వేళ వాటిని దాచి పెట్టాలని చూస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. దీంతో చిక్కుల్లో పడతారు. ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే ఐటీ శాఖ పరిమితికి మించిన లావాదేవీలు జరిపినప్పుడు తప్పకుండా వాటి గురించి తెలియజేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్లు కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్థిరాస్తి క్రయవిక్రయాలు: రిజిస్ట్రేషన్ శాఖ రూ.30 లక్షలు అంత కంటే ఎక్కువ స్థిరాస్తి పెట్టుబడి, విక్రయాలను అంటే ఇల్లు, భూమి కొనుగోళ్లను ఐటీ శాఖకు తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్లు చేసిన వారు ఐటీ శాఖ దృష్టిలో ఉంటారు. కొనుగోలుదారుడు పన్ను రిటర్న్స్‌లో ఈ వివరాలను నివేదించారా లేదా అనే విషయాన్ని ఐటీ శాఖ పరిశీలిస్తుంది.
క్రెడిట్ కార్డు బిల్లు: ఒక ఆర్థిక ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినట్లయితే ఆ పేమెంట్స్ తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. మీ క్రెడిట్ కార్డు వివరాలు పాన్ కార్డుతో లింక్ అయి ఉన్నందున ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేస్తారు.
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు: ఒక ఆర్థిక ఏడాదిలో సేవింగ్స్ ఖాతాదారుడు బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్ డ్రా చేస్తే ఐటీ శాఖకు తెలియజేయాలి. కరెంట్ ఖాతాలో అయితే ఈ లిమిటి రూ. 50 లక్షలుగా ఉంటుంది. ఈ వివరాలను ఐటీఆర్ లో తెలియజేయకపోతే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు: రూ. 10 లక్షలకు మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను ఐటీ శాఖకు తెలియజేయాలి. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఎఫ్‌డీలలో ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు తప్పనిసరిగా ఐటీ శాఖకు తెలియజేస్తాయి. దీంతో మీరు దాస్తే ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుంది.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు: ఒక ఆర్థిక ఏడాదిలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు, లేదా డిబెంచర్లలో రూ. 10 లక్షలకు మించి పెట్టుబడి పెట్టినప్పుడు ఈ వివరాలను ఐటీ శాఖకు అందించాల్సి ఉంటుంది.
ఫారెన్ కరెన్సీ: ఒక ఆర్థిక ఏడాదిలో రూ. 10 లక్షలు అంత కంటే ఎక్కువ విలువ గల విదేశీ కరెన్సీ ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్లయితే వాటి వివరాలను ఐటీ శాఖకు తెలియజేయాలి. లేకపోతే నోటీసులు వస్తాయి.
COMMENTS