Govt Scheme: Amazing scheme.. Rs. 2 lakhs, if two Rs. 1 lakh..
Govt Scheme: అద్దిరిపోయే స్కీమ్.. ఒక్క అమ్మాయికి రూ. 2 లక్షలు, ఇద్దరైతే రూ. 1 లక్ష..
ఆడ పిల్లల భ్రూణ హత్యల రేటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సహా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేక చట్టాలు, పథకాలు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితమే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు.. భ్రూణ హత్యలను నివారించేందుకు, లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తూ అనేక పథకాలను తీసుకువచ్చాయి. ఆడ పిల్ల పుడితే కొంత నగదు, అబ్బాయి పుడితే కొంత నగదు చొప్పున సదరు కుటుంబాలకు అందించేవి. ఇక మోదీ ప్రభుత్వం వచ్చాక భేటీ బచావో.. భేటీ పడావో అనే నినాదంతో.. ఆడ శిశువుల హత్యలను నివారించే ప్రయత్నం చేశారు. ఆడ పిల్లల కోసం సేవింగ్స్ స్కీమ్ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాలను తీసుకువచ్చారు. ఇలా ఆడ బిడ్డలను రక్షించుకునేందుకు అనేక ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇక ప్రస్తుతం దేశంలో అసలే ఎన్నికల కాలం నడుస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. ఇంకేముందు.. ప్రధాన రాజకీయా పార్టీలు ఆయా రాష్ట్రాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పథకం ప్రకటించింది. బాలికల రక్షణ కోసం ఇందిరా గాంధీ బాలికా సురక్ష యోజన పథకాన్ని ప్రారంభించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అక్కడి ప్రభుత్వం బాలిక సంరక్షణ కోసం ‘ఇందిరా గాంధీ బాలికా సురక్ష యోజన’ పథకాన్ని అమలు చేసింది. మహిళా భ్రూణ హత్యలను అరికట్టేందుకు ఈ పథకం తీసుకువచ్చినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ఇందిరా గాంధీ బాలికా శిశు రక్షణ పథకం కింద ఒక ఆడపిల్ల తరువాత కుటుంబ నియంత్రణను పాటించే కుటుంబానికి ఇచ్చే రూ. 35 వేల ప్రోత్సాహకాన్ని భారీగా పెంచారు.
అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ. 2 లక్షలకు పెంచారు. అలాగే ఇద్దరు ఆడ పిల్లలు ఉండి కుటుంబ నియంత్రణ పాటించే కుటుంబాలకు ఇచ్చే రూ. 25 వేల ప్రోత్సాహకాన్ని కూడా పెంచారు. దీనిని రూ. 25 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతూ ప్రభుత్వం ప్రకటించింది. 2018-20 SRS డేటా ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ 950 లింగ నిష్పత్తిని కలిగి ఉంది. ఇది దేశంలో మూడవ అత్యధికం. అయితే, ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉండాలని తాము భావిస్తున్నామని, మహిళా శిశవుల హత్యలను నివారించడమే తమ లక్ష్యం అని హిమాచల్ ప్రదేశ్ సీఎం తెలిపారు.
COMMENTS