105 richest people from Telugu states.. Rs. 5.25 lakh crore wealth.. Who is the top?
తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ధనవంతులు 105 మంది.. రూ. 5.25 లక్షల కోట్ల సంపద.. టాప్‌లో ఎవరంటే?
Hurun India Rich List 2023: దేశవ్యాప్తంగా కుబేరుల జాబితాను విడుదల చేసింది 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా. ఈ రెండూ కలిసి సంయుక్తంగా 360 వన్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ పేరిట లిస్ట్ ప్రకటించింది. దేశంలో ముకేశ్ అంబానీ నంబర్‌వన్‌గా నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. టాప్-20లో ఎవరున్నారో మనం తెలుసుకుందాం.
Hurun Global Rich List: భారత కుబేరుల జాబితాను ప్రకటించింది హురూన్ ఇండియా. 360 వన్ వెల్త్‌తో కలిసి సంయుక్తంగా ఈ లిస్ట్ విడుదల చేసింది. దీంట్లో దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానానికి పడిపోయారు. ఇక ఈ ఆగస్ట్ 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా.. భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది ఈ హురూన్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) నుంచి 105 మంది ఉన్నారు. వారిలో ప్రముఖులు ఎవరో చూద్దాం.
ఈ 105 మందిలో మొత్తం అయిదుగురు మహిళలు ఉన్నారు. వీరి మొత్తం సంపద విలువ ఏకంగా రూ. 5.25 లక్షల కోట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. రెండు రాష్ట్రాల నుంచి చూస్తే 12 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొత్తంగా చూస్తే దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ. 37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి లిస్ట్‌లో ఉన్న వారిలో 83 శాతం మంది హైదరాబాద్‌లోనే నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపింది హురూన్. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఈ లిస్ట్‌లోకి ఎక్కారు. వీరి ద్వారానే మొత్తం రూ. 76 వేల కోట్లు యాడ్ అయ్యాయి. హురూన్ జాబితాలో అత్యంత సంపద ఉన్న మహిళగా మహిమా దాట్ల నిలిచారు. ఈమె సంద రూ. 5700 కోట్లు. ఫార్మా సెక్టార్ నుంచే ఏకంగా 33 మంది ఉన్నారు.
టాప్-20లో వారిని చూస్తే మనోజ్ నంబూరు, ప్రవీణ్ కుమార్ సహా జి. రవీంద్ర రావు, కుటుంబం (యశోదా హెల్త్‌కేర్ సర్వీసెస్- రూ. 5400 కోట్లు), ఎన్.విశ్వేశ్వరరెడ్డి, కుటుంబం (షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- 4600 కోట్ల రూపాయలు), ఇంకా రూ. 4300 కోట్లతో సజ్జ కిశోర్ బాబు, కుటుంబం తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారి హురూన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.
కరోనా వాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, కుటుంబం రూ. 5800 కోట్ల సంపదతో 19వ స్థానంలో నిలిచింది. హెటెరో ల్యాబ్స్ జి. పార్థసారధి రెడ్డి, కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మైహోం ఇండస్ట్రీస్ రామేశ్వరరావు జూపల్లి, కుటుంబం సంపద రూ. 17,500 కోట్లు కాగా ఐదో స్థానంలో ఉన్నారు. డాక్టర్ రెడ్డీస్ కె. సతీశ్ రెడ్డి, కుటుంబం ఏడో స్థానంలో, జీవీ ప్రసాద్, కుటుంబం 9వ స్థానంలో నిలిచారు. కిమ్స్ హాస్పిటల్ బి. భాస్కరరావు, కుటుంబం ఈ లిస్ట్‌లో 15వ స్థానంలో ఉంది.
COMMENTS