Telangana: Telangana Govt Teacher's Day Gift.
Telangana: సీఎం కేసీఆర్ టీచర్స్ డే గిఫ్ట్.. 567 మంది గురుకుల కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు.
ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ టీచర్స్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ జీవో జారీ చేశారు. కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల జీతంతో పాటు 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదన్నారు.
గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేస్తూ..12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో వారిలో 504 మంది మహిళలే కావడం విశేషం. ఇక ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.
COMMENTS