Telangana: Birth certificates without mention of caste, religion.. Telangana High Court historic verdict
Telangana: కుల, మత ప్రస్తావన లేని బర్త్ సర్టిఫికేట్లు.. తెలంగాణ హైకోర్ట్ చారిత్రాత్మక తీర్పు..
బర్త్ సర్టిఫికేట్స్‌లో కుల రహిత, మత రహిత కాలాన్ని పొందు పరచాలని తెలంగాణ హైకోర్ట్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు హైకోర్ట్ తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులకు 2019లో కొడుకు జన్మించాడు. ఇవాన్ రూడేగా నామకరణం చేసిన ఆ కుర్రాడి బర్త్ సర్టిఫికెట్ కోసం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు. ఆ సమయంలో బర్త్ సర్టిఫికేట్ ఫారంలో మతం కాలమ్‌ను నింపితే కానీ సర్టిఫికేట్ కుదరదు అన్నారు. అయితే కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న తాము.. మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదని తేల్చి చెప్పారు.
మతం కాలాన్ని నింపితే కానీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని అధికారులు అనడంతో 2019 ఆగస్టు 28న హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేరెంట్స్ డిమాండ్ పై కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ జనన మరణ ధ్రువీకరణ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపింది. ఈ కేసు ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా కుర్రాడికి ఆధార్ కార్డు ఇవ్వలేదు. దీంతో పాఠశాలలో అడ్మిషన్‌కు నిరాకరించారు. దీంతో అత్యవసరంగా తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఎట్టకేలకు తీర్పువెలువరించింది.
ఈ క్రమంలోనే చారిత్రత్మక తీర్పునిచ్చింది. జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఆధారంగా తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లే, నమ్మకం లేని మతన్నా విశ్వసించని హక్కు కూడా ఉంటుందని తెలిపింది. పిటిషనర్లు కోరినట్లు కుల, మత రహిత కాలాన్ని బర్త్ సర్టిఫికేట్‌లో పొందు పరచాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కోర్టు తీర్పుపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్ల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని అంటున్నారు.
COMMENTS