SBI PO Preparation Plan | Bank measure.. easy to achieve
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
SBI PO Notification | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. అతి పురాతనమైన బ్యాంకుల్లో ఒకటి. బ్రాంచీల సంఖ్య, బ్యాంకు సిబ్బంది పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. తాజాగా ఎస్‌బీఐ 2000 పీవో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. అతి పురాతనమైన బ్యాంకుల్లో ఒకటి. బ్రాంచీల సంఖ్య, బ్యాంకు సిబ్బంది పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. తాజాగా ఎస్‌బీఐ 2000 పీవో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు అభ్యర్థులకు సరైన సమయంలో అందివచ్చిన చక్కటి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే ఐబీపీఎస్ ద్వారా గ్రామీణ బ్యాంకు క్లర్క్, పీవోలు, ఐబీపీఎస్ వాణిజ్య బ్యాంకు క్లర్క్, పీవో, ఎస్‌వో (స్పెషలిస్ట్ ఆఫీసర్స్) పోస్టులకు సన్నద్ధమవుతున్న వారికి ఇది ఎక్స్‌ట్రా వరం.
ఎస్‌బీఐ పీవో కోసం ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబించాలి. బ్యాంకు పరీక్షల్లో ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, నాబార్డ్ వంటి పరీక్షలు చాలా కఠినమైనవి. ప్రతి విభాగంలో హెచ్చుస్థాయి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి బ్యాంకు అభ్యర్థులు తమ సాధనలో భాగంగా ఎస్‌బీఐ లెవల్ మోడల్ ఉన్న ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయాలి.
ఎంపిక ప్రక్రియ
ఎస్‌బీఐ పీవో ఎంపిక ప్రక్రియ నాలుగు దశలుగా విభజించారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, సైకో మెట్రిక్ టెస్ట్, జీడీ/ ఇంటర్వ్యూ రౌండ్.
అభ్యర్థులు ప్రతి రౌండ్/ దశలో క్వాలిఫయింగ్ లేదా మెరిట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
ప్రిపరేషన్ స్ట్రాటజీ, పక్కా ప్లాన్‌తో ఎస్‌బీఐ పీవో కొలువు సాధించవచ్చు. ముందుగా ఎస్‌బీఐ పీవో పరీక్ష సరళి, సిలబస్‌ను అర్థం చేసుకోవాలి.
పరీక్షా స్వరూపం
ప్రిలిమ్స్: ఇది ప్రథమ పరీక్ష. ఇందులో మూడు విభాగాలున్నాయి. 100 మార్కులకు/100 ప్రశ్నలు, సమయం 60 నిమిషాలు.
ప్రిలిమ్స్ ప్రథమ దశ. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో విజయం సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు అనుమతిస్తారు. ఎస్‌బీఐలో ఉద్యోగం సంపాదించడం అనేది లక్షల మంది అభ్యర్థుల కల. కొన్నివేల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని తమ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుంటారు. కానీ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యేవారు చాలా తక్కువే ఉంటారు. కాబట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే తప్పకుండా చిట్కాలను పాటించాలి.
మెయిన్స్: ఇది ప్రధాన పరీక్ష. బ్యాంకు ఉద్యోగం పొందడానికి ఈ విభాగంలో మెరిట్ మార్కులు సాధించాలి. ఇందులో మొత్తం 5 విభాగాలుంటాయి. వీటిని 4 భాగాలుగా విభజించారు.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎస్‌బీఐ పీవోలో మంచి అవకాశం ఏంటంటే ఇందులో సెక్షనల్ కటాఫ్ మార్కులు లేవు. కాబట్టి మెరుగైన సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకొనైనా ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇది జాతీయస్థాయి పరీక్ష. కాబట్టి ఎస్‌బీఐ పీవో పరీక్ష కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే నిర్వహిస్తున్నారు. హిందీ మీడియం వారు పోటికి రారు కాబట్టి ఇది కూడా అందివచ్చిన చక్కటి అవకాశం.
3 :- మూడవ దశలో సైకోమెట్రిక్ టెస్టు
4:-నాలుగవ దశలో బృంద చర్చ, ఇంటర్వ్యూ ఉంటాయి.
ప్రిపరేషన్ స్ట్రాటజీ :-
ఎస్‌బీఐ పీవోలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం విభాగాల వారీగా ప్రిపరేషన్ ప్లాన్ అనుసరించాల్సి ఉంటుంది . అభ్యర్థులు ఇప్పటికే ఐబీపీఎస్ (IBPS) పరీక్షల కోసం సన్నద్ధం అవుతుంటే లేదా మొదటిసారి బ్యాంకు పరీక్షలు రాసేవారు సమయ పాలన వ్యూహాన్ని పాటించాల్సి ఉంటుంది .
ప్రతి విభాగంలో ముఖ్యమైన అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కామన్ విభాగాలైన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌లలో హెచ్చుస్థాయి మోడల్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించగల అంశాలను గుర్తించి బాగా ప్రాక్టిసు చేయాలి .
1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ : – ఈ విభాగంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో సాధారణంగా వచ్చే అంశం. ఇందులో శాతాలు, లాభ-నష్టం, నంబర్ సిరీస్, యావరేజస్, సమయం -దూరం, పని, వ్యక్తులు, మిశ్రమం-అలిగేషన్, సాధారణ వడ్డీ- కాంపౌండ్ వడ్డ్డీ, క్వాడ్రాటిక్- ఈక్వేషన్స్, డేటా-వివరణ, డెటా- ఇంటర్పిటేషన్స్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, సంభావ్యత.
మెయిన్స్ డెటా ఎనాలిసిస్/ ఇంటర్పిటేషన్స్ కీలకం : ప్రిలిమ్స్-మెయిన్స్ కోసం బేసిక్స్ నుంచి కఠిన స్థాయి ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్ అంశాల కోసం బేసిక్స్ మ్యాథ్స్ -స్పీడ్ మ్యాథ్స్ వంటి ప్రాథమిక అంశాలపై కమాండ్ సాధించడం ద్వారా మిగత అంశాలపై పూర్తి అవగాహన సాధించడం సులభం అవుతుంది .
పరీక్షకు ఉపయోగపడే 5-6 అంశాలపై పట్టు సాధించడం ద్వారా పరీక్షలో సమయపాలన , షార్ట్‌కట్‌లను అవలంబించవచ్చు .
క్వాంట్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం డేటా ఇంటర్‌ప్రిటేషన్స్. ఇందులో శాతాలు, యావరేజెస్, స్పీడ్ మ్యాథ్స్ వంటివి చాలా కీలకం.
ప్రతి అంశంలో నైపుణ్యం సాధించడమే ఉత్తమ మార్గం.
మంచి మార్కులు సాధించాలంటే పూర్వ ప్రశ్నపత్రాలను తిరిగేయడం, మోడల్ ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి.
పేపర్ పై, ఆన్‌లైన్ తరహాలో కూడా ప్రాక్టీస్ చేస్తే పనితీరు, నాణ్యత, సమయపాలనను తెలుసుకోవచ్చు.
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువగా షార్ట్‌కట్స్‌పైనే ఫోకస్ చేయాలి. క్యాలిక్యులేషన్స్, స్పీడ్ మ్యాథ్స్ వంటివి ప్రతిరోజూ తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
2) రీజనింగ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశల్లో ఉంటుంది. ఈ విభాగం నుంచి కోడింగ్-డీకోడింగ్, లెటర్ సిరీస్, సీటింగ్ అరెంజ్‌మెంట్స్, పజిల్ టెస్ట్, డైరెక్షన్స్, ర్యాంకింగ్, సిలాసిజం, రక్త సంబంధాలు, ప్రతి బింబం, ఇన్‌పుట్-అవుట్‌పుట్ పీవో లెవల్ కోసం స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు చాలా కీలకం.
బ్యాంకింగ్ పరీక్షల్లో రీజనింగ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో 70 శాతం ప్రశ్నలు ఇంగ్లిష్ కంటెంట్ ఆధారిత క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ వంటి అంశాలే అధికం.
రీజనింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే
ఇంగ్లిష్‌పై కూడా పట్టు సాధించాలి. వేగంగా చదవడం, పదాలను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
ఈ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి మాక్ టెస్టులు, గత సంవత్సర ప్రశ్నలను పరిష్కరించాలి.
బేసిక్స్ అయిన కోడింగ్-డీకోడింగ్, సిరీస్‌లు, ర్యాంకింగ్, సిలాసిజం, సీటింగ్ అరెంజ్‌మెంట్‌కు సంబంధించి చిట్కాలు పాటించాలి. హెచ్చుస్థాయి అంశాలైన పజిల్స్, కోడెడ్-ఇన్‌ఈక్వాలిటీస్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, స్టేట్‌మెంట్ వంటివి మెయిన్స్ కోసం ప్రాక్టీస్ చేయాలి.
అసమానత అంశం అనేది తార్కికంలో సులభమైన విభాగాల్లో ఒకటి కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఇలాంటి అంశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం ఉత్తమమైన పని అని గమనించాలి.
ప్రతిరోజూ ఒక మోడల్ పేపర్‌ను పరిష్కరించాలి.
పూర్వ ప్రశ్నపత్రాలను తప్పకుండా సాల్వ్ చేయాలి.
రీజనింగ్‌లో ప్రతి ప్రశ్నకు కేవలం 25 సెకన్లు మాత్రమే కేటాయించాలి.
నిత్యం ప్రాక్టీస్ చేస్తే వేగం, సమయపాలన అలవడతాయి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
ఈ విభాగం కేవలం మెయిన్స్‌లో మాత్రమే ఉంటుంది. రీజనింగ్ విభాగంతో కలిసి ఈ విభాగాన్ని పొందుపరిచారు. అంటే 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్కోరింగ్ మెరుగుపరచుకొనే సబ్జెక్టుగా పరిగణించాలి. అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చేయాలంటే ముందుగా కంప్యూటర్స్ బేసిక్స్, సాఫ్ట్‌వేర్స్, హార్డ్‌వేర్స్, లాంగ్వేజెస్, కంప్యూటర్ పరికరాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, విండోస్, ఇంటర్నెట్ స్కిల్స్, ముఖ్యమైన షార్ట్‌కట్ కీ లు, వైరస్‌లు, బగ్‌లపై పట్టు సాధించాలి.
బ్యాంకింగ్ వ్యవస్థలో కంప్యూటర్ల పాత్ర, మొబైల్-ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్‌వర్కింగ్, యూపీఐ యాప్‌లు, ఏటీఎం పనితీరు కోడ్‌లు కూడా తెలుసుకోవాలి.
ఇందులో మంచి అవగాహన సాధించాలంటే ఏదైనా ప్రామాణికమైన మెటీరియల్ అనుసరించాలి.
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్
బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు చాలావరకు ఇంగ్లిష్ మీడియానికి చెందినవారే ఉంటారు. కారణం ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్ష కాబట్టి. బ్యాంకింగ్ ఇంగ్లిష్ కోసం ప్రత్యేక ధోరణి పాటించాలి. దీనిలో సాధారణంగా రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఇడియమ్స్, సినానిమ్స్, యాంటానిమ్స్, ప్రిపోజిషన్, పేరా జంబుల్డ్, క్లోజ్ టెస్ట్ వంటి అంశాలు చాలా కీలకం. వీటితో పాటు గ్రామర్ పార్టు కూడా నేర్చుకోవాలి. అవి.. సెంటెన్స్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తప్పు వాక్యాలను గుర్తించడం.
ఇంగ్లిష్‌లో వేగంగా వ్యాసాలను చదవడం, అర్థం చేసుకోవడం, సరైన సమాధానం గుర్తించడం వంటివి సాధన చేయాలి.
ఇందుకు ప్రతిరోజూ కనీసం 1-2 మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.
ప్రతిరోజూ ముఖ్యమైన ఇంగ్లిష్ దినపత్రికల్లో (ది హిందూ, ఎకనామిక్ టైమ్స్ వంటివి) ఎడిటోరియల్స్ చదివి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంగ్లిష్ పదాలు, అర్థాలు, నానార్థాలు వంటివి ప్రతిరోజూ నోట్ చేసుకోవాలి.
సాధారణంగా ఇంగ్లిష్‌లో వచ్చే అంశాలన్నీ ప్రతిరోజూ ఇంగ్లిష్ దినపత్రికల్లో వచ్చే అంశాలపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది.
పూర్వ ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
5) బ్యాంకింగ్/ ఫైనాన్స్/ కరెంట్ అఫైర్స్
ఇది కేవలం మెయిన్స్‌లో మాత్రమే వచ్చే అంశం. ఇందులో బ్యాంక్ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు, ఆర్థిక అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి.
బ్యాంకింగ్ అవేర్‌నెస్ కోసం ఆర్‌బీఐ త్రైమాసిక రిపోర్టులు, వడ్డీరేట్లు, కమిటీలు, మొండి బకాయిలపై దిశా నిర్దేశాలు, ద్రవ్యోల్బణం అంచనాలు, బ్యాంకుల విలీనాలు, యూపీఐ లావాదేవీలు, రుణాలు, బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాల నిర్వహణ.
ఇక ఆర్థిక అంశాలైన జీఎస్టీ, నీతి ఆయోగ్ రిపోర్టులు, స్టాక్ మార్కెట్, బడ్జెట్-2023, ఆర్థిక సర్వే 2022, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, రూ.2 వేల నోటు ఉపసంహరణ, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ, బ్రిక్స్ బ్యాంక్, జాతీయ ఆదాయ అంచనాలు, నివేదికలు, సూచీలు ఫాలో కావాలి.
కరెంట్ అఫైర్స్ కోసం జాతీయ, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, జీ-20 సదస్సు, చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1, జీ7 సదస్సు, బ్రిక్స్, ఎస్‌సీవో, ఆసియాన్ సదస్సులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, పుస్తకాలు, రచయితలు, ముఖ్యమైన దినోత్సవాలు, నూతన పార్లమెంట్ భవనం వంటివి చాలా ముఖ్యమైనవి.
ఈ విభాగం మెరిట్ మార్కులు పొందడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి రోజువారీ ఇంగ్లిష్, తెలుగు దినపత్రికలు, మాస సంచికలు, మాక్ టెస్టులు రాయడం కచ్చితంగా పాటించాలి.
రిఫరెన్స్ బుక్స్
1) న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- ఆర్‌ఎస్ అగర్వాల్
2) ఫాస్ట్‌ట్రాక్ అర్థమెటిక్స్- రాజేశ్ వర్మ
3) క్వికర్ మ్యాథ్స్- ఎం టైరా
4) ఇంగ్లిష్ గ్రామర్ అండ్ కంపోజిషన్-
రెన్ అండ్ మార్టిన్
5) ఇంగ్లిష్ మేడ్ ఈజీ- నార్మన్ లెవిస్
6) ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-
ఎస్‌పీ బక్షి అండ్ రిచాశర్మ
7) రీజనింగ్ (వెర్బల్ నాన్ వెర్బల్)-
ఆర్‌ఎస్ అగర్వాల్
8) అనలిటికల్ రీజనింగ్- ఎంకే పాండే
9) బ్యాంకింగ్ అవేర్‌నెస్-
అరిహంత్ పబ్లికేషన్స్
10) కంప్యూటర్స్- అరిహంత్ పబ్లికేషన్స్
COMMENTS