Paper Pens: Paper pens as a variety in AP - these pens also sprout
Paper Pens: వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా.
బాల్ పెన్, రేనాల్డ్స్ పెన్, ఇంక్ పెన్... ఇలా ఎన్నో పెన్నులు చూసుంటాం. కానీ మొలకెత్తే పెన్ చూశారా..? మొలకెత్తే పెన్నులు కూడా ఉంటాయా..? అన్న సందేహం వస్తోంది కదూ. ఇది ఏపీ ప్రభుత్వం చేసి చేపెడుతున్న చమత్కారం. పర్యావరణ పరిరక్షణ కోసం పేపర్ పెన్నులను తయారు చేయిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ పెన్నులతో చక్కగా రాసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని పెరట్లో నాటితే.. మొక్కలు మొలకెత్తుతాయి కూడా. ఇదెక్కడి విడ్డూరం అనిపిస్తోందని కదూ. పర్యావరణానికి ఇలాంటి పెన్నులే మంచివంటోంది ఏపీ ప్రభుత్వం. పెన్నులను తయారు చేయించడమే కాదు... ప్రయోగత్మంగా అమల్లోకి కూడా తెచ్చేసింది.
ప్లాస్టిక్ వల్ల పర్యావరానికి ఎంత చెడ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ భూమిలో కలిసి పోవాలంటే.. వందల సంవత్సరాలు పడుతోంది. దీని వల్ల... చెత్త పేరుకుబోయి వాతావరణం కాలుష్యం అవుతోంది. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ప్లాస్టిక్‌తో తయారయ్యే పెన్నుల పరిస్థితి ఏంటి..? స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు... ఇలా చాలా చోట్ల పెన్నుల వినియోగం ఎక్కువ. అయిపోయిన పెన్నులను ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. దాని వల్ల కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో పేరుకుపోతున్నాయి. మట్టిలో కలవలేక... అలాగే మిగిలిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొంది ఏపీ ప్రభుత్వం. పర్యావరణానికి హానికలిగించని పెన్నులను తయారు చేయిస్తోంది.
పేపర్ పెన్ను ప్రత్యేకతలు
పేపర్ పెన్నులు.. వీటిని ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల ఉపయోగాలు ఏంటి..? అంటే... పేపర్ పెన్నులను కాగితం పొరలతో తయారు చేస్తారు. వాటికి క్యాప్‌ను కూడా మందపాటితో రూపొందిస్తారు. వీటి వల్ల.. పర్యావరణానికి హాని కలగదు. భూమిలో ఇట్టే కలిసిపోతాయి కూడా. అంతేకాదు... ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో... నవ ధాన్యాలు, బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలు అమర్చుతున్నారు. పెన్నును వాడేసిన తర్వాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే... పెన్ను భూమిలో కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ఇదేనండి పేపర్‌లో ఉన్న ప్రత్యేకత.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుంటారు. అలాంటి చోట్ల ఈ పేపర్ ప్నెన్నుల వినియోగం పెరిగితే... అది పర్యావరణ హితమే కదా. అందుకే పేపర్ పెన్నుల తయారీ, వినియోగంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తోంది. బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును 20 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ముందుగా... విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం.
గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు... ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నులను పంపిణీ చేశారు విద్యాశాఖ అధికారులు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులు ఇచ్చారు. ఇక, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా ఈ పన్నులు అందజేస్తున్నారు. భలే ఉన్నాయి కదూ ఈ పేవర్ పెన్నులు.. మరేందుకు ఆలస్యం.. మనకూ పేపర్ పెన్ను కొనేసి... పర్యావరణ పరిక్షణకు సహకరించేద్దామా.
COMMENTS