NTA Exam Calendar 2024: NTA Released National Entrance Exam Dates.. When are NEET, JEE Exams..
NTA Exam Calendar 2024: జాతీయ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన ఎన్‌టీఏ.. నీట్, జేఈఈ పరీక్షలు ఎప్పుడంటే..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ (జేఈఈ) పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం (సెప్టెంబర్ 19) ప్రకటించింది. జేఈఈ మెయిన్ రెండు విడతల పరీక్ష తేదీలను ఎన్‌టీఏ విడుదల చేసింది. జేఈఈతోపాటు నీట్, సీయూఈటీ యూజీ, పీజీ, యూజీసీ నెట్ తేదీలను కూడా వెల్లడించింది. వీటిలో నీట్ పరీక్షను మాత్రమే ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. మిగిలిన పరీక్షలన్నీ ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
పరీక్షల అనంతరం మూడు వారాల్లోపు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్‌టీఏ తన ప్రకటనలో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరే విద్యార్ధులు జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ కూడా రాయవల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1కు 300 మార్కులు, పేపర్ 2కు 400 మార్కులకు ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశాలకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2024 పరీక్ష వచ్చే సంవత్సరం మే 5వ తేదీన జరపనున్నారు. నీట్ యూజీ ఫలితాలు జూన్ రెండో వారంలో వెలవరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ ప్రవేశ పరీక్షల తేదీలు ఎన్టీయే ప్రకటించింది. ఇంటర్ పరీక్షల తేదీలు వస్తే తెలంగాణ ఎంసెట్ తదితర పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి తెలిపారు.
జాతీయ ప్రవేశ పరీక్షల 2024 తేదీలు ఇవే..
- కేంద్రీయ వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీయూఈటీ పీజీ పరీక్ష తేదీ: 2024, మార్చి 11 నుంచి 28 తేదీల వరకు
- కేంద్రీయ వర్సిటీల్లో యూజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీయూఈటీ యూజీ పరీక్ష తేదీ: 2024, మే 15 నుంచి 31 తేదీల వరకు
- పీహెచ్‌డీలో ప్రవేశానికి, జేఆర్‌ఎఫ్ కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష తేదీ: 2024, జూన్ 10 నుంచి 21 తేదీల వరకు
- జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష తేదీలు: 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు
- జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష తేదీలు: 2024 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు
- నీట్ యూజీ-2024 పరీక్ష తేదీ: మే 5, 2024.
COMMENTS