Is it safe to withdraw money through UPI ATM?
యూపీఐ ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయడం సేఫేనా..?
డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం వచ్చేసింది. యూపీఐ ఏటీఎంను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకొచ్చింది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భారతదేశపు మొట్టమొదటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ATMని ప్రారంభించింది. ఇది వైట్ లేబుల్ ATM (WLA). వైట్ లేబుల్ ATM అంటే, బ్యాంకింగ్‌యేతర సంస్థలు రన్ చేసే మనీ మెషీన్. బ్యాంక్ ఏటీఎంల్లో ఉండే సేవలన్నీ దీనిలోనూ లభిస్తాయి. దీని వల్ల ఫిజకల్‌గా ఏటీఎం కార్డు లేకుండానే డబ్బు తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ చేసిన తరహాలోనే క్యాష్ విత్‌డ్రా చేయవచ్చు. అయితే ఈరోజు మనం ఇది ఎంత వరకూ సురక్షితం అనే వివరాలను తెలుసుకుందాం.
UPI ATM నుంచి డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలి?
- UPI ATMలో, స్క్రీన్‌పై క్యాష్ విత్‌డ్రా లేదా UPI క్యాష్ విత్‌డ్రా మీద క్లిక్ చేయండి
- ఇప్పుడు, విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి
- ఆ తర్వాత, స్క్రీన్‌పై సింగిల్ యూజ్ డైనమిక్ QR కోడ్ కనిపిస్తుంది
- మీ ఫోన్‌లోని ఏదైనా UPI యాప్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయండి
- ఆ UPI యాప్‌లో పిన్ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీకి అథెంటికేషన్ ఇవ్వాలి.
- ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్‌లు UPIకి లింక్ అయి ఉంటే, ఏ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవాలో ఎంచుకోవచ్చు (UPIతో క్యాష్ పే చేసిన తరహాలోనే)
- ఇది పూర్తి కాగానే మెషీన్ నుంచి డబ్బు బయటకు వస్తుంది
డబ్బు విత్‌డ్రా చేస్తే ఛార్జీ ఉంటుందా?
ప్రస్తుతానికి, UPI ATMల నుంచి నగదు ఉపసంహరణలపై అదనంగా ఎలాంటి రుసుము లేదు. PhonePe చెప్పిన ప్రకారం, UPI ATMలో నగదును విత్‌డ్రా చేసుకోవడానికి యూజర్‌లకు ఎలాంటి డబ్బు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
యూజర్ ప్రయోజనాలు ఏంటి?
ఏటీఎం మెషీన్ నుంచి ఏటీఎం/డెబిట్ కార్డ్‌తో మనీ విత్ డ్రా చేసే పని కంటే సులువుగా యూపీఐ ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. పైగా, ఒక కార్డ్‌తో ఒక నెలలో నిర్దిష్ట సంఖ్యలోనే ఉచిత లావాదేవీలు చేయాలన్న బ్యాంక్ రూల్ నుంచి దీనికి వర్తించదు. ఒక నెలలో ఎన్ని UPI లావాదేవీలు అయినా చేసుకోవచ్చు. పైగా, ఫిజికల్ కార్డ్ ఉపయోగించం కాబట్టి ఏటీఎం కేంద్రాల్లో కార్డ్ మరిచిపోవడం అనే సమస్యే ఉండదు.
UPI ATM నుంచి క్యాష్ తీసుకోవడం సురక్షితమేనా?
UPI ATMలో డెబిట్/ఏటీఎం కార్డ్ ఉపయోగించం. కాబట్టి, కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి ఆర్థిక మోసాల నుంచి భద్రత ఉంటుంది. పైగా, స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం. మీ లావాదేవీ పూర్తయిన తర్వాత ఆ కోడ్ పని చేయదు. ఆ విధంగానూ భద్రత ఉంటుంది. UPI ATMల ద్వారా నగదు ఉపసంహరణకు ప్రత్యేకంగా థర్డ్-పార్టీ ఛార్జీలు ఉండనప్పటికీ, ప్రతి బ్యాంక్ & ఆర్థిక సంస్థ ATM లావాదేవీల కోసం దాని సొంత రూల్స్ అమలు చేస్తుంది. యూజర్లు ఆ నిబంధనలు గుర్తుంచుకోవాలి.
COMMENTS