Consumer Rights: Wake up consumer.. Know your 6 rights..!
Consumer Rights: వినియోగదారుడా మేలుకో.. నీకున్న 6 హక్కులు తెలుసుకో..!
World Conumer Rights Day 2023: మార్కెట్లో ఎప్పుడూ వినియోగదారుడే కింగ్. అందుకే కస్టమర్లకు వ్యాపార సంస్థలు సైతం ఎక్కువ ప్రాధాన్యతను అందిస్తాయి. మార్కెట్లో వినియోగదారులు సరసమైన ధరలతో పాటు స్వచ్చమైన, నాణ్యమైన ఉత్పత్తులను కోరుకుంటుంటారు. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వినియోగదారుల చట్టం రూపొందించబడింది. ఈ క్రమంలో చట్టం వినియోగదారులకు కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది.
భద్రత హక్కు..
సేఫ్ షాపింగ్ అనేది వినియోగదారుడి ఉన్న ప్రధాన హక్కు. కొనుగోలు చేసిన ఉత్పత్తి భద్రతకు తయారీదారు బాధ్యత వహించాలి. మార్కెట్లో సెల్లర్స్ ఎల్లప్పుడూ నాణ్యమైన వస్తువులను విక్రయించాలి. వినియోగదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ISI మార్క్ చేయబడిన, ISO సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపయోగించాలి. వస్తువుల నాణ్యత, దానితో పాటు సేవల గురించి సమాచారాన్ని పొందే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది.
ఎంచుకునే హక్కు..
ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలి..? ఏ కంపెనీకి చెందిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలి..? వంటి వాటిని ఎంచుకునే హక్కు కస్టమర్లకు చట్టం కల్పించింది. షాపింగ్ సమయంలో కస్టమర్ల నిర్ణయానికి విరుద్ధంగా వేరే బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యాపారి బలవంతం చేసినట్లయితే వినియోగదారులు దీనిపై ఫిర్యాదు చేసేందుకు చట్టం వెసులుబాటు కల్పించింది.
సమాచార హక్కు..
ఏదైనా ఉత్పత్తి గురించి కావలసిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది. ఉదాహరణకు ప్రొడక్ట్ నాణ్యత, పరిమాణం, ధర, క్వాలిటీ, ఎక్స్ పైరీ తేదీ వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు..
వినియోగదారుల చట్టం ప్రకారం.. కస్టమర్లు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కును కలిగి ఉంటారు. కస్టమర్ కొనుగోలు చేసిన ఉత్పత్తిపై ఏదైనా లోపం ఉంటే లేదా ఉత్పత్తి లోపభూయిష్టంగా ఉంటే అభ్యంతరం చెప్పే హక్కు కస్టమర్లకు చట్టం కల్పించింది. కస్టమర్ తాము మోసపోయామని భావిస్తే.. వారు వినియోగదారుల ఫోరమ్‌లో సదరు వ్యాపార సంస్థ లేదా కంపెనీపై ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదుల పరిష్కారం..
తమకు మోసం జరిగితే.. అది ఉత్పత్తి, ప్రొఫెషనల్ లేదా కంపెనీకి సంబంధించిన ఫిర్యాదైనా వినియోగదారు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫోరం లేదా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం దీనిని పరిష్కరిస్తుంది.
వినియోగదారుల ఎడ్యుకేషన్..
వినియోగదారుడు ఉండే హక్కులపై అవగాహన కల్పించి మోసపోకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. దీని కింద వినియోగదారుల మేళాలు, శిబిరాలు, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. వినియోగదారుల చట్టం ప్రకారం మోసాలపై ఎడ్యుకేట్ హక్కు వినియోగదారునికి ఉంది. వినియోగదారుల హక్కుల కోసం దేశంలో హెల్ప్‌లైన్ సౌకర్యం కూడ అందుబాటులో ఉంది. కస్టమర్లు తన ఫిర్యాదును నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1800114000 టోల్ ఫ్రీ నంబర్‌లో నమోదు చేయవచ్చు.
COMMENTS