Business Idea: ATM Franchise Business.. Rs. 90 thousand income per month.. How to apply?
Business Idea: ఏటీఎం ఫ్రాంచైజీ బిజినెస్.. నెలకు రూ.90 వేల ఆదాయం.. ఎలా అప్లై చేసుకోవాలి?
Business Idea: మీరు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? మీకో ఒక మంచి అవకాశం ఉంది. అదే ఏటీఎం ఫ్రాంచైజీ వ్యాపారం. ఏటీఎం బిజినెస్ ఏంటి? దేశంలోని బ్యాంకులే వాటికి చెందిన ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి కదా అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అయినా.. మీరు కూడా ఏటీఎం బిజినెస్ మొదలు పెట్టి సంపాదించుకోవచ్చు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి క్రమంగా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇందులో ఒకసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మీకు నెలకు రూ.45 వేల నుంచి రూ.90 వేల వరకు రాబడి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంల గురించి తెలిసిందే. ఇవే కాకుండా వైట్ లేబుల్ ఏటీఎం కేంద్రాలు సైతం ఉంటాయి. రూ.100 కోట్లు టర్నోవర్ ఉన్న ఏటీఎం కేంద్రాలను ఇవి ప్రారంభిస్తాయి. బ్యాంకులు తమ ఏటీఎంలను ప్రారంభిస్తున్నప్పటికీ మరి కొన్నింటిని లీజుకు ఇస్తుంటాయి. అందు కోసం మన వద్ద ఒక గది, ఏటీఎంకు అనువైన ఏరియా ఉండాలి. బ్యాంకుల నిబంధనలకు తగిన విధంగా ఉన్నట్లయితే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తారు. దాంతో ప్రతీ నెల మీరు కమీషన్ తీసుకోవచ్చు. అయితే ఏటీఎం ఫ్రాంచైజీ వ్యాపారం ఎలా ప్రారంభించాలి? ఎలాంటి అర్హతలు ఉంటే ఏటీఎం కాంట్రాక్ట్ ఇస్తారు అనే వివరాలను మనం తెలుసుకుందాం.
ఏటీఎం ఫ్రాంచైజీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మన దేశంలో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చాలా బ్యాంకులు టాటా ఇండి క్యాష్, ముథూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం వంటి వాటితో ఒప్పందం చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కంపెనీలకు వాటి అధికారిక వెబ్‌సైట్ల నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలు పెరిగిపోయిన క్రమంలో కంపెనీల అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అప్లై చేసుకోవడం ముఖ్యం. ఆన్‌లైన్‌లో కనిపించే లింకుల ద్వారా మీరు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నస్తే డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
2012 నుంచే వీటికి అనుమతి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ 2012 ఏడాది నుంచే వైట్ లేబుల్ ఏటీఎం కేంద్రాల ఏర్పాటుకు అనుమతించింది. వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటుకు 2013 నుంచి లైసెన్సులను జారీ చేస్తోంది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ తొలి లైసెన్స్ అందుకుంది. ఈ సంస్థ ఇండి క్యాష్ పేరుతో ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. మీరు చాలా ప్రాంతాల్లో ఈ ఏటీఎంలను చూసే ఉంటారు. ఇప్పటి వరకు 15 కంపెనీలకు లైసెన్సులు వచ్చినట్లు సమాచారం. ఆయా కంపెనీల నుంచి మీరూ మీ ప్రాంతంలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏటీఎం ఫ్రాంచైజీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు..
ఏటీఎం ఫ్రాంచైజీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మీకు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు అవసరమవుతాయి. వాటితో పాటు అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, కరెంట్ బిల్లు కావాలి. బ్యాంకు ఖాతా , ఫోటోలు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలి. కంపెనీని బట్టి ఇతర పత్రాలు, ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, జీఎస్‌టీ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి.
ఏటీఎం ఫ్రాంచైజీకి కావాల్సినవి ఏమిటి?
ఏటీఎం కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా మీ వద్ద 50 నుంచి 80 చదరపు అడుగుల మేర విస్తీర్ణం గల గది ఉండాలి. అలాగే, అది ఇతర ఏటీఎం కేంద్రాలకు 100 మీటర్లకుపైగా దూరంలో ఉండాలి. అలాగే ప్రజలు తమ ఏటీఎంను సులభంగా గుర్తించే విధంగా, ఈజీగా ఏటీఎంకు వచ్చే విధంగా ఉండాలి. పవర్ సప్లై నిరంతరాయంగా కొనసాగే ఏర్పాట్లు ఉండాలి. ఏటీఎంకు 1 కిలోవాట్ కరెంట్ సప్లై అవసరం అవుతుంది. ఈ గది పర్మనెంట్ బిల్డింగ్, కాంక్రిట్ రూఫింగ్‌తో నిర్మాణమై ఉండాలి.
ఏటీఎం ఫ్రాంచైజీ నుంచి ఆదాయం ఎలా వస్తుంది?
ఏటీఎం ఫ్రాంచైజీ కోసం అప్లై చేసుకుని అనుమతి లభించినట్లయితే ముందుగా మీరు రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత రూ.3 లక్షలు ఆపరేటింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. ఈ మొత్తం పెట్టుబడి అనేది కంపెనీలను బట్టి మారుతుందని గుర్తుంచుకోవాలి. మొత్తంగా దాదాపు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటైన తర్వాత కస్టమర్లను బట్టి మీ ఆదాయం వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్‌పై మీకు రూ.8 వరకు కమిషన్ లభిస్తుంది. అలాగే బ్యాలెన్స్ చెక్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లకు రూ.2 చొప్పున బ్యాంకులు కమీషన్ చెల్లిస్తాయి.
COMMENTS