Travel Insurance: Do you have travel insurance..? Find out what the benefits are!
Travel Insurance: మీకు ప్రయాణ బీమా ఉందా..? ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి!
సందీప్‌కు ఆరు రోజుల ముంబై ట్రిప్‌లో ఉన్నాడు. ఈ సమయంలో అతని ల్యాప్‌టాప్ దొంగతనం జరిగింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ల్యాప్ టాప్ బ్యాగ్ జాడ ఎక్కడ దొరకలేదు. సందీప్‌కు ప్రయాణ బీమా ఉన్నట్లయితే జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆస్కారం ఉండేది. మనలో చాలామంది ఒక నగరం నుంచి మరొక నగరానికి దేశీయ ప్రయాణానికి బీమాను కొనుగోలు చేయడం గురించి పెద్దగా ఆలోచించరు.
అంతర్జాతీయ పర్యటనలకు ప్రయాణ బీమా తప్పనిసరి. ఎవరైనా దానిని తీసుకోవచ్చు. అయితే మీరు దేశంలో సుదీర్ఘమైన లేదా చిన్న పర్యటనకు వెళుతున్నా.. ప్రయాణ బీమాను కొనుగోలు చేయాలనే ఆలోచన చాలా మందికి ఉండదు. దీని వెనుక ఉన్న కారణాలలో ఇదొకటి. దేశీయ ప్రయాణం కోసం కూడా ప్రయాణ బీమాను కొనుగోలు చేయాలని చాలా మందికి తెలియదు. తరచుగా వ్యక్తులు ప్రయాణ బీమాను ప్రమాద బీమాగా పొరబడతారు. ప్రయాణ బీమా కేవలం ప్రమాదాలను మాత్రమే కవర్ చేస్తుందని భావించి దానిని విస్మరిస్తారు. కానీ అలా కాదు. ప్రయాణ బీమా అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి వస్తువులను కోల్పోవడం లేదా దొంగిలించడం వరకు వివిధ సంఘటనలను కవర్ చేస్తుంది.
బీమా కింద కవర్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం..
- మీరు కొత్త ప్రదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటే వైద్య ఖర్చులను కవర్ చేయడంలో ఈ బీమా సహాయం అందిస్తుంది.
- దొంగతనం లేదా వస్తువులను పోయినప్పుడు బీమా కంపెనీ పూర్తి కవరేజీని అందిస్తుంది.
- ప్రయాణ సంబంధిత జాప్యాలు లేదా టిక్కెట్ రద్దుకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు బీమా కంపెనీ మీకు రీఫండ్‌ను అందిస్తుంది.
- క్రెడిట్ కార్డ్‌లు మొదలైనవి పోయినప్పుడు వాటి స్థానంలో కొత్తవి తీసుకోవడంలో అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
- అనేక ప్రణాళికలలో ప్రయాణ సమయంలో మీ కారు లేదా టాక్సీ చెడిపోతే సహాయ సేవ అందుతుంది. ఇక వైద్య సమస్యల విషయంలో అంబులెన్స్ సంబంధిత సహాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రాథమిక దేశీయ ప్రయాణ బీమా ధర 250 రూపాయల నుంచి ఉంటుంది. ఈ బీమా సదుపాయం ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయల కవరేజీని అందిస్తుంది. బీమా కంపెనీల ప్లాన్‌లను బట్టి ఫీచర్స్ ఉంటాయి. అలాగే అధిక కవరేజీ కోసం వారు అధిక ప్రీమియంలను వసూలు చేస్తారు. మీరు మీ ప్లాన్‌కి మరిన్ని ఫీచర్స్ ఉండాలనుకుంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
బజాజ్ అలియాంజ్ ఇండియా టూర్ పాలసీలో ఒక ట్రిప్‌కు రూ. 242 ప్రీమియంతో రూ. 5 లక్షల కవర్ లభిస్తుంది. అదే విధంగా మీరు ఒక సంవత్సరంలో అనేక ట్రిప్పులు చేస్తే ఎక్కువ ట్రిప్పులను జోడించడం వల్ల వార్షిక ప్రీమియం రూ. 2,998 అవుతుంది. బజాజ్ అలియాంజ్ ఇండియా టూర్ ప్లాన్‌లో రూ. 3 లక్షల కవరేజ్ పొందవచ్చు. ఈ పాలసీలో ప్రమాదాల కవరేజ్ కూడా ఉంటుంది. ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరడం, రోజువారీ ఆసుపత్రి భత్యం, ట్రిప్ క్యాన్సిలేషన్, ట్రిప్ ఆలస్యం, అత్యవసర సమయంలో హోటల్ వసతి పొడిగింపు, ఆలస్యమైన వస్తువుల చెక్-ఇన్ బ్యాగేజీ కోల్పోవడం, అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్ కవర్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
న్యూ ఇండియా అష్యూరెన్స్ కు చెందిన ‘సుహానా సఫర్’ పాలసీ కనిష్టంగా 300 రూపాయల నుంచి అందుబాటులో ఉంది. ఇది వైద్య సహాయం, దొంగతనం, ప్రమాదాలు, వరదలు మొదలైన కారణాల వల్ల పోయిన వస్తువుల నష్టాన్ని కవర్ చేస్తుంది. రోడ్డు, విమానాలు, రైలు ప్రయాణంతో పాటు కారులో ప్రయాణించే సమయంలో జరిగే నష్టాలకు కూడా ఇది కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీతో కలిసి బీమాదారుని కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందవచ్చు.
ఫ్యూచర్ జెనరాలి కి చెందిన శుభ యాత్ర’ పాలసీలో ప్రమాదాలు, వస్తువుల నష్టం లేదా దొంగతనానికి సంబంధించిన కవరేజీ ఉంటుంది. పాలసీ నిబంధనల ప్రకారం.. మీరు విమానాల ప్రయాణ సమయంలో మొత్తం చెక్-ఇన్ బ్యాగేజీకి, అందులోని వస్తువులకు కవరేజీని పొందవచ్చు. అలాగే తప్పిపోయిన రైళ్లు లేదా విమానాల కోసం కవరేజీని కూడా అందిస్తుంది. హోటల్ గది రద్దు అయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అందించేందుకు సహాయం చేస్తుంది. సాహస క్రీడల సమయంలో ప్రమాదవశాత్తు మరణానికి కవరేజ్, శాశ్వత పూర్తి వైకల్యం, అలాగే ఇతర ఫీచర్లు కూడా ఇందులో చేర్చారు. ఇప్పుడు మీకు దేశీయ ప్రయాణ బీమా గురించి మంచి అవగాహన వచ్చిందని భావిస్తున్నాము.
COMMENTS