Do you have a patio? Money can be earned like this.. terrace business ideas that pour money!
మీది డాబా ఇల్లా..? డబ్బులు ఇలా సంపాదించొచ్చు.. కాసులు కురిపించే టెర్రస్ బిజినెస్ ఐడియాలు!
మీది డాబా ఇల్లా..? మీరు అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారా..? ఇదిగో ఇలా చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా మీరు క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందొచ్చు. మీ ఇల్లు ఉన్న ఏరియాను బట్టి మీ డాబా ఇంటిపై ఏమేం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
గతంతో పోలిస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసరాలు మొదలు బస్సు టికెట్లు, పిల్లల స్కూల్ ఫీజుల వరకూ అన్నింటి ధరలు పెరిగాయి. ఏం కొనబోయినా పెరిగిన రేట్లతో షాక్ తగిలే పరిస్థితి. దీనికి తోడు జాబ్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సంపాదన చాలక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అందుకే వర్క్ ఫ్రమ్ హోం.. డేటా ఎంట్రీ.. కామెంట్లు పెట్టడం.. లాంటి పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తే ఆకర్షణీయమైన ఆదాయం పొందొచ్చు అంటూ మోసం చేసే వాళ్లూ పెరిగారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా.. కేవలం పక్కా ఇల్లు ఉంటే చాలు.. మీరు అదనపు ఆదాయం పొందొచ్చు. చాలా మంది ఇంటి టెర్రస్‌ను ఖాళీగానే ఉంచుతుంటారు. కేవలం వాటర్ ట్యాంక్ పెట్టడానికి, పెద్దగా వాడని వస్తువులు పెట్టడానికి మాత్రమే డాబాను వాడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఇంటినే ఓ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. టెర్రస్‌పై కొద్ది పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..
కూరగాయల పెంపకం
మీ ఇంట్లో స్థలం లేకపోయినా ఫర్వాలేదు.. డాబా ఉంటే చాలు టెర్రస్ మీద మొక్కలు పెంచొచ్చు. చాలా మంది ఆహ్లాదాన్ని కలిగించే పూల మొక్కలను కుండీల్లో పెంచుతుంటారు. వీటితోపాటు కూరగాయల మొక్కలను పెంచడం ద్వారా నెలవారీ ఖర్చులను తగ్గించుకోవచ్చు. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, పాలకూర, క్యాప్సికం, కాకరకాయ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ తదితర కూరగాయలు, ఆకు కూరలను మీ టెర్రస్ మీద తేలిగ్గా సాగు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో కొందరు ఔత్సాహికులు టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొంత ఓపిక, సస్యరక్షణ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచితే చాలు టెర్రస్ గార్డెన్ ద్వారా మీ కుటుంబానికి సరిపడే ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించుకోవచ్చు. తద్వారా నెలకు కనీసం రూ.2-3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. సేంద్రీయ కూరగాయలు ఆరోగ్యానికి మంచివనే సంగతి తెలిసిందే.
చేపల పెంపకం
మీకు నీటి ఇబ్బంది లేకపోతే ఇంటి మిద్దె మీద చేపలను సైతం పెంచొచ్చు. 5-6 అడుగుల ఎత్తయిన ట్యాంకులను మిద్దెల మీద ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే పెద్ద సంఖ్యలో చేపలను పెంచుకోవచ్చు. కామారెడ్డికి చెందిన కొందరు సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ద్వారా 15 వేల లీటర్ల ట్యాంకులో పది వేల లీటర్ల మేర నీళ్లు నింపి వెయ్యి చేపలను టెర్రస్ మీదే పెంచుతున్నారు. ఆ నీటిని పంట పొలాలకు వదులుతున్నారు. ఇలా చేపల పెంచడానికి ముందుకొచ్చే వారికి గ్రామీణాభివృద్ధి సంస్థ రుణాలు కూడా అందిస్తోంది. వెయ్యి కొర్రమీను చేపలను పెంచితే.. కిలో రూ.250కి విక్రయించినా.. లక్ష రూపాయలకుపైగా లాభం మీకు సమకూరుతుంది. మార్కెటింగ్ మీరే చేసుకుంటే.. లక్షన్నరకుపైగా మిగులుతుంది. మీకు కొంత స్థలం ఉంటే ఇంకా పెద్ద సంఖ్యలో చేపలను పెంచే వీలుంది. తద్వారా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందొచ్చు. నీటి కొరత ఉంటే.. మీ టెర్రస్ మీద కోళ్లను సైతం పెంచుకోవచ్చు.
పుట్టగొడుగుల పెంపకం
కూరగాయలతోపాటు టెర్రస్ మీద పుట్టగొడుగులను సైతం పెంచొచ్చు. కానీ వాటిని పెంచాలంటే సూర్యరశ్మి సోకకుండా జాగ్రత్త పడటంతోపాటు.. వాతావరణం కూడా అనుకూలించాలి. ఉక్కపోత వాతావరణం పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలం. మిద్దె మీద సన్‌లైట్ పడకుండా.. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి మష్రూమ్‌లను పెంచొచ్చు. వర్షాకాలం, చలికాలంలో వీటి పెంపకం బాగుంటుంది. పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టే ముందు కొంత శిక్షణ పొందడం అవసరం.
తేనెటీగల పెంపకం
మీరు నగర శివార్లలో లేదా గ్రామాల్లో నివసిస్తున్నట్లయితే.. మీ డాబా మీద తేనెటీగలను పెంచొచ్చు. కానీ దానికి నైపుణ్యం, మంచి అవగాహన అవసరం. తేనెటీగల పెంపకం కోసం.. వాటిపై నేరుగా ఎండ పడుకుండా నీడను ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మీ చుట్టు పక్కల చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉంటేనే తేనెటీగలకు ఆహారం లభిస్తుంది. తేనె, మైనం అమ్మకం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు.
సెల్ టవర్ ఏర్పాటు
మీ టెర్రస్‌ను మొబైల్ టవర్ల ఏర్పాటుకు టెలీకాం కంపెనీలకు అద్దెకు ఇవ్వొచ్చు. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాల కొరత నేపథ్యంలో.. టెలీకాం కంపెనీలు ఇళ్ల పైన టవర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. మీ టెర్రస్ మీద టవర్ ఏర్పాటు చేసినందుకు కొంత అద్దె చెల్లిస్తాయి. ఒకవేళ దాని బాగోగులు మీరు చూసుకోగలిగితే అందుకు కూడా డబ్బులిస్తాయి. ఓ ఇంటిని అద్దెకు ఇచ్చిన దానికంటే సులభంగా.. టవర్ ఏర్పాటు ద్వారా మీరు ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు.
టెర్రస్ రెస్టారెంట్
మీరు ఉండే ఏరియా రద్దీ ప్రదేశంలో ఉంటే.. ఇవే కాకుండా బోలెడన్ని విధాలుగా మీ టెర్రస్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. రూఫ్ టాప్ మూవీ నైట్ల ద్వారా రాత్రి సమయాల్లో మీ టెర్రస్ మీద కొందరు కూర్చొని రిలాక్స్‌డ్‌గా ఓ స్క్రీన్ మీద సినిమాలు చూసేలా ఏర్పాటు చేయొచ్చు. మీ టెర్రస్ కాస్త పెద్దగా ఉంటే.. కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా దాన్ని చిన్న చిన్న బర్త్ డే పార్టీల్లాంటి ఈవెంట్స్ చేసుకునేందుకు ఇవ్వొచ్చు. రూఫ్ టాప్ బార్లు, రెస్టారెంట్లు నడపడం ద్వారా వచ్చే కస్టమర్లకు థ్రిల్‌ను పంచడంతోపాటు.. మంచి ఆదాయాన్ని పొందొచ్చు. వీటికి సంబంధిత విభాగాల నుంచి పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
రీడింగ్ రూమ్‌లుగా..
యోగా లాంటి ఫిట్‌నెస్ క్లాసుల నిర్వహణకు మీ టెర్రస్‌ను వాడుకోవచ్చు. మీ దగ్గర్లో ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నట్లయితే.. మీ టెర్రస్‌పై నీడ ఉండేలా చూడటం, తాగు నీరు, టాయిలెట్ల లాంటి కనీస వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ‘స్టడీ సెంటర్’గా, రీడింగ్ రూమ్‌గా దాన్ని మార్చేయొచ్చు. ఒక్కొ విద్యార్థి నుంచి నెలకు కొంత మొత్తం వసూలు చేయొచ్చు. పెద్దగా కష్టపడకుండానే మీకు ప్రతి నెలా మంచి ఆదాయం వస్తుంది.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు
అసలు ఈ గోల అంత ఎవడు పడతాడని అనుకుంటే.. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా మీ ఇంటి అవసరాలకు సరిపడే విద్యుత్తును మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా కరెంటు బిల్లుల భారం తగ్గుతుంది. మీ టెర్రస్ మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి.. మీ ఏరియాలో ఇలా ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించండి.
COMMENTS