Telangana: Telangana Sarkar's key decision.. 14,954 new posts sanctioned.. Details!
Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 14,954 కొత్త పోస్టులు మంజూరు.. వివరాలివే!
రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆయా పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మొత్తం 14,954 పోస్టులకు గాను రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో వీఆర్ఏలో త్వరలోనే ఈ కొత్త కొలువుల్లో చేరనున్నారు.
తెలంగాణాలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసిన సీఎం కేసీఆర్ (CM KCR) వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తామని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. వారి జీతభత్యాలు, సర్దుబాటుకు సంబంధించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తాజాగా జీవో విడుదల చేశారు. ఇక ఈ జీవోలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. 20,555 మంది వీఆర్ఏలలో టెన్త్ వరకు చదివిన వారు 10,317 మందిని లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (రూ.19000-8850)గా గుర్తించారు.
ఇక ఇంటర్ చదివిన 2761 మందిని రికార్డు అసిస్టెంట్ (రూ.22240-67300)గా గుర్తించారు. అలాగే డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన 3680 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా (రూ.24280-72850)గా ప్రభుత్వంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వనుంది. వీరు 3797 మంది ఉన్నట్టు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
COMMENTS