TS Govt Jobs:Telangana Government has increased the number of posts in that department
TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో పోస్టుల సంఖ్య పెంచిన తెలంగాణ సర్కార్
తెలంగాణ వైద్యాశాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను కేసీఆర్ సర్కార్ పెంచింది. 1520 పోస్టుల భర్తీకి జులైలో వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన సంఖ్య తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 146 పోస్టులను కలిపినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో ఈ శాఖలో మొత్తం పోస్టుల సంఖ్య 1,666కి పెరిగింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య పెరిగినట్లు తాజాగా మంత్రి హరీశ్ తెలిపారు. అంతేకాకుండా అభ్యర్థుల వయో పరిమితిని కూడా గణనీయంగా పెంపొందించినట్లు వెల్లడించారు. వయోపరిమితి 44 నుంచి 49కు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఆయన తెలిపారు. సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను కూడా 20 నుంచి 30 మార్కులకు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలవ్వగా ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
అర్హతలు ఏమేం ఉండాలంటే..
దరఖాస్తు దారులు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు లేదా ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 49 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 నుంచి 92,050 వరకు జీతంగా చెల్లిస్తారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తుండగా వాటి సంఖ్యను 500కు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. రాష్ట్రంలోని 4,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 2,900 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజారోగ్య సేవలు మెరుగు పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
COMMENTS