Monthly Income: These are the schemes that give income to senior citizens every month!
Monthly Income: సీనియర్ సిటిజన్లకు ప్రతీ నెల ఆదాయం ఇచ్చే పథకాలు ఇవే!
Monthly Income: సీనియర్ సిటిజన్లకు నెల నెలా కొంత మొత్తంలో చేతికి డబ్బులు అందితే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అలాంటి సందర్భంలో వారు ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలకు ప్రాధాన్యం ఇస్తారు. వృద్ధులకు నెల నెలా ఆదాయం ఇచ్చే పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Monthly Income: సీనియర్ సిటిజన్లకు ఉద్యోగ విరమణ తర్వాత నెల వారీ ఖర్చులకు కొంత రాబడి అనేది ఉండాలి. అప్పుడే వారికి భరోసా లభిస్తుంది. ఒకరి వైపు చేయి చాచాల్సిన అవసరం రాదు. వారు కూడా అదే కోరుకుంటారు. అలాగే రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్లనే కోరుకుంటారు. వారి కొచ్చే గ్రాట్యుటీ, ఈపీఎఫ్, ఇతర పథకాల్లో సంపాదించిన డబ్బులను వారి వయస్సు రీత్యా రిస్క్ లేని ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి పథకాలు తప్పనిసరిగా హామీ ఇవ్వడడం, క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించటమే అందుకు కారణం. పదవీ విరమణ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆదాయం తగ్గిపోతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీనిని నివారించేందుకు ఉద్యోగ విమరణ ద్వారా అందిన సొమ్మును మంచి రాబడిని ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వాటితో నెల నెలా కొంత మొత్తంలో రాబడి అందుకుంటూ మిగితా లైఫ్‌ను ఎలాంటి చింత లేకుండా లీడ్ చేయవచ్చు. అప్పుడే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతల్లో తలమునకలైన వారికి పదవీ విరమణ తర్వాత ప్రశాంతతం కావాలంటే కొంత స్థిరమైన రాబడి చాలా ముఖ్యం. అలాంటి వారు పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి కొన్ని స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ (SCSS)
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది పోస్టాఫీసు పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ వార్షిక వడ్డీ 8.2 శాతంగా ఉంది. దీని ప్రకారం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలలకు ఒకసారి రూ. 1900 వరకు వడ్డీ రూపంలో అందుతుంది. 60 ఏళ్లు పైబడిన ఎవరైనా పోస్టాఫీసు, బ్యాంకు ద్వారా చేరవచ్చు. ఈ పథకం కాల వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్లు
ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర జాతీయ బ్యాంకుల్లో కొనుగోలు చేయవచ్చు. ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిన పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ బాండ్లు లభిస్తాయి. ఇవి 7 ఏళ్ల కాల వ్యవధితో వస్తాయి. వడ్డీ రేటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు కన్నా 0.35 శాతం అదనంగా ఉంటుంది. ప్రతి ఏడాది జులై 1, జనవరి 1 తేదీలలో ఏడాది 2 సార్లు వడ్డీ చెల్లిస్తారు. ఈ బాండ్లలో పెట్టుబడి గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. రాబడిపై ఆదాయపు పన్ను విధిస్తారు.
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
పోస్టాఫీసు ద్వారా కేంద్ర ప్రభుత్వం మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరడం ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఖాతాలో గరిష్ఠంగా రూ. .4.50 లక్షలు ఉమ్మడి ఖాతాలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు ఏడాదికి 7.4 శాతంగా ఉంది. వడ్డీ రేటు మొత్తం కాల వ్యవధికి స్థిరంగా ఉంటుంది. మీ సేవింగ్స్ ఖాతాకు డబ్బులు జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెలవారీ ఆదాయ పథకం 5 ఏల్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు నెలవారీ వడ్డీ ఇస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 9 శాతం వరకు ఉన్నాయి. పెట్టుబడిదారుడు ఆదాయపు పన్ను స్లాబు ప్రకారం ఎఫ్‌డీ రాబడిపై పూర్తిగా పన్ను ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారుల స్పాల్ రేటు ప్రకారం ఎఫ్‌డీలపై టీడీఎస్ వర్తిస్తుంది. అయితే, సీనియర్ సిటిజన్లు ఫారం 15 హెచ్ బ్యాంకుకు సమర్పించవచ్చు. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు అయిే 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)
ఈ పథకం ఎల్ఐసీ అందిస్తోంది. 60 ఏళ్లు దాటిన వారు ఒకేసారి గరిష్ఠంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు ఈ పథకంలో చేరితే గరిష్ఠంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. వడ్డీని నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, వార్షికంగా పొందవచ్చు. కాల వ్యవధి 10 ఏళ్లుగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.40గా ఉంది. కనీస పెన్షన్ రూ. 1000 తీసుకోవాలంటే ఈ పథకంలో రూ. 1, 62, 162 చెల్లించాలి. రూ. 15 లక్షలు చెల్లించిన వారికి రూ. 9, 250 నెలవారీ పెన్షన్ వస్తుంది.
COMMENTS