How to plead for free even in the Supreme Court, how to get free legal aid?
సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వకీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి.
లాయర్‌ను పెట్టుకుని వాదించే స్తోమత లేని వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది.
దీని కోసం పనిచేస్తున్న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (National Legal Services Authority - NALSA) గురించి తెలుసుకుందాం.
నిరుపేదలు, నిస్సహాయులు, అభాగ్యులు, అనాథలకు కోర్టుల్లో పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే.
సంవత్సరాల తరబడి సాగే కేసు విచారణలు, వాయిదా పర్వాలు, కోర్టు ఫీజులు తదిరత అనేక అంశాలు మోయలేని భారాలే అవుతున్నాయి.
ఇంత ఖర్చును భరించి కోర్టులో వకీలును పెట్టుకుని కేసు వాదించుకోవాలంటే నిరుపేదలకు, సామాన్యులకు అయ్యేపని కాదు.మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటి వారు తమకు న్యాయం జరుగుతుందని ఆశలు వదులుకోవాల్సిందేనా?
అవసరం లేదు అంటుంది జాతీయ న్యాయ సేవాసాధికార సంస్థ (National Legal Services Authority - NALSA). నిస్సహాయులు, నిర్భాగ్యులు, అనాథల పక్షాన నిలబడి వారికి ఖర్చు కాకుండా వారి కేసును కోర్టులో వాదించి ఆ కేసుకయ్యే కోర్టు ఖర్చులన్నీ తానే భరించి వారికి భరోసా కల్పిస్తానంటుంది NALSA.
దురదృష్టవశాత్తు ఇప్పటికీ మన సమాజంలోని బడుగు వర్గాల్లో పూర్తి ఉచితంగా న్యాయ సహాయం అందించే ఈ సంస్థ గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఈ ఉచిత న్యాయ సహాయం (Free Legal Aid) గురించి కాస్తంత అవగాహన పెరగడం మొదలవుతోంది.
మరి ప్రభుత్వం నుంచి ఈ ఉచిత న్యాయ సాయం అందుకోవడానికి ఎవరు అర్హులు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎవర్ని సంప్రదించాలి? విధి విధానాలేంటి? అసలు NALSA అంటే ఏమిటీ? న్యాయ సహాయం అందజేయడంలో ఈ సంస్థ ఏవిధంగా సహాయపడగలదు? అనే అంశాలను తెలుసుకుందాం.
ఉచిత న్యాయ సహాయం అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉచిత న్యాయ సహాయం పొందడం పౌరుల ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది.
పౌరులకు రాజ్యాంగం ఈ ప్రాథమిక హక్కు కల్పించినప్పటికీ చట్టాలపైన సామాన్యుల్లో అవగాహన లేకపోవడం వల్ల అణగారిన వర్గాలు, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని దేశసర్వోన్నత న్యాయస్థానం భావించింది.
పౌరులకు సామాజిక న్యాయం, న్యాయం అందివ్వాలనే సంకల్పంతో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం 1987లో కేంద్ర ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 39A (Article 39A) ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాం అందించే ఉద్దేశంతో న్యాయ సేవాధికార చట్టం (Legal Services Authorities Act, 1987) తీసుకువచ్చింది.
ఈ చట్టం ద్వారా 1995 నవంబరు 9వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (National Legal Services Authority - NALSA) అమల్లోకి వచ్చింది.
ఈ సంస్థ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలు, వర్ణ, వర్గ, కుల వివక్షతో తావులేకుండా ఎవరైనా సరే కిందిస్థాయి కోర్టు నుంచీ సుప్రీం కోర్టు వరకు తమ కేసులు వాదించుకోవడానికి ఉచితంగా న్యాయ సహాయం పొందే వీలు కల్పించింది.
తమ కేసును కోర్టులో వాదించుకోవడానికి సొంతంగా వకీలును పెట్టుకోవడానికి, కోర్టు ఫీజులు భరించడానికి ఆర్థిక స్తోమతలేనివారు, బాధితులు న్యాయవాదులను ఆశ్రయించే స్థోమత లేనప్పుడు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) చట్టం పరిధిలోని సెక్షన్ 12 ఉచిత న్యాయ సేవలు కల్పించాలని ఆదేశిస్తుంది.
ఉచిత న్యాయ సేవలు పొందడానికి ఎవరు అర్హులు?
- షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగ (SC, ST) లకు చెందినవారు.
- మహిళలు
- 18 సంవత్సరాల లోపు వయసున్నవారు.
- మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న బాధితులు (A victim of trafficking in human beings)
- యాచకులు
- మానసిక వికలాంగులు
- వికలాంగులు
- ప్రకృతి విపత్తులు, జాతి వైషమ్య హింస, కులం పేరిట హింస, వరదలు, కరవు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు తదితర విపత్తుల్లో అనుకోని పరిస్థితుల్లో బాధితులుగా చిక్కుకున్నవారు
- పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు
- బాల నేరస్థులు, మానవ అక్రమరవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు
- National Legal Services Authority - NALSA నిర్దేశిత వార్షికాదాయంలోపు ఉన్నవారు
వార్షికాయదాయ పరిమితి ఎంత ఉండాలి?
వార్షికాదాయ పరిమితి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారికి వార్షికాదాయం రూ.3,00,000 లోపు ఉండాలి
తెలంగాణలో ఉన్నవారికి వార్షికాదాయం రూ.1,00,000లోపు ఉండాలి
మహిళలకు కూడా వార్షికాదాయ నిబంధన వర్తిస్తుందా?
లేదు. మహిళలు తమ వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఉచితంగా న్యాయ సహాయం సేవలు పొందవచ్చు.
NALSA ఎలాంటి ఉచిత న్యాయ సహాయ సేవలు కల్పిస్తుంది?
మీ కేసును వాదించడానికి ఒక వకీలును నియమిస్తుంది
మీ కేసుకు సంబంధించిన కోర్టు ఫీజులు, సాక్షులకు సంబంధించిన వ్యయాలు, ఆ కేసుకు సంబంధించి మరే ఇతరత్రా సమంజసమైన ఖర్చులు భరిస్తుంది.
కోర్టులో కేసు విచారణకు సంబంధించిన అప్పీలు మెమో, అభ్యర్థనలు, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ల అనువాదం, అచ్చువేయడం తదితర పనులకు సాయం చేస్తుంది.
లీగల్ డాక్యుమెంట్లను రూపొందించడం, స్పెషల్ లీవ్ పిటిషన్ల రూపకల్పన తదితరాలు చేపడుతుంది.
కేసు విచారణకు సంబంధించి అవసరమైన ఇతర కేసులకు సంబంధించి తీర్పుల కాపీలను, ఉత్తర్వులు, సాక్షాలకు సంబంధించి నోట్స్ ఇతరత్రా పత్రాలను సిద్ధం చేసి సమకూర్చి పెడుతుంది.
ఉచిత న్యాయ సేవ పొందడానికి ఎవర్ని సంప్రదించాలి?
ఇది మీ కేసుకు సంబంధించిన పరిధిని బట్టి ఆధారపడి ఉంటుంది
తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ తాలూకాల్లోని న్యాయస్థానాల్లో ఉంటుంది
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కోర్టుల్లో ఉంటుంది
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆయా రాష్ట్రాల్లో ఉంటుంది
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఆయా రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఉంటుంది
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉంటుంది
ఉచిత న్యాయ సేవలు పొందాలనుకునేవారు తప్పనిసరిగా తమ కేసు ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని ముందుగా ఈ సంస్థల్లోని అధికారులను సంప్రదించాలి.
ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా?
తప్పకుండా చేసుకోవచ్చు. మీరు నల్సా సంస్థ ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లి అందులో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. https://nalsa.gov.in/) అందులో కాకపోయినా ఆయా రాష్ట్రాలకు వేర్వేరుగా రాష్ట్ర న్యాయసేవాధికార (State Legal Services Authorities) సంస్థలుంటాయి, వాటి వెబ్‌సైట్‌కు వెళ్లి అయినా సరే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(Andhra Pradesh State Legal Services Authority) వెబ్‌సైటు https://apslsa.ap.nic.in/
తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (Telangana State Legal Services Authority) వెబ్‌సైటు https://tslsa.telangana.gov.in/
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
పైన సూచించిన ఏదైనా వెబ్‌సైట్‌కు వెళ్తే అందులో నిర్దేశిత దరఖాస్తు ఉంటుంది.
ఆ దరఖాస్తులో కోరిన విధంగా మీ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే చాలు.
ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆన్‌లైన్‌లో నమూనా దరఖాస్తు ఉంటుంది. దాన్ని డౌన్‌లోడు చేసుకుని ప్రింట్ తీసుకుని ఆ దరఖాస్తును పూర్తి చేసి మీ కేసు పరిధిలోకి వచ్చే కోర్టులో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ అధికారులను కలిసి దరఖాస్తు సమర్పించవచ్చు.
తెల్లకాగితం మీద దరఖాస్తు రాసుకోలేమా?
ఇవేమీ అక్కర్లేకుండా మీరు ఒక తెల్లకాగితం తీసుకుని అందులో మీరు ఎలాంటి న్యాయ సహాయం కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలన్నీ వివరంగా రాసి దాన్ని మీ ప్రాంతంలోని కోర్టులో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ అధికారులకు నేరుగా అందజేయవచ్చు.
ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎలాంటి ఫీజు అయినా చెల్లించాల్సిన అవసరం ఉందా?
ఒక్కపైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. మీరు చేయాల్సిందల్లా సంబంధిత న్యాయస్థానాల్లో ఉన్న ఉచిత న్యాయ సేవాధికార సంస్థ అధికారులను కలవడమే.
నిరక్షరాస్యుడైన బాధితులు ఈ సేవలు పొందడమెలా?
అలాంటి వారికి రాష్ట్ర, జిల్లా, న్యాయసేవాధికార సంస్థలు లేదా అడ్వొకేట్ ప్యానెళ్లు సహకరిస్తాయి. లేదా బాధితులు తమ గ్రామాల్లోని పారా లీగల్ వాలంటీర్లను కూడా సంప్రదించి వారి ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే బాధితుడు తన దరఖాస్తుకు సంబంధించి జతచేసిన అన్ని పత్రాలపై తానే స్వయంగా సంతకాలు చేయడం లేదా వేలిముద్రలు వేయడం కానీ తప్పకుండా చేయాలి.
ఉచిత న్యాయ సహాయం కేవలం కింది కోర్టు వరకు మాత్రమే అందిస్తారా?
లేదు. కింది కోర్టు నుంచీ సుప్రీం కోర్టు వరకు మీ కేసుకు సంబంధించి మీరు ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చు.
నేను ఎలాంటి కేసుకు సంబంధించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు?
ఈ చట్టంలోని సెక్షన్ 12కు లోబడే ఎలాంటి కేసుకు సంబంధించి అయినా బాధితుడు ఉచితంగా న్యాయసహాయం సేవలు పొందవచ్చు.
కేసు వాదించడానికి నాకు నచ్చిన వకీలును ఎంపిక చేసుకోవచ్చా?
తప్పకుండా ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఆ వకీలు ఉచిత న్యాయసేవాధికార సంస్థ ఎంపిక చేసిన న్యాయవాదుల ప్యానెల్‌లో సభ్యుడై ఉండాలి. ఆ సంస్థ ప్యానెల్‌లోని న్యాయవాదుల్లో మీకు ఇష్టం వచ్చిన వకీలును మీ కేసు వాదించడానికి మీరు ఎంపిక చేసుకోవచ్చు.
నా కేసుకు సంబంధించి ఏ దశలోనైనా నేను ఉచిత న్యాయ సహాయం పొందవచ్చా?
తప్పకుండా. కోర్టు విచారణలో మీ కేసు ఏ దశలో ఉన్నప్పటికీ మీరు అవసరం అనుకుంటే ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు.
దరఖాస్తు చేసుకున్నాక ఏ ప్రాతిపదికన నా దరఖాస్తు ఎంపిక చేస్తారు?
మీరు ఒకసారి దరఖాస్తు సమర్పించాక లీగల్ సర్వీసు అథారిటీలోని అధికారులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు విచారణార్హతలను నిర్ణయిస్తారు.
ఆ కేసు పరిధిని బట్టి తాలూకా కోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు అక్కడి లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ సభ్యులు ఆ దరఖాస్తు అర్హతలను పరిశీలించి ఎంపిక చేస్తారు.
నా దరఖాస్తు ఎంపిక అయ్యాక ఎలాంటి చర్యలు చేపడతారు?
ఉచిత న్యాయ సహాయం కోసం మీ అభ్యర్థన దరఖాస్తు ఎంపిక కాగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీకు కేటాయించిన వకీలుకు సంబంధించి వివరాలను కూడా తెలియజేస్తారు. ఆ వకీలుకు ఈ కేసు వాదించడానికి నియమించినట్లుగా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ఒక ఉత్తర్వులు కూడా ఇస్తారు. ఈ ఆదేశాల ప్రకారం ఆ వకీలు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఈ లోపు మీరు కూడా ఆ వకీలును సంప్రదించవచ్చు.
దరఖాస్తు చేసుకున్నాక ఎన్ని రోజుల్లోపు నా కేసుకు సంబంధించి న్యాయవాదిని నియమిస్తారు?
చట్ట ప్రకారం మీరు దరఖాస్తు అందుకున్న వారం రోజుల్లోపే మీ దరఖాస్తును పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారం రోజుల్లోపే మీకు ఒక వకీలును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలి.
నా దరఖాస్తును తిరస్కరిస్తే నేను దాన్ని సవాల్ చేయవచ్చా?
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రెగ్యులేషన్ 7(5) ప్రకారం న్యాయ సేవల కోసం అందిన దరఖాస్తులను లీగల్ సర్వీసెస్ సంస్థ మెంబర్ సెక్రటరీ లేదా సెక్రటరీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఈ నిర్ణయంపై అప్పీలు చేసుకోవాలంటే ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లేదా ఛైర్మన్‌కు మాత్రమే అప్పీలు చేసుకోవాలి. ఇక ఆయన నిర్ణయమే అంతిమం.
ఏ పరిస్థితుల్లో ఉచిత న్యాయ సహాయాన్ని ఉపసంహరించుకుంటారు?
లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం సెక్షన్ 12 పరిధిలోకి బాధితుడు రాకపోతే..
బాధితుడు నిర్దేశిత ఆదాయ పరిమితికి మించి ఉన్నట్లు తేలితే..
బాధితుడు మోసానికి పాల్పడటం, తప్పుడు ప్రాతినిథ్యం వహించినట్లు తేలితే..
బాధితులు లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా కమిటీకి లేదా అథారిటీ నియమించిన న్యాయవాదికి సహకరించని పక్షంలో..
బాధితుడు ఒకవేళ మరణించినట్లయితే ఆ బాధితుడికి ఆస్తి వివాదాల తాలూకూ కేసు మినహా మిగిలిన కేసుల్లో న్యాయ సహాయం ఉపసంహరించుకుంటారు..
బాధితుడు న్యాయ విచారణను, లీగల్ సర్వీసెస్ అథారిటీలను దూషించిన పక్షంలో న్యాయ సహాయం ఉపసంహరిస్తారు..
నా కేసుకు సంబంధించి ఏ దశలోనైనా నేను ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందా?
ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ లీగల్ సర్వీసెస్ అథారిటీనే సమకూర్చుతుంది.
లీగల్ సర్వీసెస్ అథారిటీకి వ్యతిరేకంగా నేను ఎవరికి ఫిర్యాదు చేయొచ్చు?
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే కింది తాలూకా కోర్టులో కూడా లీగల్ సర్వీసెస్ కమిటీకి అక్కడి సీనియర్ జడ్జి ఛైర్మన్‌గా వ్యవహిరిస్తుంటారు. వారికి ఫిర్యాదు చేయొచ్చు.
నాకు నియమించిన న్యాయవాది తీరు సంతృప్తికరంగా లేదు, అప్పుడు నేను ఆయనపై ఫిర్యాదు చేయొచ్చా?
చేయొచ్చు. ఒక తెల్లకాగితంపై రాతపూర్వకంగా అక్కడి లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు.
అక్కడి అధికారులకు ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
లేదా NALSA కు nalsa-dla@nic.in ఈమెయిల్ చిరునామాకు ఫిర్యాదు చేయొచ్చు.
అయితే మీరు చేసే ఫిర్యాదు NALSA చట్టంలోని 8(14) నిబంధనలకు లోబడి ఉండాలి. అలా ఉన్నపక్షంలో ఆ వకీలును మీ కేసు నుంచీ ఏ దశలో ఉన్నప్పటికీ ఉపసంహరించుకనే అధికారం లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఉంది
లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేయు వేళలు ఏంటీ?
మీ ప్రాంతంలోని లీగల్ సర్వీసెస్ అథారటీ కార్యాలయం సోమవరాం నుంచీ శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచీ సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుంది. ఈ సమయంలో మీరు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించవచ్చు.
National Legal Services Authority - NALSAను ఆ సంస్థ వెబ్‌సైట్ ద్వారా 24/7 ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
National Legal Services Authority - NALSA చిరునామా
COMMUNICATION ADDRESS:
National Legal Services Authority - NALSA
JAISALMER HOUSE
26, MAN SINGH ROAD, NEW DELHI-110011
PH. NO.-011- 23382778, 23071450
FAX NO.-011-23382121
COMMENTS