Gold Selling Vs Gold loan: Gold is your decision..Should you sell gold in an emergency? Should I take a loan? Which is better..
Gold Selling Vs Gold loan: మీ నిర్ణయమే బంగారం.. అత్యవసర పరిస్థితుల్లో బంగారం అమ్మాలా? లోన్ తీసుకోవాలా? ఏది బెటర్..
అత్యవసర సమయాల్లో ఇంట్లో బంగారం ఉంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆరోగ్యం లేదా మరేదైనా అత్యవసర పరిస్థితుల్లో దానిని తనఖా పెట్టుకోవచ్చు. లేదా అమ్మి అవసరాలు తీర్చుకోవచ్చు. ఇతర ఏ మార్గంలో అయినా కాస్త టైం పడుతుంది. అలాగే వడ్డీ కూడా అధికంగా ఉంటుంది. బంగారం విషయంలో అయితే చాలా సులువుగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మీరు బంగారం అమ్మాలన్నా, లేదా బ్యాంకులో తనఖా పెట్టాలన్నా రెండింటిపై అవగాహన ఉండటం అవసరం. రెండింటిలోనూ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే మీ అత్యవసరాలను తీర్చడంలో ఉపయోగపడే బంగారాన్ని అమ్మడం, గోల్డ్ లోన్ తీసుకొనే విధానాల గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. రెండింటిలో మీకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో కూడా వివరిస్తున్నాం.. ఈ కథనం చివరి వరకూ చదవండి.
అమ్మితే తక్షణ ప్రయోజనం..
మీ బంగారాన్ని అమ్మడం ద్వారా మీకు తక్షణ నిధులు అందుతాయి. మీరు మీ బంగారు వస్తువులను విక్రయించినప్పుడు, వాటి బరువు, స్వచ్ఛత ఆధారంగా మీరు ఒకేసారి తగిన మొత్తాన్ని అందుకుంటారు. మీకు అత్యవసరంగా పెద్ద మొత్తంలో నగదు అవసరం అయితే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ సులభంగా వేగంగా పూర్తవుతుంది. వెంటనే చేతిలో డబ్బులు ఉంటాయి. అయితే, మీరు పరిగణించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. డీలర్ మార్జిన్, ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల కారణంగా బంగారాన్ని విక్రయించేటప్పుడు మీరు స్వీకరించే ధర ప్రస్తుత మార్కెట్ ధరతో సమానంగా ఉండకపోవచ్చు. అయితే మీ కుటుంబంలో వారసత్వంగా వచ్చిన ఆభరణాలు అయితే వాటిని అమ్మడం కాస్త కష్టంగా ఉంటుంది. భావోద్వేగంతో ముడిపడిన అంశం కాబట్టి కాస్త్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇన్ స్టంట్ గోల్డ్ లోన్..
చాలా మంది వ్యక్తులు గోల్డ్ లోన్‌లను ఇష్టపడటానికి ఒక ముఖ్య కారణం తక్కువ వడ్డీతో పాటు తిరిగి చెల్లించి, ఆభరణాలను మళ్లీ సొంతం చేసుకోవచ్చు. ఊహించని ఆర్థిక సంక్షోభాలు లేదా ఒత్తిడితో కూడిన అవసరాలతో కూడిన పరిస్థితుల్లో, సమయం ఒక క్లిష్టమైన అంశంగా మారుతుంది. ఈ గోల్డ్ లోన్లు త్వరితగతిన నిధులను అందిస్తాయి. పలు ఫైనాన్షియల్ సంస్థలను నిమిషాల వ్యవధిలో నిధులను ఖాతాలలో జమ చేస్తాయి. బయటి వడ్డీ వ్యాపారులు అయితే ఆ క్షణమే నగదు చేతిలో పెడతారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రుణదాతలు నిధులను అందిస్తారు. ఇందుకోసం కావాల్సినదల్లా కేవైసీ పత్రాలతో పాటు 18 నుంచి 22 క్యారెట్ల బంగారం మాత్రమే. ఇవి సాధారణంగా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లతో పోల్చితే తక్కువ వడ్డీతోనే వస్తాయి. ఈ రెండు లోన్లు సురక్షితమైనవి కావు. బంగారంపై లోన్ మాత్రం సురక్షితమైన జాబితాలోకి వస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీకే అందుతాయి.
ఏది బెస్ట్ చాయిస్..
బంగారాన్ని విక్రయించడం, లేదా ఇన్ స్టంట్ గోల్డ్ లోన్ తీసుకోవడం.. ఈ రెండింటిలో ఏది ఉపయుక్తంగా ఉంటుందో అది మీ అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకున్న బంగారు ఆభరణాలపై సెంటిమెంట్ ఉంటే మీకు బంగారు రుణం ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇది మీ ఆభరణాలతో శాశ్వతంగా విడిపోకుండా మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఇన్‌స్టంట్ గోల్డ్ లోన్ ఆప్షన్‌ను తీసుకొనే ముందు గోల్డ్ లోన్ వడ్డీ రేటు గురించి ఆరా తీయడం మంచిది . సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి మీ బంగారాన్ని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని దీన్ని సరిపోల్చండి. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడటానికి మీ బంగారు ఆస్తులు విలువైన వనరుగా ఉంటాయని గుర్తుంచుకోండి.
COMMENTS