Fake Passport Websites: Alert for passport clients.. Be careful with those fake websites..!
Fake Passport Websites: పాస్‌పోర్ట్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ ఫేక్ వెబ్‌సైట్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
టెక్నాలజీ పెరిగే కొద్దీ సదుపాయాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు అవసరమయ్యే పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం గతంలో రోజుల తరబడి వేచి చూసేవారు. కానీ ఇప్పుడు ఇంటి నుంచే అప్లై చేసుకునేలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని మోసాలు చేసే వారి సంఖ్య పెరిగింది. తాజాగా వీరు ఫేక్ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ల ద్వారా వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌పోర్ట్ సేవలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేస్తున్న నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లపై జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను పూరించడం, అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, మరిన్నింటితో సహా సేవలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేస్తాయి. ముఖ్యంగా సంబంధిత సేవల కోసం అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి అదనపు భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, కచ్చితంగా వీటిపై అవగాహనతో ఉండాలని పేర్కొంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులను మోసం చేస్తున్న ఆ నకిలీ వెబ్‌సైట్‌ల కథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
నకిలీ వెబ్‌సైట్-1
www.indiapassport.org పేరుతో ఉండే ఈ వెబ్‌సైట్ తెరిచినప్పుడు “ఖాతా సస్పెండ్ చేయబడింది అని చూపుతుంది. అయితే ఇది ఇతర సారూప్య డొమైన్‌లతో మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నకిలీ వెబ్‌సైట్-2
www.online-passportindia.com ప్రభుత్వం పౌరులను హెచ్చరించిన మరో వెబ్‌సైట్ ఇది. ఇది ఓటర్ కార్డ్‌తో సహా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనేక ఎంపికలను తెరిచి చూపుతుంది. ఇది పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల సున్నితమైన డేటాను దొంగిలించడానికి ఉద్దేశించిన నకిలీ వెబ్‌సైట్.
నకిలీ వెబ్‌సైట్-3
www.passportindiaportal.in పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులను ప్రభుత్వం హెచ్చరించే మూడో నకిలీ వెబ్‌సైట్ ఇది. హోమ్ పేజీలో ఈ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగలించడమే ఈ వెబ్‌సైట్ పని.
నకిలీ వెబ్‌సైట్-4
www.passport-india.in వెబ్‌సైట్ గురించి కూడా భారత పాస్‌పోర్ట్ అథారిటీ హెచ్చరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు కచ్చితంగా వెబ్‌సైట్‌కు దూరంగా ఉండాలని సూచించింది.
నకిలీ వెబ్‌సైట్-5
www.passport-seva.in వెబ్‌సైట్ కూడా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. డాట్ ఇన్ డొమైన్‌తో ఇది భారత ప్రభుత్వ పాస్‌పోర్ట్ అధికారిక వెబ్‌సైట్‌గానే భ్రమపడేలా ఈ వెబ్‌సైట్ హోం పేజీను డిజైన్ చేశారు.
నకిలీ వెబ్‌సైట్-6
www.applypassport.org డాట్ ఓఆర్‌జీ పేరుతో వచ్చే ఈ వెబ్‌సైట్ కూడా మరొక నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌పై జాగ్రత్తగా ఉండాలని దరఖాస్తుదారులను భారత ప్రభుత్వం హెచ్చరించింది.
అధికారిక వెబ్‌సైట్ ఇదే
పాస్‌పోర్ట్ సేవలను దరఖాస్తు చేసుకోవడానికి భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు అన్ని పాస్‌పోర్ట్ సంబంధిత సేవలకు అందుబాటులో ఉన్న ఏకైక వెబ్‌సైట్ ఇదేనని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంది. దేశంలోని 36 పాస్‌పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని 190 భారతీయ మిషన్లు, పోస్ట్‌ల నెట్‌వర్క్ ద్వారా భారతీయ పౌరులకు పాస్‌పోర్ట్‌లను జారీ చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బాధ్యత వహిస్తుంది.
COMMENTS