Engineering: From now on, you can do engineering while working
Engineering: ఇకనుంచి ఉద్యోగం చేస్తూనే.. ఇంజినీరింగ్ చేసుకోవచ్చు
చాలామంది ఇంజినీరింగ్ చేసి ఆ తర్వాత ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. కానీ కొందరికి కుటుంబ పరిస్థితులు, బాధ్యతల వల్ల తాత్కలికంగా వేరే ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి ఓ మంచి అప్‌డేట్ వచ్చేసింది. ఇకనుంచి ఉద్యోగం చేసుకుంటూ కూడా బీటెక్ చదవచ్చు. అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు బీటెక్ చదువును పూర్తి చేయవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే వృత్తి నిపుణులు బీటేక్‌లో చేరే అవకాశాన్ని కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ( ఏఐసీటీఈ ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. ఇక బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఒక్కో బ్రాంచిలో 30 సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇది పార్ట్‌టైమ్ గా చేసే కోర్సు కాదు. రెగ్యలర్ మోడ్‌లోనే నిర్వహించనున్నారు.
ఈ కోర్సుల నిర్వహణకు కూడా విద్యా సంస్థల నుంచి తాజాగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏఐసీటీఈ అనుమతించిన కళాశాలలు, కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. నిరంతరాయంగా విద్యను ప్రొత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పలు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తూనే బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొంది.. ఇంజినీరింగ్ పట్టాను అందుకోవచ్చు.
ఇందులో ఉన్న నిబంధనలను పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి గుర్తింపు/ అనుమతి పొంది నడుస్తున్న పరిశ్రమలు, సంస్థల్లోని వృత్తినిపుణులకు మాత్రమే ఈ కోటాలో ప్రవేశాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇందుకోసం ఆయా సంస్థ యాజమాన్యం పర్మిషన్ కూడా తప్పనిసరి. అలాగే ఒక్కో జిల్లాలోని 1 నుంచి 4 వరకు విద్యాసంస్థలకు ఇలాంటి కోర్సులను నిర్వహించేలా అవకాశం ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో సివిల్, మెకానికల్ వంటి కోర్ కోర్సులతో పాటు, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ లాంటి కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
COMMENTS