E-Challan Scam: New trick.. Scams in the name of challans.. Just click on these messages!
E-Challan Scam: కొత్త ఎత్తుగడ.. చలాన్ల పేరిట మోసాలు.. ఈ మెసేజ్‌లు క్లిక్ చేస్తే అంతే సంగతులు!
New E-Challan Scam: కొంతకాలంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఇట్టే డబ్బులు లాగుతున్నారు సైబర్ నేరస్థులు. ఇ-చలాన్ల పేరిట ఇప్పుడు సైబర్ ఫ్రాడ్‌స్టర్స్ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్ పంపించి అమాయకుల నుంచి డబ్బులు లాగేస్తున్నారు.
Cyber Crimes: సైబర్ నేరగాళ్లు కూడా టెక్నాలజీని బట్టి మారుతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సందర్భాలను బట్టి జనాల నుంచి కొత్త పంథాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. గత కొంత కాలంగా ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఇ- చలాన్ల పేరిట కొత్త తరహా ఫ్రాడ్స్ చేస్తున్నారు. వాహనదారులకు వ్యక్తిగత సందేశాలు పంపించి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వ, పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సైబర్ ఫ్రాడ్‌స్టర్స్.. ఇ-చలాన్స్ పేరిట వ్యక్తులకు మెసేజ్‌లు పంపుతున్నారు. వాటిల్లోనే పేమెంట్స్ లింక్స్ కూడా ఉంచుతున్నారు.
ఈ పేమెంట్స్ లింక్స్ నిజమేనని నమ్మి ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేస్తే గనుక బ్యాంక్ అకౌంట్ వివరాల్ని హ్యాక్ చేసి అందులోనే డబ్బులు కొట్టేస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. అందుకే ఇలాంటి సందేశాలు వస్తే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఇలా గుర్తించండి..
సాధారణంగా చలాన్‌ల పేరుతో వచ్చే మెసేజుల్లో వెహికిల్ నంబర్, ఇంజిన్, ఛాసిన్ నంబర్ సహా పలు వివరాలన్నీ ఉంటాయి. సైబర్ నేరస్థులు పంపే వాటిల్లో ఇవేం ఉండవు. ఇంకా ఇలాంటి మెసేజ్‌లు.. మొబైల్ నంబర్స్ నుంచి రావని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అందుకే ఇలాంటి సందేశాలు ఏమైనా వచ్చినప్పుడు మొదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
చలాన్లకు సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ https://echallan.parivahan.gov.in ను పోలిన వెబ్‌సైట్లతో ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారని, అందుకే ఇలాంటి మెసేజ్‌లు ఏం వచ్చినా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి మీరు గురైనట్లయితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. సదరు బ్యాంకుకు కూడా సమాచారం అందించాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలి.
COMMENTS