Bank Locker Key: If the bank locker key is lost, that's all.. All those expenses are yours..!
Bank Locker Key: బ్యాంక్ లాకర్ కీ పోతే అంతే సంగతులు.. ఆ ఖర్చులన్నీ మీవే..!
కష్టపడి సంపాదించిన సొత్తును పరులపాలు కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మన పెట్టుబడులకు సంబంధించిన సమాచారంతో పాటు విలువైన వస్తువులైన బంగారం, ఆస్తి పేపర్లు వంటివి భద్రంగా ఉంచుకుంటాం. ఇలా చేయడానికి కచ్చితంగా అందరూ బ్యాంకుల సేవలను ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా బ్యాంకు లాకర్లలో భద్రపర్చడానికి ఇష్టపడుతున్నారు. అంతా బాగా ఉన్నంత వరకూ ఓకే కానీ ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో లాకర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలో? చాలా మందికి తెలియదు. అసలు బ్యాంకులు లాకర్ సర్వీస్‌ను అందించడానికి చార్జ్ చేస్తాయని చాలా మందికి తెలుసు. అయితే ఒకవేళ లాకర్ కీ కస్టమర్ పోగొట్టుకుంటే బ్యాంకులు వారితోనే చార్జీలు కట్టిస్తాయి. అయితే దానికి నిర్ధిష్ట ప్రాసెస్ ఉంటుంది. బ్యాంకు లాకర్ కీ పోగొట్టుకుంటే ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
లాకర్ కీ పొగొట్టుకుంటే ప్రాసెస్ ఇదే
మీ బ్యాంక్ లాకర్ కీని పోగొట్టుకుంటే ఆ సంఘటన గురించి వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. అలాగే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. లాకర్ కీ పోయినట్లయితే బ్యాంక్ మీకు డూప్లికేట్ కీని అందిస్తుంది. ఒక్కోసారి బ్యాంక్ మీకు మరో లాకర్‌ను అందిస్తుంది. అయితే మొదటి లాకర్‌ను బద్దలకొట్టి అందులోని వస్తువులు కస్టమర్ సరిచూసుకున్నాక రెండో లాకర్ అందిస్తారు. అయితే లాకర్‌ను బద్దలు కొట్టడం నుండి దాని మరమ్మత్తు వరకు మీరు మొత్తం ఖర్చును కస్టమర్ మీదే బ్యాంకు వేస్తుంది.
లాకర్ బద్దలకొట్టడానికి నియమాలివే
సాధారణంగా బ్యాంకు లాకర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవాల్సి వచ్చినా లేదా పగలగొట్టాల్సిన అవసరం వచ్చినా కస్టమర్, బ్యాంక్ అధికారి సమక్షంలో ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా లాకర్‌ను ఉమ్మడిగా ఉంచినట్లయితే, ఈ ప్రక్రియలో సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. కస్టమర్ హాజరుకాకపోతే, కస్టమర్ రాతపూర్వక సమ్మతితో లాకర్‌ను విచ్ఛిన్నం చేయవచ్చు.
బ్యాంకులకు ప్రత్యేక అధికారం
ఎస్‌బీఐ పాలసీ ప్రకారం ఒక కస్టమర్ వరుసగా మూడు సంవత్సరాలు లాకర్ అద్దెను చెల్లించడంలో విఫలమైతే చెల్లించని అద్దెను తిరిగి పొందడానికి లాకర్‌ను విచ్ఛిన్నం చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది. ఇంకా లాకర్ ఏడేళ్లపాటు పని చేయకుండా ఉండి, ఈ సమయంలో కస్టమర్ బ్యాంకును సందర్శించకపోతే అద్దె చెల్లించినప్పటికీ బ్యాంకు లాకర్‌ను పగలగొట్టవచ్చు. అదనంగా బ్యాంక్ లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయస్తే లాకర్‌లో నేరానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయని బ్యాంక్ లేదా పోలీసులు అనుమానిస్తే కస్టమర్ లేనప్పుడు కూడా లాకర్ పగలవచ్చు. అందుకే ఇలాంటి సంఘటనల సమయంలో బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు కలిసి ఉంటారు.
COMMENTS