Are you a college student? Ways to earn money while working in spare time!
మీరు కాలేజీ స్టూడెంట్సా..? తీరిక వేళల్లో పని చేస్తూ.. డబ్బులు సంపాదించే మార్గాలివే!
మీరు కాలేజీ విద్యార్థులా...? తీరిక వేళల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీరు పార్ట్ టైంగా పని చేస్తూ.. డబ్బులు సంపాదించుకునే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..
గతంలో కాలేజీకి వెళ్లే విద్యార్థులు ప్యాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడేవారు. కానీ ఇప్పటి యువత ధోరణిలో మార్పు వచ్చింది. చదువుకుంటూనే సంపాదించే మార్గాలపై దృష్టి పెడుతున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాలు పెరగడం, తల్లిదండ్రులను మరీ ఇబ్బంది పెట్టొదనే ఆలోచన కూడా దీనికి కారణం. చదువుకుంటూ పని చేయడం అనేది విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. క్రమంగా మన దగ్గర కూడా పని చేస్తూ డబ్బులు సంపాదించుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తీరిక వేళల్లో నచ్చిన పని చేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించడమే కాకుండా.. నలుగురితో పరిచయాలు పెంచుకోవచ్చు. అలాగే అనుభవం కూడా మీ సొంతం అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్, యువతకు పని చేయాలని ఉన్నప్పటికీ.. తమ ముందున్న మార్గాల గురించి అవగాహన ఉండదు. స్టూడెంట్స్ ఖాళీ సమయాల్లో పని చేస్తూ.. డబ్బులు సంపాదించుకునే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..
హోం ట్యూషన్లు చెప్పడం..
మీకు సబ్జెక్టులో మంచి పట్టు, టీచింగ్ స్కిల్స్ ఉంటే చాలు ట్యూషన్లు చెప్పుకొని బాగా సంపాదించొచ్చు. ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ హోం ట్యూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. తమ ఇంటికే వచ్చే పిల్లలకు పాఠాలు చెప్పాలని కోరుకునే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. ఇలా హోం ట్యూషన్లు చెప్పే వారికి ఇచ్చే ఫీజు కూడా ఎక్కువగానే ఉంటోంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు బోధించే వారికి మంచి డిమాండ్ ఉంది. మీరు ట్యూషన్లు చెప్పడం ద్వారా రోజువారీ అవసరాలకు సరిపడే డబ్బు సంపాదించడమే కాదు కొంత వెనకేసుకోవచ్చు. అదే సమయంలో సబ్జెక్ట్‌పై గ్రిప్ మరింత పెరుగుతుంది. అంతే కాదు ఓ విద్యార్థికి సాయం చేసినట్లు కూడా అవుతుంది.
ఆన్‌లైన్ ట్యూటర్‌గా మారడం..
మీకు హోం ట్యూటర్‌గా మారడం ఇష్టం లేకపోయినా.. అలా మారే అవకాశం దొరక్కపోయినా ఆన్‌లైన్ ట్యూటర్‌గా మారొచ్చు. Udemy, MyTutor చాలా ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్లు ట్యూటర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ ట్యూటర్‌గా మీకు తీరిక వేళల్లోనే పని చేసే వెసులుబాటు ఉంటుంది. మీరు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పొచ్చు. అయితే మీ వద్ద ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి. మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకొని ఆన్‌లైన్ ట్యూటర్‌గా మారొచ్చు. దీని వల్ల మీ సబ్జెక్ట్ మాత్రమే కాదు లిజనింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.
డెలివరీ పార్ట్‌నర్
నగరాల నుంచి పల్లెల వరకూ ఆన్‌లైన్ ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రతిదీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం జనాలకు అలవాటుగా మారుతోంది. మీ దగ్గర బైక్ ఉంటే డెలివరీ పార్ట్‌నర్‌గా పని చేయొచ్చు. జొమాటో, స్విగ్గి లాంటీ సంస్థలతో టై అప్ కావడం ద్వారా ఫుడ్ డెలివరీ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థల ద్వారా ఆర్డర్ చేసుకునే వారికి వస్తువులను డెలివరీ చేయొచ్చు. గ్రాసరీ ఐటమ్స్, పాలు ఇలా ఎన్నో రకాల వస్తువులను డెలివరీ చేసే అవకాశాలున్నాయి.
పార్ట్‌టైం జాబ్
సూపర్ మార్కెట్లు, స్టోర్లలో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. కాలేజీ సాయంత్రం కల్లా అయిపోతుంది కాబట్టి రాత్రి వరకు స్టోర్లలో పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. ముఖ్యంగా వీకెండ్స్, సెలవు రోజుల్లో పూర్తి సమయం చేయొచ్చు. సూపర్ మార్కెట్లలో రద్దీ వీకెండ్స్‌లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు సూపర్ మార్కెట్ల మేనేజ్‌మెంట్‌కు, ఇటు మీకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న చిన్న వస్త్ర దుకాణాలు, స్టోర్లకు సైతం పార్ట్ టైం జాబ్‌లు చేసేవారు అవసరం.
కేర్ టేకర్.. బేబీ సిట్టింగ్:
మీకు పిల్లలంటే ఇష్టం ఉంటే బేబీ సిట్టర్‌గా మారొచ్చు. నగరాల్లో బతకాలంటే భార్యాభర్తలిద్దరూ పని చేయాల్సిన పరిస్థితి. షిఫ్టుల వారీగా పని చేస్తూ.. పిల్లల ఆలనాపాలనా చేసుకునే పేరెంట్స్ ఎంతో మంది. మీకు పిల్లలను చూసుకోవడం ఇష్టమైతే గనుక.. బేబీ సిట్టర్‌గా పని చేయొచ్చు. తద్వారా మీకు తెలియకుండానే టైం గడిచిపోవడంతోపాటు డబ్బులు కూడా వస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న పెద్ద వారిని చూసుకోవడం కోసం కూడా చాలా మంది కేర్ టేకర్ల కోసం చూస్తుంటారు. మీరు వారికి సాయంగా ఉంటూ.. డబ్బు సంపాదించొచ్చు. హాస్పిటళ్లలో పేషెంట్లను చూసుకునే అటెండర్‌గా సేవలందిస్తూ రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించొచ్చు. మీ పని తీరుతో ఆకట్టుకుంటే.. భవిష్యత్తులో ఉద్యోగ వేటలో మీకు ఉపయోగపడొచ్చు.
యూట్యూబర్‌గా మారడం
టెక్నాలజీ మీద కొంత అవగాహన పెంచుకుంటే చాలు మీరే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టొచ్చు. ఆసక్తికర వీడియోలు తీసి అప్‌లోడ్ చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు. జస్ట్ మీ ఫోన్ ద్వారానే వీడియో తీసి దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అవసరమైన చోట ఆడియో యాడ్ చేసి వీడియోను ఆకర్షణీయంగా రూపొందించి యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్ చేయొచ్చు. వీడియో క్రియేట్ చేయడానికి ఫోన్లలో బోలెడు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలతో మీకు వెంటనే ఆదాయం రాకపోవచ్చు. కానీ యూజర్లను ఆకర్షించే కంటెంట్‌తో వీడియోలు చేస్తూ.. కష్టపడి పని చేస్తే.. కళ్లు చెదిరే ఆదాయం మీ సొంతం అవుతుంది. మన దగ్గర నెలకు లక్ష రూపాయలకుపైగా సంపాదించే యూట్యూబర్లు చాలా మందే ఉన్నారు.
ఇళ్లు చూసి పెట్టడం
నగరాల్లో ఉండే వారిలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటారు. ఇల్లు మారాలంటే కాలనీలన్నీ తిరగాల్సిందే. ఈ బాధ తప్పించేందుకు మీడియేటర్లు రంగంలోకి దిగుతున్నారు. కస్టమర్లకు ఇళ్లను చూపించి.. అద్దెకు ఇస్తున్నారు. మీరు ఇలా మీడియేటర్‌గా మారొచ్చు. తద్వారా పరిచయాలు పెంచుకోవచ్చు. ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లోనూ మీరు పని చేయొచ్చు. చాలా మంది వీకెండ్స్‌లోనే ఇళ్లు మారతారు కాబట్టి మీ చదువువకు ఇది పెద్ద ఇబ్బందేం కాదు. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారికి వాటిని చూసి పెట్టే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారడం ద్వారా కూడా మీరు పెద్ద మొత్తంలో సంపాదించొచ్చు. అయితే ఇది సెలవుల్లోనే సాధ్యం అవుతుంది.
ఫొటోలు తీసి అమ్మడం
ఫొటోలు తీసి అమ్మడం ఏంటని అనుకుంటున్నారా..? మీకు ఫొటోలు తీసే హాబీ ఉంటే.. మీ ఫోన్ కెమెరాతోనే అద్భుతమైన ఫొటోలు తీసి వాటిని ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టొచ్చు. గెట్టీ ఇమేజెస్, అడోబ్ స్టాక్ లాంటి స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్లలో మీ ఫొటోలను అప్‌లోడ్ చేయొచ్చు. వాటిని ఎవరైనా వాడుకుంటే ఆ వెబ్‌సైట్లు మీకు కొంత మొత్తం చెల్లిస్తాయి. యూనిక్‌గా ఉండే ఫొటోలు తీయడం ద్వారా మీరు ఎక్కువగా సంపాదించొచ్చు.
డొమైన్ నేమ్స్ విక్రయించడం
మీ దగ్గర కొంత మొత్తం ఉంటే చాలు గో డాడీ.కామ్ లాంటి సైట్ల నుంచి డొమైన్లను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ మొత్తానికి అమ్ముకోవచ్చు. మీరు చాలా తక్కువ మొత్తంతో కొనుగోలు చేసిన డొమైన్.. ఆ తర్వాత భారీ ధరకు అమ్ముడుపోవచ్చు. అయితే దీనికోసం కొంత రీసెర్చ్ చేయడం అవసరం. మీరు డొమైన్ కొనుగోలు చేయగానే అది అమ్ముడుపోతుందని అనుకోవద్దు. దానికి కొంత సమయం పడుతుంది.
యాప్‌లు, వెబ్‌సైట్ల రివ్యూ/టెస్టింగ్
యాప్‌లు, వెబ్‌సైట్లను తయారు చేయడం ఒక ఎత్తు అయితే.. వాటిలో లోపలు లేకుండా జాగ్రత్త పడటం మరో ఎత్తు. ఎంత టెస్టింగ్ చేసినా.. లోపాలు సహజం. కాబట్టి ఓ ఎండ్ యూజర్‌గా మీరు యాప్, వెబ్ సైట్లను రివ్యూ చేయొచ్చు. దాని పనితీరులో లోపాలను కనిపెట్టి సదరు సంస్థకు చెప్పడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు. ఇలా చేయడానికి మీరు నచ్చిన టైంలో పని చేయొచ్చు. ప్రొడక్టులకు రివ్యూలు పోస్టు చేయడం ద్వారానూ మీరు డబ్బు సంపాదించొచ్చు.
ఇంకా ఎన్నో అవకాశాలు..
ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. యాప్‌లు, వెబ్‌సైట్లు తయారు చేయడం.. వీడియో ఎడిటింగ్, కెమెరామెన్‌గా పని చేయడం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో వర్క్ చేయడం.. ఇన్‌స్టిట్యూట్‌లలో సహాయకుడిగా పనిచేయడం.. వస్తువులను బల్క్‌గా కొని రిటైల్‌గా అమ్మడం, ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఫొన్లు, ల్యాప్‌టాప్‌లు, బైకులు కొనుగోలు చేసి లాభం చూసుకొని అమ్ముకోవడం (ఒరిజినల్ బిల్లు, ఇతర డాక్యుమెంట్లు సరి చూసుకోవడం తప్పనిసరి) ఇలా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.
COMMENTS