Income Tax Day 2023: Why is Income Tax brought? When was it collected for the first time in the country?
Income Tax Day 2023: ఇన్‌కమ్ ట్యాక్స్ తెచ్చింది అందుకా? దేశంలో తొలిసారి ఎప్పుడు వసూలు చేశారంటే?
Income Tax Day 2023: దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఎప్పుడు, ఎందుకు ప్రవేశ పెట్టారో చాలా మందికి తెలిసుండక పోవచ్చు. అయితే, ప్రతి ఏటా జులై 24న ఆదాయపు పన్ను దినోత్సవాన్ని కేంద్ర సర్కార్ నిర్వహిస్తోంది. ఈ రోజునే ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు మొదట ఆదాయపు పన్ను దేనికోసం తీసుకొచ్చారు అనేది ఓసారి చరిత్రలోకి వెళ్లి తెలుసుకుందాం.
Income Tax Day 2023: ప్రస్తుతం లెక్కకు మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకపోతే కఠిన చర్యలు ఉంటాయి. భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష సైతం పడొచ్చు. ఇందంతా తెలిసిన విషయమే. అయితే, దేశంలో తొలిసారి ఆదాయపు పన్ను ఎప్పుడు వసూలు చేశారు. ఆదాయంపై ట్యాక్స్ కట్టండం ఎప్పుడు మొదలు పెట్టారు, దేని కోసం తొలుత ఈ పన్ను వసూలు చేశారు అనే విషయాలు చాలా మందికి తెలిసుండవు. భారత దేశంలో పన్ను విధానాన్ని తీసుకొచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఏటా జులై 24న అధికారికంగా ఆదాయపు పన్ను దినోత్సవం లేదా ఆయ్కార్ దివాస్‌గా నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, పన్ను చెల్లింపుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, దేశంలో తొలిసారి ఆదాయపు పన్ను ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారనే విషయాన్ని ఓసారి చరిత్రలోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తొలిసారి పన్ను అప్పుడే..
సర్ జేమ్స్ విల్సన్ అనే బ్రిటిష్ అధికారి భారత్‌లో 1860, జూలై 24 న తొలిసారి ఆదాయపు పన్నును అమలులోకి తీసుకొచ్చారు. అందుకు ఒక బలమైన కారణం ఉంది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలకులకు జరిగిన నష్టాలను పూడ్చుకునేందుకు, వారికి పరిహారం చెల్లించేందుకు ఈ ఇన్‌కమ్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. 1922లో పన్ను వసూలును సమన్వయం చేయడానికి అధికారిక విధానం తీసుకొచ్చే వరకు బ్రిటిష్ పాలకులకు ఆదాయంపై పన్నులు చెల్లించారు భారత ప్రజలు. ఆ తర్వాత 1939 లో ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాన్ని తొలిసారి సవరించారు. నిర్మాణపరంగా రెండు ప్రధాన మార్పులు చేశారు. అప్పీలేట్ విధులను అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ల నుంచి తొలగించారు.
2010 లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జులై 24ను ఇన్‌కమ్ ట్యాక్స్ దినోత్సవంగా ప్రకటించింది. 'ఆదాయపు పన్నును మొట్టమొదట 1860 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సుంకాన్ని విధించే అధికారం ఆ సంవత్సరం జులై 24 నుంచి అమలులోకి వచ్చింది. అందుకే ఈ రోజును ఆదాయపు పన్ను దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తున్నాం' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ 2010 సంవత్సరంలో వెల్లడించింది. ఈ ఉత్సవాలను అప్పటి ఆర్థిక ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.
2023 వేడుకలు
ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుకుని దేశంలోని ప్రాంతీయ ట్యాక్స్ ఆఫీసుల ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపులను ప్రోత్సహించడానికి, పన్నులు చెల్లించడం అనేది ప్రజల నైతికత అని తెలియజేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్ కం ట్యాక్స్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు ఇదే ఇన్ ఛార్జ్. ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగానికి ఐటీ శాఖ రిపోర్టు చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ)గా పిలిచే అపెక్స్ బాడీ దీనిని పర్యవేక్షిస్తుంది.
COMMENTS