Important decision of IRTC for general coach passengers.. Rs. 50K full meal
జనరల్ కోచ్ ప్రయాణికుల కోసం IRTC కీలక నిర్ణయం.. రూ. 50కే కడుపునిండా భోజనం
రైల్వేలో చాలా మంది జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తుంటారు. అప్పటికప్పడు జర్నీ ఫిక్స్ అయినా, టికెట్ దొరకపోయినా ఇలా వివిధ కారణాలతో చాలా మంది జనరల్ కోచ్‌లో వెళ్తుంటారు. అయితే జనరల్‌లో ప్రయాణం అంటే ఎంత ఇబ్బంది పడాలో మీరు ఒక్కసారి అయినా అనుభవించి ఉంటారు. ఒంటికాలుపైనే నుల్చోని వెళ్లాల్సి ఉంటుంది. వీరు ఏదైనా స్టేషన్‌లో నీళ్ల కోసమే, తినే పదార్థాల కోసమే దిగి మళ్లీ ఎక్కాలంటే.. పెద్ద సాహసమే చేయాలి. అయితే ఇకపై జనరల్ కోచ్ ప్రయాణికులకు భోజన కష్టాలు తీరిపోనున్నాయి. తక్కువ ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది.
జనరల్ కోచ్ ప్రయాణికుల ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కోచ్‌లకు తక్కువ ధరలకే భోజనం, ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించేందుకు IRTC సిద్ధమైంది. ఈ భోజనాన్ని అందించడానికి, ప్లాట్ ఫారమ్‌లపై, జనరల్ కోచ్‌ల దగ్గర సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
జనరల్ బోగీ ప్రయాణికులకు తక్కువ ధరలకు అందించే భోజనాన్ని రెండు వర్గాలుగా విభజించారు. రూ.20 ధరతో ఉన్న మొదటి ఆప్షన్‌లో ఏడు పూరీలు, డ్రై ఆలూ, చట్నీ ఉంటాయి.
రెండో ఆప్షన్‌లో రూ.50కు రైస్, రాజ్మా, చోలే, కిచిడీ, భాతురే, పావుభాజీ, మసాలా దోశ వంటి వివిధ రకాల దక్షిణ భారత ఆహార పదార్థాలు ఉంటాయి.
ఈ భోజనం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కిచెన్ యూనిట్ల నుంచి సరఫరా అవుతుంది. తొలుత 51 స్టేషన్లలో ఈ సేవలు అమలు చేశారు. కొత్తగా గురువారం నుంచి మరో 13 స్టేషన్లలో సేవలు ప్రారంభించారు. ఈ కౌంటర్ల వద్ద 200 ఎంఎల్ తాగునీటి గ్లాసులను కూడా అందించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై ఉండే జనరల్ సీటింగ్ కోచ్‌లతో అనుసంధానం చేస్తూ, రైల్వే జోన్లవారీగా కౌంటర్ల లొకేషన్‌ను నిర్ణయించడంతో పాటు ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ సర్వీస్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ భోజనాలకు అదనంగా IRCTC బిర్యానీ సహా కొన్ని భోజన రకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికుల డిమాండ్ కారణంగా వీటిని తీసుకొచ్చింది. రూ.70కి వెజ్ బిర్యానీ, రూ.100కి చికెన్ బిర్యానీ అందిస్తోంది. బిర్యానీ క్వాంటిటీ 350 గ్రాములు ఉంటుంది. అంతేకాకుండా IRCTC ప్రాంతీయ రుచులు, వంటకాలతో ‘స్నాక్ మీల్’ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 350 గ్రాముల క్వాంటిటీతో రూ.50కి రైతా, ఊరగాయ, సలాడ్ లేదా పాపడ్ వంటి ఇతర ఆహార పదార్థాలు ఉండవచ్చు.
సాధారణంగా ట్రైన్‌లో జనరల్ కోచ్‌లలో పరిమితికి మించి ప్రజలు ప్రయాణిస్తుంటారు. తరచూ రద్దీగా ఉండే ఈ కోచ్‌లలో ప్రయాణించే వారి అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ వెసులుబాటు కల్పించారు. అయితే మనకు ట్రైన్‌లో వచ్చే ఆ అండాబిర్యానీ, వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇప్పుడు ఇవి కూడా అంతే ఉంటే ఇక అస్సామే..!!
COMMENTS