Inspiration: Recognized by the Prime Minister as the second best app in the country.. Ravi Teja is a role model for many..!
స్ఫూర్తి: దేశంలోనే రెండో అత్యుత్తమ యాప్ గా ప్రధానమంత్రి చేత గుర్తింపు.. రవితేజ ఎందరికో ఆదర్శం..!
మధ్య తరగతి నుండి వచ్చే ప్రతి విద్యార్థి కూడా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కలలు కంటూ ఉంటారు. మంచి ప్యాకేజీ ఇచ్చే సంస్థలో పని చెయ్యాలని కానీ లేదంటే ఓ స్టార్ట్అప్ ని మొదలు పెట్టాలని కానీ అనుకుంటూ వుంటారు. కన్న కలలు సార్ధకం చేసుకోవడం అందరికీ కుదరదు. ఆకొండి రవితేజ ఎంతగానో కష్టపడి చదువుకున్నాడు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని చిన్ననాటి నుండి అనుకుని దానికి తగ్గట్టే కృషి చేసాడు.
ఎంతో కష్టపడి IIT(BHU) లో సీటుని దక్కించుకున్నాడు. నిజానికి ఇక్కడ చదవాలని లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ వుంటారు. ఐఐటి చదువుకున్న రవి ఎక్కువ జీతం అందించే సంస్థల ఉద్యోగాన్ని వదులుకొని ప్రెగ్నెన్సీ రీసెర్చర్ గా మారిపోయాడు. జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత లక్షల జీతం ఇచ్చే కంపెనీల ఆఫర్లని కూడా రిజెక్ట్ చేసి ఐమమ్స్ (iMumz) ని స్టార్ట్ చేశాడు. రవి తన స్నేహితుడు మాయూర్ దూర్పటే మరియు అతని మెంటర్ రాజేష్ జగాసియా (ఆర్ట్ ఆఫ్ లివింగ్, సీనియర్ ఫ్యాకల్టీ) తో పాటు మరి కొంత మంది డైరెక్టర్లతో కంపనీని స్టార్ట్ చేశాడు. గర్భధారణ సమయం అనేది మానవుడి జీవితాన్ని మార్చే సమయం అని గ్రహించాడు. ఆయుర్వేదంలో కొన్ని జీవన శైలి సూత్రాలు వున్నాయి. ఉదాహరణానికి ‘గర్భ సంస్కార’- అంటే సరైన యోగ, మెడిటేషన్, పోషకాహారం, కడుపులో ఉన్న శిశువుతో తల్లి యొక్క బంధం ఇటువంటివి గర్భిణీ స్త్రీ కనుక అనుసరిస్తే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది.
పైగా తల్లి ఇటువంటివి అనుసరించినప్పుడు కడుపులో ఉన్న శిశువు తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇదివరకు ఇటువంటి విషయాలన్నీ కూడా పెద్దల ద్వారా మనం తెలుసుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో అలా నడిపించే వాళ్ళు అందరికీ అందుబాటులో లేరు. అందుకని ఐమమ్స్ ని మొదలుపెట్టాడు రవి. బిడ్డకి జన్మనివ్వాలని అనుకునే తల్లిదండ్రులు గర్భ సంస్కార ని ఐమమ్స్ ఇచ్చే శిక్షకులు ద్వారా నేర్చుకోవచ్చు. మొదట్లో వీటినన్ని సక్రమంగా నడిపించేందుకు కష్టం అయ్యేది.
ఫండ్స్, విమర్శలు, టెక్నాలజీ చేరే క్రమంలో ఇబ్బందులు మొదలైనవి మొదట్లో వచ్చాయి. కానీ కష్టపడితే ఏదైనా సాధ్యమే కదా..? ఏడాదిలో అంతా తిరిగిపోయింది. నేడు, పది లక్షలకి పైగా కుటుంబాలు ఈ యాప్ ని వాడుతున్నారు. దేశంలోనే రెండో అత్యుత్తమ యాప్ గా ప్రధానమంత్రి చేత గుర్తింపు లభించింది. అంతే కాదు ఐమమ్స్ టీం భారతదేశంలో వ్యాపారంలో అతిపెద్ద ప్రదర్శన ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ సీజన్ 2లో కూడా ప్రదర్శించబడింది. లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు, CEO అయిన పెయుష్ బన్సాల్ నుండి 70 లక్షల డీల్ ని ఐమమ్స్ పొందింది.
COMMENTS